హోమియో కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 56. గత కొద్దికాలంగా ఆమె మెడ నొప్పితో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆమెకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందని చెప్పి, కొన్ని సూచనలు చేసి, మందులు రాశారు. ఆ సూచనలు పాటిస్తూ, మందులు వాడుతున్నారు. కాని అంతగా ఫలితం కనిపించడం లేదు. హోమియోలో ఈ జబ్బుకు శాశ్వత పరిష్కారం ఉందా?
- బి.అమరవాణి, పిడుగురాళ్ల
మారుతున్న జీవన శైలి కారణంగా సుమారు 90 శాతం మంది ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్యతో బాధపడతారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్తవయస్కుల్లోనూ కనిపిస్తోంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరియైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి?
మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోగుండా, నడుం భాగం నుండి వెళ్లే నరాలు కాళ్లల్లో గుండా వెళుతుంటాయి. వెన్నెముక మెడ, నడుము భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని మెడ దగ్గర ఎక్కువగా రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు.
కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్దీ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురి కావడం, కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది.
లక్షణాలు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు
నిర్థారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై, సీబీపీ, ఇ.ఎస్.ఆర్
హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో కేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ వైద్యపద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించడమే కాకుండా వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడ, వెన్ను సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవ చ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
న్యూరోసర్జరీ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. నాకు ఇటీవల బ్రెయిన్‌లో ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బ్రెయిన్ ట్యూమర్‌కు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందా? ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. ముఖ్యంగా బ్రెయిన్‌కు ఆపరేషన్ చేస్తే తర్వాత మాట పడిపోతుంది, పక్షవాతం వస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మందులతో బ్రెయిన్ ట్యూమర్ నయం అయ్యే అవకాశం లేదా? ఆపరేషన్ కాకుండా ఇంకా వేరే చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఆపరేషన్ పట్ల ఆందోళనతో డాక్టర్ వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
- కళ్యాణి, గుంటూరు
మీకు బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. అయితే మీకు మెదడులో ఏర్పడిన కణితి పరిమాణం, కణితి రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటే ఆపరేషన్ లేకుండా రేడియో సర్జరీ ద్వారా సురక్షితంగా కణితిని తొలగించవచ్చు. ఒకవేళ కణితి పరిమాణం మూడు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ముందు మీరు ఆపరేషన్‌పై ఉన్న భయాన్ని పోగొట్టుకోండి. ఒకవేళ మీకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తినా భయపడకండి.
బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ చేయించుకుంటే మాటపడిపోతుందనీ, పక్షవాతం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి దుష్ర్పభావాలు తలెత్తకుండా సురక్షితంగా అపరేషన్ చేయవచ్చు. ఆపరేషన్‌కు భయపడి వైద్యుల వద్దకు వెళ్లకుండా ఉంటే సమస్య మరింత క్లిష్టంగా మారుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాతనే ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత మళ్లీ మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు.
- డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం
సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్
స్లీప్ కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 12 ఏళ్లు. నిద్రలోంచి ఉలిక్కిపడి మేల్కొంటోంది. కెవ్వున అరుస్తోంది. ఆమె ప్రవర్తన చాలా భయంగొలిపేదిగా ఉంది. మా అమ్మాయి విషయంలో తగిన సలహా ఇవ్వండి.
- సురేశ్‌కుమార్, నల్గొండ
నిద్రలో ఉలిక్కిపడి లేవడం, భయపడటం, ఆందోళన పడటం, కెవ్వున అరవడం ఇవన్నీ నిద్రకు సంబంధించిన ఒకరకం సమస్య. దీన్నే ‘స్లీప్ టై’ అంటారు. నిద్రలో ఉండగానే ఇవన్నీ చేస్తారు. నిద్రలోని ఒక దశ అయిన... కనుపాపలు చలించని స్థితి (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్-నాన్ ఆర్‌ఈఎమ్) దశలో కనిపించే సమస్య ఇది. నిద్రలో నడవడం కూడా ఈ తరహా సమస్య కిందికే వస్తుంది. ఏదైనా ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అది తాము పరిష్కరించలేని సమస్య అని బాగా ఆందోళనపడ్డప్పుడు ఒక్కోసారి ఇలా ప్రవర్తిస్తుంటారు.
అలాంటి సందర్భాల్లో వాళ్లు లేచి, ఈ నైట్‌టై దశలో 1-2 నిమిషాలు ఉంటారు. తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. వాళ్లకు సాంత్వన కలిగిస్తే ఈ పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న పేషెంట్‌ను చూసి, తల్లిదండ్రులు ఆందోళనపడటం చాలా సాధారణం. అయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలామంది పిల్లల్లో ఈ సమస్య యుక్తవయసు రాగానే తగ్గుతుంది. వాళ్లు ఒకప్పుడు అలా ప్రవర్తించారన్న అంశమే వాళ్లకు గుర్తుండదు. అలాంటి వాళ్లలో అదేమీ మానసిక రుగ్మత కాదు.
ఆరుగురిలో ఒక్కరికి మాత్రమే పెద్దయ్యాక కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. యుక్తవయస్కుల్లో కూడా ఈ సమస్య వస్తుందంటే... బహుశా వాళ్లు యాంగ్జైటీ లేదా డిప్రెషన్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఒక్కోసారి నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలికంగా ఉండే మైగ్రేన్, స్లీప్‌ఆప్నియా వంటి సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణం కావచ్చు.
మీపాప ఏదైనా సమస్య గురించి ఆందోళన పడుతున్నా, ఏదైనా పరిస్థితి గురించి భయపడుతున్నా... ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమనే భరోసాను ఆమెకు ఇవ్వండి. మీరు స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి.
- డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్,కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్
బ్రెయిన్ ట్యూమర్‌కు ఆపరేషన్ తప్పదా?
Published Sun, Oct 18 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:10 AM
Advertisement
Advertisement