ప్రియుడితో కలిసి తన ఇద్దరు బిడ్డలకు చిత్రహింసలు
చార్జింగ్ వైరుతో కొట్టి.. గాయాలపై కారం
నోట్లో మిరపకాయలు కుక్కి ఆ తల్లి పైశాచికానందం
ఛిద్రమైన చిన్నారుల శరీరాలు
గాయాలను చూసి కంటతడి పెట్టిన పోలీసులు, వైద్యులు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన
బాధ్యులపై చర్యలకు ఆదేశించిన కలెక్టర్ కె.వెట్రిసెల్వి
జంగారెడ్డిగూడెం: బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకుంటేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లికి ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది.. ఓ తల్లి తన బిడ్డల పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ప్రియుడితో కలిసి వారిని చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికానందం పొందింది. ప్రియుడు రోజూ సెల్ ఫోన్ చార్జింగ్ వైరుతో చిన్నారుల ఒంటిని ఛిద్రం చేస్తున్నా.. ఆ అమ్మ మనసు కరగలేదు. పైగా ఆ పచ్చి గాయాలపై కారం పోసి.. ఆ బిడ్డల నోట్లో మిరపకాయలు కుక్కింది. బిడ్డలు అల్లాడిపోతుంటే.. ప్రియుడితో కలిసి వికృతానందం పొందింది! పోలీసులతో పాటు ఆ బిడ్డలకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా చిన్నారుల ఒంటి మీది గాయాలు చూసి కన్నీళ్లు పెట్టారంటే.. ఆ చిన్నారులను ఆ తల్లి ఎంత చిత్రవధకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
తల్లి శాడిజం.. పిల్లలకు చిత్రవధ
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన గానాల శారద కొంతకాలంగా భర్తతో విడిపోయి తన తొమ్మిదేళ్ల కుమారుడు ఉదయ్‌రాహుల్, ఐదేళ్ల కుమార్తె రేణుకతో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు స్థానికుడు, అవివాహితుడు నల్లవెలుగుల పవన్‌కుమార్‌తో పరిచయమేర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో శారద, పవన్‌కుమార్‌లు జంగారెడ్డిగూడేనికి మకాం మార్చి సహజీవనం చేస్తున్నారు. అక్కడే హోటళ్లలో పనిచేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. పవన్‌కుమార్ రోజూ మద్యం తాగొచ్చి శారద పిల్లలైన ఉదయ్‌రాహుల్, రేణుకలను సెల్‌ఫోన్ చార్జింగ్ వైర్‌తో తీవ్రంగా కొట్టేవాడు. దీనికి శారద అడ్డు చెప్పక పోగా ప్రియుడికి వంతపాడేది. ఇలా పవన్‌కుమార్, శారదలు చిన్నారులను వైరుతో కొట్టడంతో వారి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అలా అవుతున్న గాయాలపై వారు కారం పోసేవారు. మంటను భరించలేక చిన్నారులు అల్లాడిపోతుంటే.. వారి నోట్లో కారంతో పాటు మిరపకాయలు కుక్కి రాక్షసానందం పొందేవారు. వీరు పెడుతున్న హింసలకు ఉదయ్‌రాహుల్‌కు పళ్లు ఊడిపోగా, రేణుక కంటికి తీవ్ర గాయమైంది.
నా ప్రియుడిపై దెబ్బ పడితే ఊరుకోను..
ఎప్పటిలాగానే శనివారం అర్ధరాత్రి చిన్నారులను మళ్లీ చిత్రహింసలకు గురిచేశారు. ప్రియుడితో కలిసి తల్లిపెడుతున్న బాధలను తట్టుకోలేక చిన్నారులు ఇద్దరూ భయంతో బయటకు పరుగులుదీశారు. దీంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని.. పవన్‌కుమార్‌కు దేహశుద్ధి చేసే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని కొడితే ఊరుకోనంటూ శారద అడ్డుకుంది. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఎస్‌ఐ షేక్ జబీర్, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒంటి నిండా గాయాలతో నిండిపోయిన చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చిన్నారులను డీఎస్పీ రవిచంద్ర, సీఐ కృష్ణబాబు పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బేబీ కమలతో పాటు వైద్యులు, పోలీసులు కూడా చిన్నారుల దుస్థితిని చూసి కంటతడి పెట్టారు. ఈ ఘటనను కలెక్టర్ కె.వెట్రిసెల్వి తీవ్రంగా పరిగణించి బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment