తాగుపోటు | Effects begin with alcohol being taken into drinking | Sakshi
Sakshi News home page

తాగుపోటు

Published Thu, Jan 3 2019 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM

Effects begin with alcohol being taken into drinking - Sakshi

తాగగానే కంట్రోల్‌ తప్పుద్ది. అప్పటికైతే కొంచెం మగాడు అన్న ఫీలింగ్‌ వస్తుందిగానీ పెళ్లాం, పిల్లలు, కుటుంబం, మంచి–చెడు చూసుకునేంత మగాడైతే కాలేడు. చుక్క దిగినప్పటి నుంచి కక్కేవరకు అన్నీ పోట్లే!   గుండెపోటు, రక్తపోటు, మెదడుపోటు, నైతికతకు పోటు మానవత్వానికి పోటు, గౌరవానికి పోటు, చివరకు జీవితానికే పోటు! లోపల కుళ్లిపోతారు. బయటకు కుళ్లు వాసన వస్తుంది. పిల్లలు ముక్కు పట్టుకుంటారు. పెద్దలు తల పట్టుకుంటారు. బయటివారు కాలర్‌ పట్టుకుంటారు. థూ... ఏంటీ దౌర్భాగ్య జీవితం. అంత మంచి పుట్టుక ఇచ్చిన  తల్లిదండ్రులు, సంస్కారం ఇచ్చిన గురువులు,  గౌరవం ఇచ్చిన సమాజం అంతా వికారమైపోతుంది. మీకు దండం పెడతాం. మందు మానండి...  మీ ఫ్యామిలీ ప్రేమ పొందండి. 

కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌ అంటూ కొత్త ఏడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఎప్పటిలాగే ఆనవాయితీ. తమ నిర్ణయంపై ఒకటి రెండు రోజులు గట్టిగానే ఉంటారు. ఆ తర్వాత కాస్తంత మెత్తబడటం మామూలే. ఇప్పటికి ఎలాగూ ఓ నాలుగు రోజులు దూరంగా ఉండే ఉంటారు. ఇక మద్యంపై ధ్యాస మళ్లే ఈ దశలో దాని దుష్ప్రభావాలను మరో మారు గుర్తుచేసుకుంటే మీ నిర్ణయం, మీ నిబద్ధత మరింత నిశ్చలంగా ఉంటాయి. అలా ఉండటం కోసమే ఈ కథనం. మద్యంతో దేహంపై చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి.  అవి మన శరీరంలోని దాదాపు అన్ని వ్యవస్థలపైనా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. మెదడు (నాడీవ్యవస్థ), జీర్ణవ్యవస్థ, గుండె, రక్తప్రసరణ వ్యవస్థ, సెక్స్‌ సామర్థ్యంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు... ఇలా అన్నీ దెబ్బతింటాయి. ఆ అన్నింటికంటే అన్ని వ్యవస్థలనూ నియంత్రించగల అత్యంత ప్రధానమైన మెదడూ, నరాలూ, నాడీవ్యవస్థ చాలా ఎక్కువగా దుష్ప్రభావానికి లోనవుతుంది. 

నోట్లోకి వచ్చీ రావడంతోనే అనర్థాలు ప్రారంభం... 
ఆల్కహాల్‌ను అలా నోట్లోకి తీసుకున్నప్పట్నుంచి దాని దుష్ప్రభావాలు మొదలవుతాయి. మొదట నోట్లో ఉండే మ్యూకస్‌ పొరల మీద ఆల్కహాల్‌ ప్రభావం కనిపిస్తుంది. ఆహారమైనా జీర్ణం కావడానికి చిన్న పేగుల వరకు రావాలిగానీ... మద్యం మాత్రం నోట్లోంచే ఒంట్లోకి ఇంకిపోతుంటుంది. అలా ఆ ఇంకడం అన్నది చిన్నపేగుల వరకూ కొనసాగుతూనే ఉంటుంది. 

మెదడుపై మద్యం చేసే మాయ... 
మద్యం తొలి మోతాదుల్లో ఒకటి రెండు డ్రింక్స్‌ వరకు చాలా హాయిగా, రిలాక్సింగ్‌గా ఉంటాయి. తాము చాలా తేలికై పోయిన ఫీలింగ్‌ ఉంటుంది. ఇన్హిబిషన్స్‌ తగ్గుతాయి. పూర్తి స్పృహలో ఉన్నప్పుడు విచక్షణతో తొక్కిపట్టి ఉంచిన ఎన్నో భావనలు ఆ సమయంలో పురివిప్పుతాయి. ఆ సమయంలో ధైర్యం పుంజుకున్నట్లు అనిపిస్తుంది. విచక్షణరహితంగా ఏదైనా  మాట్లాడగలుగుతారు. ఒత్తిడి తగ్గినట్లుగా భ్రాంతి కలుగుతుంది. బాగున్నాయని అనిపించే ఈ ఫీలింగ్స్‌ అన్నీ తాత్కాలికాలే. ఏ సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోగలమనే ధీమా ఆ సమయంలో తాత్కాలికంగా కాసేపు మాత్రమే ఉంటుంది. వీటన్నింటికీ కారణం... మన మెదడులోని ఓపియాయిడ్‌ అనే కణాల నుంచి డోపమైన్‌ అనే సంతోష రసాయనాలు బయటికి వచ్చి మెదడును కాసేపు ఉత్తేజపరచడమే. దాంతో ఒక ఆనందం, ఆహ్లాదం, తనువంతా హాయిగా తేలిపోతున్న అనుభూతులు కలుగుతాయి. ఆ ఆనందాహ్లాద భావనలను కోల్పోకూడదనే ఉద్దేశంతోనే తాగడాన్ని కొనసాగిస్తుంటారు. అవెప్పుడూ సొంతం కావాలన్న తపనతో అదేపనిగా తాగుతుంటారు.అప్పట్నుంచి అనర్థాలు మొదలవుతాయి. అత్యంత ఎక్కువ మోతాదుల్లో తీసుకున్న ఈ మద్యం మెదడులోని ప్రీ–ఫ్రంటల్‌ కార్టెక్స్‌ అనే భాగాన్ని దెబ్బతీయడం మొదలవుతుంది. మనలో లాజిక్‌తో కూడిన ఆలోచనలకు, ప్లానింగ్‌కూ, అంచనావేయడానికి తోడ్పడే ఈ భాగం క్రమంగా పనిచేయకపోవడంతో క్రమంగా మన భావోద్వేగాలపై అదుపులేకపోవడం, రిస్క్‌ తీసుకునే పనులకు పాల్పడటం, ముప్పును తప్పించుకోగలమనే అతివిశ్వాసం పెరగడం వంటివి జరుగుతాయి. కానీ దానికి తగ్గట్టుగా  శరీరపు కదలికలు ఉండవు. దాంతో అనేక అనర్థాలు జరుగుతాయి. ఆ తర్వాత టెంపోరల్‌ లోబ్‌ ప్రభావితమవుతుంది.ఫలితంగా మరచిపోవడం, చెప్పే మాటలకు చేతలకు పొంతన లేకపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి.

మద్యం... దాంతో కలిగే అనర్థాలు... 
నిద్రకు అంతరాయం: మనం రాత్రి హాయిగా పడుకుంటే ఉదయం మంచి  రిలాక్సేషన్‌ ఫీలింగ్‌తో నిద్రలేస్తాం. ఇందుకు కారణం మన నిద్రలోని ఆర్‌ఈఎమ్‌ అనే దశ. ఇందులో కనుపాపలు స్పందిస్తూ ఉంటాయి.నిద్రలేవగానే హాయినిచ్చేందుకు ఈ ఆర్‌ఈఎమ్‌ దశ దోహదం చేస్తుంది. విపరీతంగా మద్యం తాగినప్పుడు మనలో ఆర్‌ఈఎమ్‌ దశ లోపిస్తుంది. దాంతో నిద్రలేచాక చికాకుగా ఉండి, హాౖయెన ఫీలింగ్‌ ఉండదు.అంతా చికాగ్గా ఉంటుంది. 

అసలు రుచి తెలియకుండా ‘కంజీనర్ల’ మాయ! 
ఆల్కహాల్‌లో ఉండే కొన్ని పదార్థాలను ‘కంజీనర్స్‌’ అంటారు. ఆల్కహాల్‌ తాగగానే మనకు పదార్థం తాలూకు అసలు రుచి తెలియదు. వాసన పసిగట్టలేం. రంగును గుర్తించలేం. అలా రంగు, రుచి, వాసనలను తెలియకుండా చేసేవే ఈ కంజీనర్స్‌. మద్యపానం తర్వాత వచ్చే మైగ్రేన్‌ తలనొప్పులు, మర్నాడు ఉదయం వచ్చే హ్యాంగోవర్‌కు ఈ కంజీనర్సే ప్రధాన కారణం. స్లీప్‌ ఆప్నియాతో ప్రాణాలకే ప్రమాదం: మద్యం తాగిన వారిలో గురక వస్తుంది. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది. ఇలా గురక వచ్చి శ్వాసకుఅంతరాయం కలిగే కండిషన్‌ను ‘స్లీప్‌ ఆప్నియా అంటారు. మంచి నిద్రలో మన గొంతు కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఇది చాలా మందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి,  శ్వాసనాళం  కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక.  శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి  నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని  మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. ఇలా శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేక సార్లు వస్తుంది. ఆప్నియా కండిషన్‌లో మనం తీసుకునే ఆక్సిజన్‌ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల అది శరీరంలోని అన్ని ఆవయవాలపై దుష్ప్రభావం చూపవచ్చు. కొందరిలో స్లీప్‌ ఆప్నియా వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావచ్చు. మరికొందరిలో రక్తపోటు పెరగవచ్చు. అప్పటికే గుండెజబ్బుతో బాధపడుతున్న రోగుల్లో ఇలా రక్తపోటు పెరగడం అన్నది గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. నిద్రలో ప్రమాదకరమైన గురక (స్లీప్‌ ఆప్నియా)తో ఒక్కోసారి ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. 

మైగ్రేన్‌: ముదురు రంగులో ఉండే వైన్‌ లేదా రమ్‌ వంటి ఆల్కహాల్‌ ద్రవాలు తాగినప్పుడు అవి తొలుత మైగ్రేన్‌ తలనొప్పిని ప్రేరేపించవచ్చు. 
మూర్ఛ: సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆల్కహాల్‌ అలవాటు ఉన్న వారిలో మూర్ఛ (సీజర్స్‌/ఫిట్స్‌) వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ. అందుకే ఆల్కహాల్‌ను మొదలే పెట్టకూడదు. ఏదైనా కారణాల వల్ల ఒకసారి తాగినా దాని దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు గుర్తించి మానేయాలి. తమ నియంత్రణలో తాము ఉండలేకపోవడం : దీర్ఘకాలం మద్యం తాగేవారిలో మెదడులోని బ్యాలెన్సింగ్‌కు తోడ్పడే సెరిబెల్లమ్‌ భాగం దెబ్బతింటుంది. దాంతో వారు సరిగా నడవలేరు. తూలుతున్నట్లుగా నడుస్తారు. మాట కూడా ముద్దముద్దగా, అర్థం కానట్టుగా (స్లర్ర్‌డ్‌ స్పీచ్‌) వస్తుంది. ఆల్కహాల్‌తో వచ్చే పెరిఫెరల్‌ న్యూరోపతి:ఆల్కహాల్‌ వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు మన ఒంట్లో మండుతున్న భావనలు (బర్నింగ్‌ సెన్సేషన్‌) ఉండవచ్చు.  అరికాళ్లు, అరచేతుల్లో నొప్పి, సూదులతో గుచ్చుతున్నట్లుగా అనిపించడం జరగవచ్చు. క్రమంగా నరాల దొంతరలు (నర్వ్‌ ఫైబర్స్‌) దెబ్బతిని... ఆ తర్వాత్తర్వాత చేతులు–కాళ్లు దెబ్బతిని నడవలేకపోవడం, ఏ పనీ చేయలేకపోవడం వంటి స్థితి రావచ్చు. అయితే మద్యం మానేయడం ద్వారా దీర్ఘకాలంలో ఈ పరిస్థితి మెల్లగా చక్కబడి మునుపటిలా అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక మద్యంతో తలతిరగడం, అంగస్తంభన సమస్యలు, నియంత్రించలేనంత ఒత్తిడితో మూత్రంవస్తుండటం, మాటిమాటికీ మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంపై నియంత్రణ లేకపోవడం వంటి దుష్పరిణామాలు సంభవించవచ్చు. ఇవేగాక... నాడీ వ్యవస్థలో లోపాలు అనేక లోపాలు అంటే... ఉదాహరణకు జ్ఞాపకశక్తిలోపం, అనేక మానసిక వ్యాధులకు లోనుకావడం, స్పర్శ కోల్పోవడం, తిమ్మిర్లు వంటి సమస్యలూ రావచ్చు.  అనేక ఇతర శారీరక వ్యవస్థలూ... మద్యంతో వాటిపై ప్రభావం

∙జీర్ణకోశ వ్యవస్థ: మద్యం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. గ్యాస్ట్రయిటిస్, కడుపులో పేగులో పుండ్లు (అల్సర్స్‌), అరుగుదలలో లోపాలు, జీర్ణమైన ఆహారం ఒంటికి పట్టడంలో లోపాలు (మాల్‌ అబ్జార్‌ప్షన్‌ సిండ్రోమ్‌), క్యాన్సర్లు, హీమరాయిడ్స్, కాలేయం దెబ్బతినడం, పాంక్రియాస్‌ గ్రంథి సమస్యలు కనిపిస్తాయి. 
∙గుండె: ఆల్కహాల్‌ కార్డియోమయోపతి (గుండె కండరం పెరగడం), గుండె స్పందన, లయల్లో మార్పులు, గుండెపోటు, అథెరోస్లీ్కరోసిస్‌ సమస్యలు. 

∙సెక్స్‌ సమస్యలు : సామర్థ్యం తగ్గడం, అంగస్తంభన సమస్యలు రావచ్చు. 
∙గర్భిణులు ఆల్కహాల్‌ తాగడం వల్ల పుట్టబోయే పిల్లలకు బుద్ధిమాంద్యం, అవయవాలు సరిగ్గా ఎదగకపోవడంతో అనేక వైకల్యాలు కనిపించవచ్చు. 
∙చూపు దెబ్బతినడం : అన్ని కండరాలు దెబ్బతిన్నట్లే చాలా అరుదుగా కంటి కండరాలు దెబ్బతిని చూపు తగ్గడం జరగవచ్చు. ఇక ఆల్కహాల్‌లో మిథనాల్‌ కలిసినప్పుడు ఆ కల్తీసారా తాగి ఒకేసారి చాలామంది కంటిచూపు కోల్పోవడం చాలా సందర్భాల్లో జరిగిన దుష్పరిణామమే. 
∙మద్యం తాగినప్పుడు ఆకలి మందగించడంతో సరిగ్గా ఆహారం తీసుకోరు. అది అనేక వైటమిన్‌ లోపాలకు కారణం అవుతుంది. 
∙బింజ్‌ డ్రింకింగ్‌తోనూ ప్రమాదమే: ఎప్పుడో ఒకసారి తాగుతున్నాం కదా అనే వంకతో కొంతమంది ఒకేసారి చాలా ఎక్కువగా తాగేస్తుంటారు. దీన్నే బింజ్‌ డ్రింకింగ్‌ అంటారు. అలా తాగినప్పుడు 6 నుంచి 36 గంటల పాటు మనలో చక్కెర పాళ్లు తీవ్రంగా తగ్గిపోతాయి. అందుకు కారణం మన చక్కెరపాళ్లను సరిదిద్దుతూ/నియంత్రిస్తూ ఉండాల్సిన కాలేయం తన అసలు పనిని వదిలేసి ఆల్కహాల్‌ విషాలను విరిచేస్తూ ఉండటం. దాంతో మన ఒంట్లోని నీళ్ల (ద్రవాల) పాళ్లు తగ్గుతాయి. డీ–హైడ్రేషన్‌ జరిగి దాహం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ స్థితి 6 – 36 గంటల పాటు కొనసాగుతుంటుంది. దాహంతో   పాటు వికారం (వాంతి వస్తున్న) ఫీలింగ్‌ ఉంటుంది. ఒక్కొక్కసారి మెదడులోని సిరల్లో రక్తం గడ్డకట్టవచ్చు. ఫలితంగా తలనొప్పి మొదలుకొని... వాంతులు, మూర్ఛ, కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా రావచ్చు. ఇలా బాగా తాగేసినప్పుడు మన అంచనా వేసే శక్తి లోపించడం (జడ్జిమెంట్‌ దెబ్బతినడం), అవయవాలను సమన్వయం చేసుకోలేకపోవడం (కోఆర్డినేషన్‌ లేకపోవడం), దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి పరిణామాలకు దారితీసి రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. రక్తంలో మితిమీరి ఆల్కహాల్‌ ఉండటం అంటే ప్రతి 100 ఎమ్‌ఎల్‌ రక్తంలో 300 ఎంజీ ఆల్కహాల్‌ ఉంటే అది ఒళ్లు చల్లబడిపోవడం (హైపోథెర్మియా) మొదలుకొని రక్తపోటు తగ్గిపోవడం (హైపోటెన్షన్‌)తో పాటు శ్వాసమందగించి మరణానికి దారితీయవచ్చు. 

అలవాటును తప్పించడం / చికిత్స ఇలా... 
మద్యం అలవాటును     అధిగమించడానికి, దాని దుష్ప్రభావాలకు చేసే చికిత్సలో భాగంగా మొదట అది మానే సమయంలో కనిపించే లక్షణాలకు చికిత్స చేస్తారు. తర్వాత తాగుడు మాన్పించడం కోసం మందులు ఇస్తూ అదే సమయంలో సైకోథెరపీ, కౌన్సెలింగ్‌ చేస్తారు. సమాజంలో మనుగడ సాధించడం కోసం అవసరమయ్యే సామాజిక నైపుణ్యాల శిక్షణ (సోషల్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌) కూడా ఇస్తారు. ఇందుకోసం మానసిక వైద్యుల పర్యవేక్షణ అవసరం. అందుకే మద్యం మానాలన్న తీవ్రమైన సంకల్పబలంతో మానసిక వైద్యులను కలుసుకోవాల్సి ఉంటుంది. 

ప్రమాదాలు (యాక్సిడెంట్స్‌) 
మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్‌ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ.

కాలేయానికి ఎంతో ముప్పు! 
ఒంట్లోకి వచ్చే ప్రతి విషపదార్థానికీ ఒక చెక్‌పాయింట్‌ లాంటిది కాలేయం. దేహంలోకి వచ్చిన ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్‌) విరిచేయడం కాలేయం పనుల్లో ఒకటి. అంతేకాదు... ఆ విషాలు ఒంట్లోంచి బయటకు వెళ్లేలా కూడా చూస్తుంది. మెదడు కూడా ఈ పనికి దోహదపడుతుంది. మెదడు మన  జీవక్రియలు వేగంగా జరిగేలా చూసి చెమటపట్టించేలా చేస్తుంది. అలాగే శ్వాసవేగం పెరిగేలా చూస్తుంది.మద్యం ఎక్కువగా తాగిన వారి చెమటలో కూడా దుర్గంధం వస్తుండటం గమనించవచ్చు. మనలో ఎక్కువైన మద్యాన్ని మెదడు, కాలేయం కలిసి బయటకు విసర్జించే ప్రక్రియలో భాగంగా చెమట ద్వారా కూడా మద్యం బయటకు వెళ్లేలా చేస్తాయి. అందువల్లనే ఆ దుర్వాసన. మరికాసేపటి తర్వాత మూత్రం ద్వారా కూడా మద్యం వల్ల చేరిన విషాలను బయటకు పంపేలా మెదడూ, కాలేయం శ్రమిస్తాయి. అలా మద్యం నుంచి రక్షించే కార్యక్రమం అది ఒంట్లోకి ప్రవేశించిన మరుక్షణం నుంచి జరుగుతుంటుంది. అయితే అవి బయటకు పంపే మోతాదు కంటే మనం తాగేది ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు, కాలేయాలు ఆ పని చేయలేక చేతులెత్తేస్తాయి. దాంతో అనర్థాలు, దుష్ప్రభావాలు కనిపించే దశలు మొదలవుతాయి. 

శనివారం రాత్రికీ మద్యానికీ సంబంధం ఏమిటి?
ఇక్కడో ఇట్రరెస్టింగ్‌ సినిమా టైటిల్‌లాంటి పేరుతో ఒక వ్యాధి ఉంది. దాని పేరే ‘సాటర్‌డే నైట్స్‌ పాల్సీ’. ఆసక్తికరమైన ఆ వ్యాధి ఏమిటో కాస్త చూద్దాం. నరాలు చచ్చుబడేలా చేసే వ్యాధులకు ‘పాల్సీ’ అనే మాట వాడతారు. ఉదాహరణకు సెరిబ్రల్‌ పాల్సీ అనే పిల్లల వ్యాధిలో వారిలోని నరాలు సక్రమంగా స్పందించకపోవడం వల్ల వాళ్ల కదలికలూ మామూలుగా ఉండవు. అవి చూరుగ్గానూ ఉండవు.  అలాగే ‘సాటర్‌డే నైట్స్‌ పాల్సీ’ అనే పాల్సీ కూడా మరొకటి ఉంది. ఇది పూర్తిగా పెద్దలది. మద్యం తాగే పెద్దలది. ఈ కండిషన్‌లోనూ నరాలు తాత్కాలికంగా చచ్చుబడిపోతాయి.  సాధారణంగా ఆదివారం సెలవు కాబట్టి శనివారం నాడు చాలామంది మద్యం ప్రియులు అదేపనిగా తాగేస్తుంటారు. ఎంతగా తాగుతారంటే... వాళ్లు అలాగే కుర్చీ మీద కూర్చుని నిద్రభుజం మీద తలపెట్టుకుని నిద్రపోతారు. దాంతో చేతికి వచ్చే ప్రధాన నరం అయిన ‘రేడియల్‌ నర్వ్‌’ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా అది తాత్కాలికంగా చచ్చుబడవచ్చు. ఇలా మద్యం తాగడం అనే ప్రక్రియ వీకెండ్‌ రాత్రే ఎక్కువ కాబట్టి ఆ కండిషన్‌కు ‘సాటర్‌డే నైట్స్‌ పాల్సీ’ అని పేరు పెట్టారు. జబ్బు పేరులో సాటర్‌డే అనే ఉన్నా ఇది మద్యం తాగిన ఏరోజైనా రావచ్చు. 
డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి, 
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, 
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement