న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆదివారం(నవంబర్ 17) ప్రకటించారు.‘మణిపూర్‌లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్‌పీపీ తెలిపింది. మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్‌పీపీకి ఏడు సీట్లున్నాయి.
హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment