మెదడుకు మళ్లీ ప్రాణం పోస్తే..!
బ్రెయిన్ ప్రిజర్వేషన్‌పై పెరుగుతున్న ఆసక్తి
మానవ మస్తిష్కం. దాదాపు 10 వేల కోట్ల న్యూరాన్ల సముదాయం. శరీర కదలికల్ని, సామర్థ్యాల్ని, అంచనాకందని ఆలోచనల్ని నియంత్రించే.. లక్షలాది జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకునే భాండాగారం. అందులోని ఒక్కో న్యూరాన్.. ఒక్కో సమాచార కేంద్రం. న్యూరాన్లు కూడా సాధారణ కణాల్లాంటివే. అయితే, సాధారణ కణాలను, న్యూరాన్లను వేరు పర్చేది.. న్యూరాన్లలోని విద్యుత్స్రాయన సంకేత(ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్) సామర్థ్యం.
ఆ సామర్థ్యంతోనే అవి సమాచారాన్ని సేకరించడం, మార్పిడి చేయడం చేస్తుంటాయి. జీవితకాలం విషయంలోనూ ఇవి ప్రత్యేకమైనవే. అయితే, మనిషి చనిపోయిన క్షణాల్లోనే ఈ న్యూరాన్ వ్యవస్థ కూడా శిథిలమవడం ప్రారంభమవుతుంది. చనిపోయాక కూడా బ్రెయిన్‌ను సజీవంగా ఉంచగలిగితే.. దాన్లోని న్యూరాన్లు నాశనం కాకుండా కాపాడగలిగితే.. భవిష్యత్తులో సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత ఆ మస్తిష్కం పనితీరును, దానిలోని న్యూరాన్లలో దాగిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా అద్భుతాలు చేయవచ్చు.
ఇప్పుడు మన మేధను భద్రపరిచే సాంకేతిక వ్యవస్థపై విశ్వవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. న్యూయార్క్‌లోని 23 ఏళ్ల కిమ్‌సోజీ తనకు కేన్సర్ సోకి చనిపోయే పరిస్థితి తలెత్తడంతో తన మెదడును భద్రపరచటం ద్వారా.. తన భావాలను, అనుభూతులను, అనుభవాలను శాశ్వతం చేసుకోవాలని సంకల్పించింది. ఈ రోజు కాకపోయినా కొన్ని దశాబ్దాల తరువాతైనా అభివృద్ధి చెందిన శాస్త్రసాంకేతికత సాయంతో మస్తిష్కాన్ని, దాన్లోని న్యూరాన్లను స్కాన్ చేసి, కోడింగ్ చేసి, ఆ న్యూరాన్ల ప్రత్యేక సామర్థ్యాలను ముందు తరాలకు అందించాలనుకుంది.
అయితే ఇందుకోసం కనీసం 80వేల పౌండ్లు(రూ.82 లక్షలు) ఖర్చవుతాయి. కిమ్ తన తండ్రిని అడిగితే అంత డబ్బును సమకూర్చలేనన్నాడు. దీంతో ఆమె ఫేస్‌బుక్ ద్వారా విరాళాల రూపంలో ఆ మొత్తాన్ని సేకరించింది. అయితే ఈ మస్తిష్క సంరక్షణ అంత సులువు కాదు. ముందుగా, వ్యక్తి చనిపోవడానికి క్షణాల ముందే ఈ ప్రక్రియ ప్రారంభం కావాలి. అంతకుముందే క్రయోనిక్స్ టీం(శరీర భాగాలను భద్రపరిచి, చెడిపోకుండా సంరక్షించే బృందం)ను అప్రమత్తం చేయాలి.
చనిపోగానే మెదడుకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలి. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవాలి. మెదడును వేరు చేసి, తరలించి, మైనస్ 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ద్రవరూప నైట్రోజన్‌లో భద్రపరచాలి. ఆమె మరణానికి కొద్ది గంటల ముందు.. బ్రెయిన్ ప్రిజర్వేషన్‌లో అమెరికాకు చెందిన ‘అల్‌కొర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్’ కిమ్ మెదడును అలా భద్రపరచింది. ఈ సంస్థే ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ టెడ్ విలియమ్స్ మెదడును భద్రంగా సంరక్షిస్తోంది.