నాకు 35 ఏళ్లు. యూరిన్ టెస్ట్‌లో గర్భవతి అని తెలిసింది. మూడు నెలల తర్వాత డాక్టర్‌ను సంప్రదించమని సలహా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. అందాకా ఆగొచ్చా? ఇప్పుడేమైనా టెస్టులు, స్కాన్స్ ఉంటాయా? సూచించగలరు.
– వాసవి, ఆదిలాబాద్
ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్‌ని కలవటం మంచిది. 30 ఏళ్లు దాటాక ప్రెగ్నెన్సీ వస్తే కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్, బీపీ, సుగర్ టెస్ట్‌లైతే వెంటనే చేయించుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. రోజూ ఫోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్ మాత్రలను వేసుకోవాలి. మీ లాస్ట్ పీరియడ్ తేదీ నుంచి రెండు నెలలకి వయబిలిటీ స్కాన్ అని.. ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇందులో గర్భసంచిలో సరైన ప్లేస్‌లోనే పిండం ఫామ్ అయిందా.. లేదా? పిండం వయసు, ఎదుగుదల ఆరోగ్యంగా ఉందా.. లేదా? వంటివన్నీ తెలుస్తాయి. కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ వంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్‌ని ఈ స్కాన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది.
అంతేకాదు జెనెటిక్ లేదా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని గుర్తించేందుకు 3వ నెలలో కొన్నిరకాల రక్తపరీక్షలు, స్కానింగ్‌ని చేయాల్సి ఉంటుంది. వీటిని చేయించుకునే తేదీని కూడా ఫస్ట్ స్కాన్‌లోనే కన్‌ఫర్మ్ చేస్తారు. ఈ స్కాన్‌ను ఇంటర్నల్/ఎక్స్‌టర్నల్ రెండు విధాలుగా చేస్తారు. ఇందులో బిడ్డ సైజు, హార్ట్ బీట్ తెలుస్తాయి. అండాశయాల్లో ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా అని కూడా చూస్తారు. పిండానికి రక్తప్రసరణ సరిగా ఉందా? ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. 8–9 వారాల్లో ట్విన్ ప్రెగ్నెన్సీని కనిపెట్టొచ్చు. మూడవ నెల నిండిన తర్వాత చేసే ఎన్‌టీ స్కాన్ ( (Nuchal Translucency)లో డౌన్‌సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ అబ్‌నార్మాలిటీస్ కూడా తెలుస్తాయి.
దీంతోపాటు ఇంకా టీ18, టీ13 అనే సమస్యలనూ గుర్తించే వీలుంటుంది. డెలివరీ అయ్యే సుమారు తేదీ కూడా ఈ స్కాన్‌లోనే తెలుస్తుంది. ఈ ఎన్‌టీ స్కాన్‌ను 12–13 వారాల మధ్య చేస్తారు. ఈ టెస్ట్‌లో ఒకవేళ ఏదైనా సమస్య కనపడితే తదుపరి ఏ డాక్టర్‌ని కలవాలి, చెకప్స్, హై రిస్క్ అబ్‌స్టెట్రీషియన్ కేర్ వంటివి సూచిస్తారు. తొలి మూడు నెలల్లోనే బిడ్డకు అవయవాలన్నీ ఏర్పడటం మొదలవుతుంది కాబట్టి తీసుకోవలసిన పోషకాహారం, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఒకవేళ బిడ్డకేవైనా ఎదుగుదల సమస్యలు కనిపిస్తే వేసుకోవలసిన మాత్రలు, తీసుకోవలసిన ఇంజెక్షన్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్‌ని తప్పకుండా సంప్రదించాలి.
నాకు 37 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పీరియడ్స్‌లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. రొటీన్ స్కాన్‌లో లో అడినోమయోసిస్ అని తేలింది. వేరే పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తెలిసిన డాక్టర్ చూసి, గర్భసంచి తొలగించాలని చెప్పారు. వేరే మార్గం లేదా?
– ప్రదీప్తి, విజయనగరం
పీరియడ్స్‌లో పెయిన్ తప్ప ఇతర ఇబ్బందులేమీ లేవంటున్నారు. కాబట్టి మేజర్ సర్జరీ అవసరం లేదు. నెలసరిలో నొప్పి తగ్గేందుకు కొన్ని మందులు వాడొచ్చు. అడినోమయోసిస్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. గర్భసంచిలో ఉండే టిష్యూ గర్భసంచి గోడలోకి వెళ్లి నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం అవటం, పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. సాధారణమైన పెయిన్ కిల్లర్ మాత్రలతో నొప్పి తగ్గకపోతే హార్మోనల్ ట్రీట్‌మెంట్ ఆప్షన్ ఉంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంట్రాటెరైనా డివైస్ – MIRENA లాంటివి నొప్పిని, బ్లీడింగ్‌నీ తగ్గిస్తాయి. మీరు డాక్టర్‌ని సంప్రదిస్తే.. పరీక్షించి.. మీకు ఏ ట్రీట్‌మెంట్ సూట్ అవుతుందో, ఏది మంచిదో చెబుతారు.
అడినోమయోసిస్ అనేది దానికదే తగ్గే అవకాశం తక్కువ. అందుకని ఏడాదికోసారి స్కాన్ చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. మెనోపాజ్ వయసుకి హార్మోన్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇదీ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ పిల్లలున్న వారు MIRENA కాయిల్ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. హిస్టరెక్టమీ లాంటి మేజర్ సర్జరీని నివారించవచ్చు. కేవలం నొప్పి, అధిక రక్తస్రావం మాత్రమే ఉన్నవారికి (థైరాయిడ్, హై బీపీ, సుగర్ లాంటి సమస్యలేవీ లేకపోతే) ఈ కాయిల్ లేదా మాత్రలతో త్వరగానే రిలీఫ్ వస్తుంది. అలాగే మీ ఏజ్ గ్రూప్ వాళ్లు తప్పకుండా పాప్ స్మియర్ అనే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్‌తో గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. సరైన చికిత్సను సూచిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment