
జీర్ణక్రియాసనాలు
1. ఉత్థానాసన
తాడాసనం (సమస్థితి)లో నిలబడి చేతులు రెండు తుంటిమీద ఉంచాలి. శ్వాస మెల్లగా వదులుతూ తుంటికీలు నుండి (నడుము నుండి కాకుండగా ఇంకా క్రిందభాగం నుండి) ముందుకు వంగాలి. నడుము ఆ పై భాగాలను బాగా సాగదీస్తూ, వీలైనంత వరకు మోకాళ్ళను ముందుకు వంచకుండా నిటారుగా ఉంచాలి. చేతులను తుంటిమీద నుండి కిందకు, చేతివేళ్ళను కిందకు అరచేతులను నేలమీద ఉంచితే ‘పాద హస్తాసనము’అంటారు. అదే, చేతివేళ్ళతో కాలి బొటనవేళ్లను పట్టుకున్నట్లయితే ‘పాదాంగుష్టాసనం’ అంటారు. చేతులు రెండూ కలిపి వెనకకు తీసుకువెళ్లినట్లయితే ‘ఉత్థానాసనం’ అంటారు. 3 లేదా 5 సాధారణ శ్వాసలు తరువాత శ్వాస తీసుకుంటూ తిరిగి తాడాసన స్థితికి రావాలి. ఒక వేళ రెండు చేతులు నేలమీదకు తీసుకురాలేనివారు చేతులు కింద రెండు ఇటుకలను కావల్సిన ఎత్తులో ఉంచి వాటి సపోర్ట్ తీసుకోవచ్చు.
జాగ్రత్తలు: ప్రారంభ సాధకులు, ఔ1 ఔ5 ప్రాంతంలో సమస్య ఉన్నవారు మోకాళ్లు ముందుకు వంచాలి.
ఉపయోగాలు: కేంద్ర నాడీ మండల వ్యవస్థకు, ఉదర భాగాలైన కాలేయం, జీర్ణాశయం, క్లోమగ్రంధికి మంచిది. మైగ్రేయిన్, తలనొప్పి, నిద్రలేమి మెనోపాజ్ వంటి సమస్యలకు పరిష్కారం.
స్పాండిలైటీస్‌కి పరీక్ష: చేతులు రెండు వెనుక భూమికి సమాంతరంగా వచ్చినట్లయితే స్పాండిలైటీస్ సమస్యలేనట్లు. కొంచెం ఆకాశం వైపునకు ఉన్నట్లయితే సమీప భవిష్యత్తులో స్పాండిలైటీస్ వస్తుందని, పూర్తిగా ఆకాశంవైపునకు ఉన్నట్లయితే స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నట్లు గమనించగలరు.
2. ఉపవిష్ట కోణాసన/ భూనమనాసన
ఉత్థానాసనంలో నుండి ప్రసారిత పాదోత్థానాసనంలోకి రావాలి. అంటే కాళ్లు రెండు బాగా స్ట్రెచ్ చేసి 4 లేదా 5 అడుగులు దూరం ఉంచి ముందుకి వంగాలి. తల నేలమీదకు తీసుకువచ్చి మాడు భాగం భూమి మీద పెట్టి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి, అరచేతులు ఇంటర్‌లాక్ చేసి పైకి సాగదీయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపి, శ్వాస వదులుతూ సీటు భాగాన్ని భూమి మీదకి తీసుకువచ్చి కూర్చోవాలి. కాళ్లు రెండు వైపులకు స్ట్రెచ్ చేసిన స్థితిలోనే ఉంచి, శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పైకి తీసుకువెళ్ళి శ్వాస వదులుతూ నడుము క్రింద భాగం నుండి సాగదీస్తూ ముందుకు వంగి రెండు పాదాలను రెండు చేతులుతో పట్టుకొని, తలను భూమికి దగ్గరగా తీసుకురావాలి. వీలైతే ఛాతి భాగం, ఉదరభాగం కూడా భూమి మీద ఆనించే ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్తలు: ప్రారంభ సాధకులు ముందు భాగంలో ఒక బాలిస్టర్‌ను ఉంచి శ్వాస వదులుతూ పూర్తిగా బాలిస్టర్ మీదకు వంగి విశ్రాంత స్థితిలో ఉండవచ్చు. ఇంకా కష్టంగా ఉన్నట్లయితే సీటు క్రింద సమంగా ఉన్న ఒక దిండును పెట్టుకోవచ్చు. ఉపయోగాలు: గ్రాయిన్ భాగంలో స్టిఫ్‌నెస్ తగ్గుతుంది. కాళ్లు, తొడల భాగాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. జీర్ణవ్యవస్థకు మంచిది.
3. పరివృత్త జానుశిరాసన
పై ఆసనం తరువాత కుడికాలును మడచి, కుడిపాదం మడమను పెరీనియం (జననేంద్రియం)కు దగ్గరగా తీసుకురావాలి. శ్వాస తీసుకుంటూ అరచేతులు రెండూ ఆకాశంవైపునకు చూపిస్తూ పైకి తీసుకెళ్లాలి. నడుము క్రిందిభాగం నుండి పైకి శరీరాన్ని లాగుతూ, శ్వాస వదులుతూ ఎడమవైపుకి వంగి, ఎడమపాదాన్ని రెండు చేతులతో పట్టుకోవాలి. నడుమును పూర్తిగా ట్విస్ట్ చేస్తూ ఎడమకాలును నిటారుగా ఉంచి ఆకాశం వైపు చూస్తూ (వీలైతే) 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. శ్వాస వదులుతూ చేతులు రెండూ ప్రక్క నుండి క్రిందకు తీసుకురావాలి. ఎడమ మోచేతిని భూమి మీద పెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా రెండోవైపు కూడా చేయాలి. జాగ్రత్తలు: పై విధంగా చేయడం సాధ్యపడని వారు మోకాలి సమస్య ఉన్నవారు మోకాలి క్రింద భాగంలో ఒక దిండును ఉపయోగించి మోకాలును పైకి లేపి ఉంచవచ్చ్చు. నడుము పైకి లాగటం, ట్విస్ట్ చేయడం మీద పూర్తిగా దృష్టి ఉంచడం చాలా ముఖ్యం.
ఉపయోగాలు: పొట్టభాగాలు, పక్కటెముకలు, ఛాతీపై భాగాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. జీర్ణవ్యవస్థకు, రక్తప్రసరణ వ్యవస్థకు, శ్వాసకోశ వ్యవస్థకు చక్కటి ఆసనం.
యోగావగాహన
ఆచారం: జీవనశైలికి సంబంధించిన 6 అంశాలలో గతవారం పేర్కొన్న ఆహారం, విహారం, వ్యవహారం, విచారం ఈనాల్గింటిని అనునిత్యం ఆచరిస్తూ భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గానుసారం అవిద్యను తీసివేసే దిశగా పనిచేయాలి.
గ్రహచారం: ఈ ఆచారమే మన గ్రహచారాన్ని నిర్ణయించి కైవల్యప్రాప్తిని కల్గిస్తుంది.
అవిద్య అనగా: అనిత్యమైన దానిని నిత్యమనుకోవడం (శరీరం అనిత్యం. కానీ దానిని నిత్యమని భ్రమించడం) అశుచియైన దానిని శుచి అనుకోవడం దుఃఖాన్ని సుఖమనుకోవడం (జననం దుఃఖం, మరణం దుఃఖం - దీనిని గ్రహించి కైవల్యప్రాప్తికి ప్రయత్నించకుండా సుఖజీవనం గడపడం) అనాత్మను ఆత్మ అనుకోవడం (ఆత్మకాని ఐహిక సంబంధాలు, సుఖాలు పట్ల రాగం, మోహం పెంచుకుంటూ అదే ఆత్మ అని భ్రమించుడం)
సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి