
చైనా ‘చిరంజీవి’కి వైద్యుల సలామ్
చైనాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన లియాంగ్ యోయీ అనే 11 ఏళ్ల బాలుడు మానవతా విలువలను చాటుతూ అందరిలో స్ఫూర్తి నింపాడు.
అవయవదానంతో స్ఫూర్తిప్రదాతగా నిలిచిన 11 ఏళ్ల బాలుడు
బీజింగ్: చైనాలోని షెంజెన్ ప్రాంతానికి చెందిన లియాంగ్ యోయీ అనే 11 ఏళ్ల బాలుడు మానవతా విలువలను చాటుతూ అందరిలో స్ఫూర్తి నింపాడు. మెదడు ట్యూమర్‌తో బాధపడుతూ మరణశయ్యపై అవయవదానం చేసి చిరంజీవి అయ్యాడు. తాను మరణించినా తన అవయవాలు మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆకాంక్షతో తన రెండు కిడ్నీలు, కాలేయాన్ని దానం చేయాలని తల్లిని కోరాడు. కన్నకొడుకు దూరమవుతున్నాడన్న బాధలో ఉన్న ఆ తల్లి కుమారుడి కోరికను అంగీకరించింది.
దీంతో వైద్యులు జూన్ 6న అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాలుడి శరీరం నుంచి కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు. అతని స్ఫూర్తికి వైద్యులు సలామ్ చేశారు. అతని పార్థివదేహం వద్ద శిరస్సు వంచి అభివాదం చేశారు. బాలుడి నుంచి సేకరించిన అవయవాలను 8 గంటల వ్యవధిలో ఇతరులకు విజయవంతంగా అమర్చారు. వైద్యులు బాలుడికి సలామ్ చేస్తున్న ఫొటోలు తాజాగా ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి.