ఆర్థిక భారం, వ్యక్తిగత స్వేచ్ఛకు దూరమవుతుండటమే కారణం
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘డింక్’ విధానం
భారత్‌లోనూ పెరిగిపోతున్న ఈ తరహా సంస్కృతి
పిల్లల్ని వద్దనుకుంటున్న భార్యాభర్తలు
భార్యాభర్తలకు పిల్లలు భారమవుతున్నారు. అందుకే పలు జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నాయి. ఇద్దరూ కష్టపడి సంపాదించినా బతకడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచి.. వారిని ప్రయోజకుల్ని చేయడం పెనుభారంగా మారుతోంది. లక్షలకు లక్షలు పోసి వారిని చదివించాలంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. ఇక వారి ఆలనా పాలనా చూడటంతోనే తమ జీవితమంతా కరిగిపోతోందని జంటలు భయపడుతున్నాయి. అందుకే పలువురు భార్యాభర్తలు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు.
పూర్వకాలంలో పిల్లల్ని కనడానికి ఎలాంటి నిబంధనలూ ఉండేవి కావు. భార్యాభర్తలు ఎంతమందినైనా కనొచ్చు. పది, పదిహేను మంది పిల్లల్ని కనేవారు. ముగ్గురు, నలుగురు పిల్లలుండటం అనేది సర్వసాధారణం ఆ రోజుల్లో. అంతెందుకు షాజహాన్ ప్రేమతో తాజ్‌మహల్ కట్టేలా చేసిన ముంతాజ్‌కు పద్నాలుగు మంది పిల్లలు. భారతంలో కుంతీదేవికి ఆరుగురు కుమారులు, రామాయణంలో దశరధుడికి నలుగురు సంతానం.
ఇక ఎన్టీ రామారావుకి 12 మంది పిల్లలు. ఇక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న వారి సంఖ్య లెక్కే లేదు. అలాంటి మన కుటుంబ వ్యవస్థలోకి ఇప్పుడు డ్యుయల్ ఇన్‌కం నో కిడ్స్(డింక్) సంస్కృతి చొచ్చుకొచి్చంది. భార్యాభర్తలు ఉద్యోగం చేసి వచి్చన డబ్బుతో జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనినే డింక్ విధానంగా పిలుస్తున్నారు. ఇప్పుడిది దేశంలోనూ వేగంగా విస్తరిస్తోందని ఇటీవల విడుదలైన ‘లాన్సెట్ నివేదిక’ స్పష్టం చేసింది.
పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే బాగా ఇది విస్తరించింది. ఇక మన దేశంలో నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోనూ వేగంగా చొచ్చుకొస్తోంది. ఈ డింక్స్ కల్చర్ వలన 2050 నాటికి 90 దేశాల్లో జనాభా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటా విశ్లేషణ ఆధారంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది.
కోరికలను చంపుకొని..
పిల్లల్ని పెంచడం కోసం రుణాలు తీసుకోవడం, ఈఎంఐలు కట్టడమే భార్యభర్తలకు సరిపోతుంది. దీంతో చాలా మంది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఒత్తిడికి లోనై, మానసిక ఆందోళనలు, కోరికలు చంపుకొని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. బ్రూకింగ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం.. ఒక బిడ్డను 17 ఏళ్ల వయసు వచ్చే వరకు పెంచాలంటే దాదాపు 3 లక్షల డాలర్లకు పైగా ఖర్చవుతుంది.
పిల్లల చదువులు, వైద్య ఖర్చులకే డబ్బంతా ఖర్చయితే తమ పరిస్థితేంటని నేటి తరంలో దాదాపు 61 శాతం మంది భార్యాభర్తలు ఆలోచిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం.. 18 నుంచి 49 ఏళ్ల వయస్సు ఉన్న డింక్ జంటల్లో 44 శాతం మంది పెరుగుతున్న జనాభా వాతావరణ సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో పిల్లలను కనడం లేదని వెల్లడించారు.
మనదేశంలోనూ వేగంగా..
మన దేశంలోనూ డింక్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ఉత్తరాదితో పోలి్చతే దక్షిణాదిలోనే ఇది ఎక్కువగా ఉంది. లాన్సెట్ నివేదిక ప్రకారం..1950లో భారత్‌లో సంతానోత్పత్తి రేటు 6.18 శాతంగా ఉండగా, ఇది 1980 నాటికి 4.60కు చేరింది. 2021లో 1.91 శాతానికి పడిపోయింది. మన దేశంలో 30 శాతం మంది డింక్ సంస్కృతిని అవలంబిస్తున్నారు. ఇందులో మరో ఆశ్చర్యమేంటంటే.. పట్టణాల్లో 22 శాతం మంది డింక్‌లుగా మారితే, గ్రామాల్లో 42 శాతం మంది ఉన్నారు.
యుక్త వయసులో బానే ఉంటుంది గానీ..
సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి విస్తరిస్తున్న డింక్ సంస్కృతి వల్ల పిల్లలు లేకుండా జీవించడం యుక్త వయసులో బానే ఉంటుంది.. కానీ కొన్నేళ్ల తర్వాత అందరూ ముసలివాళ్లే మిగులుతారు. వారి ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ ఉండరు. దంపతుల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగానే బతకాలి. అది వారికి నరకంగా మారుతుంది. అలాగే కుటుంబం, సమాజంలోనూ సహజత్వంలో మార్పు వస్తుంది. ఇది సమాజంలోని విలువలు, సంప్రదాయాలను కూడా ప్రభావితం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment