అతని గురించిన ఆలోచనలు వెంటాడుతున్నాయి..?
నా వయసు 39. మంచి భర్త, బుద్ధిమంతుడైన కొడుకు. నా భర్త ఆఫీసుకు, మా అబ్బాయి కాలేజీకి వెళ్లాక నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను గతం వెంటాడుతోంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకతన్ని మూగగా ఆరాధించేదాన్ని. అది వన్‌సైడ్ లవ్ మాత్రమే! అయినా ఇప్పటికీ అతను నా ఊహల్లో ఉండిపోయాడు. మా వారు, బాబు నా పక్కనే ఉన్నప్పుడు కూడా అతని ఆలోచనలే. అతన్ని చూసి ఇరవై ఏళ్లయింది. అయినా అతన్ని మరచిపోలేకపోతున్నాను. ఏదైనా యాక్సిడెంట్ అయి గతాన్ని మరచిపోతే బాగుండనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు.
- ఒక సోదరి, హైదరాబాద్
గత జ్ఞాపకాలను మరచిపోలేక మీరు పడుతున్న అవస్థను నేను అర్థం చేసుకోగలను. అయితే, దురదృష్టవశాత్తూ చాలామంది కోరుకుంటున్నట్లుగా గతాన్ని మరచిపోయేందుకు మందులంటూ ఏమీ ఉండవు. యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మరచిపోవడం అనేది టీవీల్లోనూ, సినిమాల్లోనూ చూసేదే కానీ, వాస్తవంగా జరిగేది కాదు. పరిస్థితులు, పరిసరాలు మారడం వల్ల కొన్ని స్మృతులను మరచిపోవడం సహజం. కాని, ఇరవై ఏళ్లయినా అతన్ని మరచిపోలేకపోతున్నానంటున్నారు. అది పూర్తిగా మీ తప్పు కాదు. మెదడులోని కొన్ని రసాయనాలలో చోటుచేసుకునే అసమతుల్యతల కారణంగా కూడా అలా జరుగుతుంది.
మీ జీవితంలోని ఒంటరితనం వల్ల, మీరు లైఫ్‌ని సరిగా ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల, ఇతరత్రా పనేమీ లేకపోవడం వల్ల కూడా మీకు తెలియకుండానే మీ మెదడు పొరలలో నిక్షిప్తమై ఉన్న సంఘటనలనే గుర్తు తెచ్చుకుంటూ, అదే పనిగా అతన్నే తలచుకుంటూ ఉంటున్నారు. దాని ఫలితమే ఇది. మీరు దీనిని ఇలాగే వదిలేస్తే క్రమేపీ డిప్రెషన్‌లోకి జారిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
ఆ జ్ఞాపకాల నుంచి మీరు బయటకు రావాలంటే, తీరిక లేకుండా ఉండేలా ఏదో ఒక వ్యాపకం కల్పించుకుంటూ క్రమేపీ మరచిపోయేందుకు ప్రయత్నించాలి. దానితోపాటు మీ కుటుంబసభ్యులను ఎవరినైనా వెంటబెట్టుకుని సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి వారి సాయంతో మీ పరిస్థితినంతటినీ వివరించి, కొంతకాలంపాటు తక్కువ మోతాదులో ఉండే యాంటీ డిప్రెసెంట్స్ వాడటం, కాన్సెలింగ్ తీసుకోవడం, ఫ్యామిలీతోనూ, స్నేహితులతోనూ వీలైనంత ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల మీరు మీ పాత జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటపడగలుగుతారు. ప్రయత్నించి చూడండి. విష్ యు ఆల్ ది బెస్ట్.
డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్