నాకిప్పుడు నలభై ఏళ్లు. ఏడాదికి 3–4 సార్లు యూరిన్ ఇన్‌ఫెక్షన్ వస్తోంది. అన్నన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడితే ప్రమాదం కాదా? ఇలా తరచుగా యూరిన్ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – పేరు, ఊరు వివరాలు రాయలేదు.
మహిళల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ సర్వసాధారణం. యూరినరీ ఓపెనింగ్ అంటే యురేత్రా అనేది.. మోషన్ ఓపెనింగ్ అంటే మలద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఈజీగా వెజైనా,యురేత్రా, బ్లాడర్‌లోకి ప్రవేశిస్తుంది. మహిళల్లో యురేత్రా షార్ట్‌గా ఉండటం వల్ల మరింత త్వరగా బ్యాక్టీరియా బ్లాడర్‌లోకి వెళ్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, అర్జెన్సీ ఫీలవడం, మూత్రంలో మంట, దుర్వాసన వేయడం, మూత్రంలో రక్తం ఆనవాళ్లు వంటివి ఉన్నాయంటే యూరిన్ ఇన్‌ఫెక్షన్ మొదలైందని అర్థం.
ఆడవాళ్లలో 40–50 ఏళ్ల మధ్య ఎక్కువసార్లు యూరిన్ ఇన్‌ఫెక్షన్ వచ్చే చాన్సెస్ ఉంటాయి. దీనికి ఈస్ట్రజన్ హార్మోన్ లోపం ఒక కారణం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారిలో యూరినరీ ట్రాక్ట్‌లో బ్లాక్స్‌తో కూడా తరచుగా యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలోనూ యూరిన్ ఇన్‌ఫెక్షన్ చాన్సెస్ పెరుగుతాయి. ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నవారిలోనూ బ్యాక్టీరియా రెండింతలయ్యే చాన్సెస్ ఎక్కువై తరచుగా యూరిన్ ఇన్‌ఫెక్షన్ రావచ్చు.
కొన్ని సింపుల్ మెథడ్స్‌తో ఈ ఇన్‌ఫెక్షన్‌ని నివారించవచ్చు. యూరిన్, మోషన్ పాస్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల మంచినీరు తాగాలి. కాఫీ, సుగర్ లోడెడ్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి. టైట్ ఇన్నర్‌వేర్స్, డ్రాయర్స్ అవాయిడ్ చేయాలి. కాటన్ లోదుస్తులనే వాడాలి. స్ట్రాంగ్ పర్‌ఫ్యూమ్స్, సబ్బులను వెజైనా ప్రాంతంలో వాడకూడదు. స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ ఎక్కువసార్లు వాడటం వల్ల అవి పనిచేయడం మానేస్తాయి.
అందుకే యూరిన్ కల్చర్, సెన్సిటివిటీ టెస్ట్ చేసి ఏయే యాంటీబయాటిక్స్ సెన్సిటివిటీ ఉందో చూసి అది వాడటం మంచిది. కొంతమందికి రికరెంట్ ఇన్‌ఫెక్షన్ వస్తూంటే ఏ మెడిసిన్ లేదా ప్రివెంటివ్ మెథడ్ పనిచేయనప్పుడు యూరాలజిస్ట్ కన్సల్టేషన్‌తో ప్రొఫిలాక్టిక్ లో డోస్ యాంటీబయాటిక్స్‌ని ఇస్తారు. ఏ ప్రాబ్లమ్ వల్ల తరచుగా యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కి గురవుతున్నారో కనిపెట్టడం కొంతమందిలో సాధ్యమవుతుంది.
అంటే సుదీర్ఘ ప్రయాణాలు, లైంగిక సంపర్కం వంటివాటితో యూరిన్ ఇన్‌ఫెక్షన్ రావచ్చు. ఇలాంటి వారికి ఒక డోస్ యాంటీబయాటిక్ టాబ్లెట్‌ని ఇస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌ని చెక్ చెయ్యాలి. మెనోపాజ్ వయసులో ఈస్ట్రజన్ క్రీమ్‌తో కూడా ఇన్‌ఫెక్షన్‌ని నివారించవచ్చు. ఆరునెలల కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా.. ఏడాదిలో మూడుసార్లు ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా దానిని రికరెంట్ యూరినరీ ఇన్‌ఫెక్షన్ అంటారు. తొలిదశలోనే గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించవచ్చు.
– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ హైదరాబాద్
ఇవి చదవండి: బుల్లీయింగ్‌ను నిర్లక్ష్యం చేయొద్దు..
Comments
Please login to add a commentAdd a comment