న్యూరాలజీ కౌన్సెలింగ్
కండరాలు పట్టేయడానికి కారణాలు అనేకం!
నా వయసు 30 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. అలా బిగుసుకుపోయినప్పుడు, నొప్పి తగ్గడానికి కాస్త మసాజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ సమస్యనుంచి బయట పడటానికి మార్గం చెప్పండి.
- కె. రాంబాబు, హైదరాబాద్
ఇలా కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు గణనీయంగా తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొందరిలో తమ శరీరంలోని నీటి నిల్వలు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా ఇవే లక్షణాలు వ్యక్తమవుతాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్యను కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది.
లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
పొగాకు, మద్యంతోనూ వెన్నునొప్పి వస్తుంది!
నా వయసు 35 ఏళ్లు. చాలాసేపు కూర్చొని ఉంటాను. దాంతో వెన్నునొప్పి వస్తోందని భావించి ఇటీవల డాక్టర్‌ను కలిశాను. అక్కడ ఆయన చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను. నిజానికి నా కూర్చుని ఉండే అలవాటు ఇటీవలి వృత్తులు చేసే చాలామందికి ఉంటుందనీ, దానితో పాటూ నా విపరీమైన పొగతాగడం, మద్యపానం అలవాట్ల వల్ల కూడా వెన్నునొప్పి తీవ్రమవుతోందని డాక్టర్ చెబితే విని ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పేది వాస్తవమేనా? వివరంగా చెప్పండి.
- కృష్ణచైతన్య, హైదరాబాద్
మీ డాక్టర్ చెప్పిన విషయాలు వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా, జీవనశైలి నిపుణులమైన మాకు మాత్రం ఏమాత్రం ఆశ్చర్యకం కాదు. ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవమే. వెన్నునొప్పికి మూడు ప్రధానమైన అంశాలు దోహదపడతాయి. అవి... ఊబకాయం, విపరీతమైన పొగతాగడం, అత్యధిక స్థాయిలో మద్యం తీసుకోవడం. పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ) గణనీయంగా తగ్గుతంది. నిజానికి ఎముకల్లో ఎంత ఖనిజాల సాంద్రత (నార్మల్ మినరల్ డెన్సిటీ) ఉండాలో అంత ఉంటేనే... అవి పటిష్టంగా ఉండి, చిన్న చిన్న దెబ్బలకే విరగకుండా ఉండటం (రెసిస్టెన్స్ టు ఫ్రాక్చర్స్) కోసం తయారై ఉంటాయి. కానీ ఇలా పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గగానే అవి చిన్న చిన్న దెబ్బలకే విరగడం మొదలవుతాయి. ప్రధానంగా ఈ లక్షణం మన శరీరం బరువును తీసుకునే ఎముకలు, వెన్నెముకలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రోజూ మూడు పెగ్గుల కంటే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో ఎముకల సాంద్రత తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంటుంది. పైగా పొగతాగడం, మద్యం తీసుకోవడం అనే చర్యలు మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాల్షియమ్ జీర్ణక్రియ ద్వారా మన ఎముకలకు అందకుండా చేస్తాయి. కొత్త ఎముక పెరిగే ప్రక్రియనూ ఆలస్యం చేస్తాయి. ఎముకకు రక్తసరఫరానూ తగ్గిస్తాయి. దాంతో ఎముకలు బలహీనపడతాయి. ఫలితంగా మీరు వెన్నెముకలోనూ సాంద్రత తగ్గినందువల్లనూ, మీ బరువు దానిపై పడుతుండటం వల్లనూ వెన్నునొప్పి వస్తుంటుంది. అయితే ఈ నొప్పిని అధిగమించడం చాలా సులభం. మీరు మీ పొగతాగే అలవాటు, మద్యపానం అలవాట్లను మానేసి, మీ జీవనశైలిని మెరుగుపరచుకొని రోజూ క్రమం తప్పకుండా పోషకాహారాలతో కూడిన పదార్థాలు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల స్థూలకాయం తగ్గడంతో పాటు, వెన్నునొప్పీ తగ్గుతుంది.
నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే..?
మా అమ్మాయికి ఎనిమిదేళ్లు. గత కొద్దికాలంగా కళ్లు వాచి కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్ చేయిస్తే ప్రోటీన్ మూడు ప్లస్ అని తేలింది. ఇంత చిన్న వయసులో మా పాపకు ఏ సమస్య వచ్చింది? దీనికి ఏ విధమైన మందులు వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి తగిన సలహా ఇవ్వగలరని ప్రార్థన.
- రాజేశ్వరరావు, తెనాలి
మీరు తెలిపిన వివరాల ప్రకారం, మీరు వివరిస్తున్న లక్షణాల ప్రకారం చూస్తే మీ పాపకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు అనిపిస్తోంది. నెఫ్రోటిక్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న వారిలో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇలాంటి సమస్య ఉన్న పిల్లల్లో మూత్రంలో ఎక్కువగా ప్రోటీన్లు పోతూ ఉంటాయి. అయితే ముందుగా మీ పాప విషయంలో వ్యాధి నిర్ధారణ జరగాలి. ఇందుకోసం మీ పాపకు 24 గంటల యూరిన్ ప్రోటీన్ పరీక్ష, సీరల్ ఆల్బ్యుమిన్ పరీక్ష, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించాలి.
మీ పాపకు ఉన్నది నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే సమస్య అని నిర్ధారణ అయిన తర్వాత మొదటిసారి మూడు నెలల పాటు మీ పాపకు స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ స్టెరాయిడ్స్ వాడే ముందర మీ పాపకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవాలి. సాధారణంగా ఈ వ్యాధి తగ్గిన తర్వాత కూడా పదిహేను సంవత్సరాల వరకు మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడే సరైన చికిత్సను పూర్తికాలంపాటు తీసుకోవాలి. అలాచేస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఇక మీ పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే... మీ పాపకు ఇచ్చే ఆహారంలో ఉప్పు, కొవ్వు పదార్థాల పాళ్లు చాలా తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇంత చిన్న పాపకే సమస్య వచ్చిందేమిటి అంటూ మీరు ఆందోళన చెందకుండా, పైన పేర్కొన్న పరీక్షలను చేయించి, మీకు సమీపంలోని నెఫ్రాలజిస్టును కలిసి మీ పాపకు తగిన చికిత్స తీసుకోండి.
పెద్దపేగు క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి!
మా నాన్న వయసు 56 ఏళ్లు. కొంతకాలంగా జీర్ణసంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల మలవిసర్జన సమయంలో రక్తం పడుతుండటంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయించాం. ఆయన పెద్దపేగుకు క్యాన్సర్ (కొలోన్ క్యాన్సర్) సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, చికిత్స విధానాలు ఏమిటి?
- విజయభాస్కర్, వనపర్తి
జీర్ణవ్యవస్థలోని ప్రధాన అవయవాల్లో పెద్దపేగు (కొలోన్) ఒకటి. మనం తినే ఆహారంలోని అనేక ముఖ్యమైన పోషకాలను జీర్ణం చేయడంలోనూ, వ్యర్థాలను మలం రూపంలో విసర్జించడంలోనూ ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది. మిగతా అవయవాల్లాగే ఇదీ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారంలో పీచుపదార్థాలు తగ్గడం, కొవ్వుల వాడకం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అంశాల వల్ల దీని విస్తృతి పెరుగుతోందని భావిస్తున్నారు. దీనితో పాటు పెద్దపేగులో పెరుగుతున్న క్యాన్సర్ రహిత పాలిప్స్, జన్యులోపాలు, పేగులు వాచిపోయే వ్యాధులు, ఊబకాయం, పొగతాగడం వంటివి కూడా ఈ వ్యాధికి దోహదం చేసే అంశాలే. పెరిగే వయసు కూడా పెద్దపేగు క్యాన్సర్‌కు ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. పెద్దపేగులో నియంత్రించలేనంత స్థాయిలో కణాలు పుట్టలు పుట్టలుగా పెరుగుతాయి. వీటిలో చిన్నపాటి, క్యాన్సర్హ్రిత ట్యూమర్లు అత్యధికం. వీటినే పాలిప్స్ అంటారు. ఇవి పెద్దపేగు లోపలి గోడల్లో ఏర్పడతాయి. ఈ పాలిప్స్ క్రమంగా ట్యూమర్లు (గడ్డలు)గా వేళ్లూనుకున్న తర్వాత ఆ పరిసర ప్రాంతంలోని ఆరోగ్యవంతమైన కణజాలాన్నీ ధ్వంసం చేయడం మొదలుపెడతాయి. ఈ వ్యాధి బారిన పడ్డవారికి మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలూ కనిపించవు. కానీ క్యాన్సర్ తీవ్రత పెరిగేకొద్దీ డయారియా లేదా మలబద్దకం పెరుగుతుంది. మలవిసర్జన క్రమం తప్పుతుంది. మలంలో నెత్తురుతో పాటు పొత్తికడుపులోని గ్యాస్ కారణంగా మలవిసర్జన సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. తరచూ మలవిసర్జన చేయాలనిపించడం, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. అకస్మాత్తుగా బరువు కోల్పోతారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కొలనోస్కోపీ అనే పరీక్ష చేసి పేద్ద పేగులోపలి నుంచి పాలిప్స్‌ను సేకరిస్తారు. అవి క్యాన్సరస్ పాలిప్సా లేదా అని నిర్ధారణ చేయడానికి బయాప్సీ పరీక్షకు పంపుతారు. అలాగే వ్యాధి ఏ మేరకు పాకిందో నిర్ధారణ చేయడానికి కొన్ని స్కాన్‌లు కూడా అవసరమవుతాయి.
ఇక చికిత్స ప్రణాళిక అనేది వ్యాధి ఏ దశలో ఉంది అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కొలోన్ క్యాన్సర్ ఆరంభదశలో ఉంటే శస్త్రచికిత్స ద్వారా పెద్దపేగు మొత్తాన్ని కూడా తొలగిస్తారు. అవసరాన్ని బట్టి పేషెంట్‌కు రేడియోథెరపీ, కీమోథెరపీ కూడా ఇస్తారు. ఇక వ్యాధి బాగా ముదిరిన దశలో ఉంటే టార్గెటెడ్ థెరపీ, కీమోథెరపీల ద్వారా వ్యాధి తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తారు.
నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే..?
Published Tue, Aug 25 2015 12:10 AM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM
Advertisement
Advertisement