ఐఐటీ ప్లేస్ మెంట్ కమిటీ బ్లాక్ లిస్ట్ లో ఆరు కంపెనీలు
ముంబై : అధిక వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్న కంపెనీలపై ఐఐటీల ప్లేస్ మెంట్ కమిటీ(ఏఐపీసీ) సీరియస్ అయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో ఇటీవల నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) స్పందించింది. ఇకమీదట కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా అరు కంపెనీలను ఈ ఏడాది బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కంపెనీల్లో ఉద్యోగాల నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఏఐపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శుక్రవారం భేటీ అయిన కమిటీ అరడజను కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్టు ప్రకటించింది.
ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి మూడు కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ బ్లాక్ లిస్ట్ ను విదించినట్టు ఐఐటీ మద్రాస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ అడ్వైజర్ వీ.బాబు తెలిపారు. అయితే ఏయే కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారో ఆ కంపెనీ వివరాలను వెల్లడించలేదు. ఏడాది పాటు ఈ కంపెనీలు ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు నిర్వర్తించకుండా బ్లాక్ లిస్ట్ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవలే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో, ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఐఐటీ గౌహతి క్యాంపస్ లో ఐదుగురు విద్యార్థులకు జింప్లీ సంస్థ, ఐఐటీ బొంబాయి క్యాంపస్ లో ఏడుగురు విద్యార్థులకు పోర్టియా అండ్ పెప్పర్ సంస్థ జాబ్ ఆఫర్లు ప్రకటించి, ఫిబ్రవరి మధ్యలో విత్ డ్రా చేసుకుంది.