నాకిప్పుడు 4వ నెల. రోజుకు అయిదారుసార్లు కాఫీ తాగుతాను. ప్రెగ్నెన్సీలో కాఫీ అంత మంచిది కాదు మానేయమని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. కానీ కాఫీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగానే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కాఫీ మంచిది కాదా? – సంగీత కృష్ణ, హైదరాబాద్
కెఫీన్ అనేది చాలా ఫుడ్ అండ్ బేవరేజెస్‌లో ఉంటుంది. కాఫీ, టీ, చాకోలెట్, కోకో ప్రొడక్ట్స్, కోలాస్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జలుబు, జ్వరానికి సంబంధించిన కొన్ని మందుల్లో, ఎలర్జీ, డైట్ పిల్స్, డైటరీ సప్లిమెంట్స్‌లో కూడా కొంత శాతం కలుస్తుంది. ప్రత్యేకించి కాఫీలో అయితే 50 నుంచి 70 శాతం కెఫీన్ ఉంటుంది. కెఫీన్ వల్ల గర్భిణీల్లో వచ్చే మార్పుల మీద చాలా థియరీలే ఉన్నాయి.
కానీ వంద శాతం ఏదీ నిర్ధారణ కాలేదు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ ప్లసెంటా ద్వారా పొట్టలోని బిడ్డకూ చేరుతుంది. ఈ క్రమంలో బిడ్డ ఎదుగుదల మీద ఏదైనా ప్రభావం కనపడితే దానికి చాలా రకాల కారణాలూ తోడవుతాయి తప్ప ఆ ప్రభావానికి కెఫీనే ప్రధాన కారణమని ప్రూవ్ చేయడం కష్టం. సాధారణంగా ఒక కప్పు కాఫీలో వంద మిల్లీగ్రాముల దాకా కెఫీన్ ఉండవచ్చు. కెఫీన్ మెటబాలైట్స్‌ని గర్భిణీ రక్తంలో మాత్రమే చెక్ చేయగలం. కానీ అలా ప్రతిరోజూ టెస్ట్ చేయడం ప్రాక్టికల్‌గా అసాధ్యం.
కెఫీన్ మీద ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల అధ్యయనాల్లో .. తక్కువ నుంచి ఓ మోస్తరు వరకు కాఫీ సేవనం వల్ల గర్భిణీలకు పెద్ద హాని ఏమీ ఉండకపోవచ్చనే తేలింది. అధిక మోతాదులో అంటే రోజుకు 300 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫీన్‌ని తీసుకునే వారిలో గర్భస్రావాలు, తక్కువ బరువుతో శిశు జననం వంటి ప్రమాదాలు ఉండవచ్చు. ఏదేమైనా ప్రెగ్నెన్సీ సమయంలో కెఫీన్‌తో పాటు పొగాకు, సిగరెట్ , మద్యం లాంటి వాటికి దూరంగా ఉండటమే క్షేమం.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment