నాకు మూడవ నెల. నోట్లో అల్సర్స్ ఉన్నాయి. మెడ భాగంలో కూడా గడ్డలు వచ్చిపోతున్నాయి. నా భర్తకు కూడా ఇలానే వస్తున్నాయి. మందులు వాడాక తగ్గాయి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా?
నళినీ రాణి, మాధవరం
మీరు చెప్పిన దానిని బట్టి ఇది రిపీటెడ్ ఇన్‌ఫెక్షన్‌లా ఉంది. నోట్లో, వెజైనా ఏరియాలో అల్సర్స్ రావడం, మీ ఆయనకు కూడా రావడం చాలా వరకు సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్‌లో ఉంటుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. చికిత్స తీసుకోకుంటే బిడ్డ మీద తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఏ లక్షణాలూ లేకుండా, కొంతమందికి మూడు నెలల తర్వాతే ఇన్‌ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. అందుకే ఇలా అల్సర్స్ రావడంతోనే వీడీఆర్‌ఎల్ టెస్ట్ చెయ్యాలి. రొటీన్ టెస్టుల్లో భాగంగానే గర్భవతికి కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. కండోమ్స్ వాడటంతో ఈ ఇన్‌ఫెక్షన్‌ని దూరం చెయ్యవచ్చు.
మీరు వెంటనే దగ్గరలోని గైనకాలజిస్ట్‌ని కలవండి. కొన్ని రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనా స్వాబ్ టెస్ట్ చేస్తారు. గర్భిణులకు ఈ పరీక్షలు 3, 7, 9 నెలల్లో చేసి, చికిత్స ఇచ్చిన తరువాత నయమైందా లేదా అని చెక్ చెయ్యాలి. పెన్సిలిన్ ఇంజక్షన్‌తో ఈ ఇన్‌ఫెక్షన్ బాగా నయమవుతుంది. వీడీఆర్‌ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో టీపీపీఏ, టీపీహెచ్‌ఏ చెయ్యాలి. ఒకవేళ ఆ టెస్ట్‌లో ఏమీ తెలియకపోతే చికిత్స చేసి, రెండు మూడు వారాల తరువాత పరీక్షల కోసం మళ్లీ శాంపిల్స్ పంపించాలి. సిఫిలిస్ ఇన్‌ఫెక్షన్ తొలిదశలో వస్తే ఫీటల్ మెడిసిన్ నిపుణులతో గర్భస్థ శిశువుకు స్కానింగ్ చేయించాలి.
5,7వ నెలలో చేసే ఈ స్కానింగ్‌లో ఇన్‌ఫెక్షన్ వల్ల బిడ్డలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. అల్సర్స్ వెజైనల్ ఏరియాలో మానకుండా ఉంటే 9వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి, సిజేరియన్‌కు రికమండ్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు. బ్రెస్ట్ మీద మానని పుండ్లు లేకపోతే డైరెక్ట్ ఫీడింగ్‌కి అనుమతి ఇస్తారు. పిల్లల డాక్టర్‌కి కూడా ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్ చెప్పాలి. శిశువుకు కూడా 3వ నెలలో, ఏడాదిన్నర వయసులో పరీక్షలు చేస్తారు.
నాకు డేకేర్‌లో హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ప్లాన్ చేశారు. గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. డైరెక్ట్‌గా కాకుండా ఇలాంటి ప్రొసీజర్‌తో రికవరీ లేట్ అవుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– గాయత్రి, వరంగల్
హిస్టరోస్కోపీ ప్రొసీజర్‌లో చిన్న కెమెరా ద్వారా గర్భసంచిని, లోపలి పొరను స్పష్టంగా చూసి, ఉన్న సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. డైరెక్ట్‌గా డీ అండ్ సీ లాంటి వాటిలో సమస్య మూలం మిస్ అయ్యే చాన్స్ ఎక్కువ. పైగా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. హిస్టరోస్కోపీలో చాలా చిన్న పల్చటి పరికరంతో ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకోవడం కూడా జరుగుతుంది. హిస్టరోస్కోపీ పూర్తయ్యాక అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది.
కొన్ని రోజులు స్పాటింగ్‌లాగ ఉండవచ్చు. కొంతమందికి వెజైనా పెయిన్ ఉండవచ్చు. రెండురోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ప్రొసీజర్ తరువాత రొటీన్ పనులను రెండు రోజుల్లో మొదలుపెట్టుకోవచ్చు. ప్రతిరోజూ షవర్‌బాత్ చెయ్యాలి. బయట స్విమ్మింగ్ పూల్స్ రెండు వారాల వరకు వాడకూడదు. ఒకవేళ మీకు ఈ ప్రక్రియలో ‘పాలిపెక్టమీ’ చేసినట్లయితే, రెండు వారాల తరువాత రిపోర్ట్స్‌తో డాక్టర్‌ని సంప్రదించాలి. తర్వాత ట్రీట్‌మెంట్, కేర్ అప్పుడు చెబుతారు. ఈ ప్రొసీజర్ తరువాత మీకు వెజైనల్ డిశ్చార్జ్, దుర్వాసన, జ్వరం, వెజైనల్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్‌ను కలవండి.
డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment