ఇటీవల చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్ల (మెదడులో గడ్డల) కేసులు చాలా ఎక్కువగా వస్తుండటం అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులు... ఇలా అన్ని వర్గాల్లోనూ బెంబేలు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళన పెంచుతోంది. మామూలుగానైతే బిడ్డ తన తల్లి కడుపులో 37 వారాలు పెరగాలి. తల్లి కడుపులో అంతకంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని శారీరక వ్యవస్థలు పూర్తిగా ఎదగకుండాపోయే ప్రమాదముంటుంది. ఇలాంటి చిన్నారుల్లోనే మెదడు గడ్డలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయనే అంశంపై వైద్యవర్గాలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్న ఈ తరుణంలో... చిన్నారుల్లో మెదడు గడ్డల సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.
చిన్నారులు తమ తల్లి కడుపులో ఉండాల్సిన వ్యవధి కన్నా తక్కువ కాలం ఉండటం వల్ల... ప్రీ–మెచ్యుర్ బేబీస్‌లో కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవచ్చు. మిగతా అవయవాల సంగతి ఎలా ఉన్నా, అన్ని అవయవాల్లోకెల్లా మెదడు ఎదుగుదల చాలా కీలకం. కాబట్టి అదొక్కటి ఎదగకపోవడం వల్ల చాలా వ్యవస్థలు ప్రభావితం అయ్యే అవకాశముంటుంది.
ప్రీమెచ్యుర్ బేబీస్‌కీ, అవయవాల పెరుగుదల లోపాలకీ సంబంధమేమిటంటే...
కడుపులో పూర్తికాలం లేకపోవడం వల్ల మెదడు సహా, కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం ఒక ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్)కాగా... మెదడులో గడ్డలు రావడం, క్రమేణా అవి పెరగడం, దాంతో... కొన్ని వ్యవస్థలను నియంత్రించే సెంటర్లను ఆ పెరిగే గడ్డలు నొక్కేయడంతో ఈ ముప్పు మరింత పెరుగుతుంది. కడుపులో పూర్తిగా ఎదిగిన బిడ్డలతో పోలిస్తే... ప్రీ–టర్మ్ చిన్నారుల్లో ఈ ముప్పు పెరిగేందుకు ఈ అంశాలు దొహదపడతాయి. దానికి తోడు జన్యుపరమైన సమస్యలతో పుట్టుకతోనే (కంజెనిటల్‌గా) వచ్చే ఆరోగ్య సమస్యలూ, పర్యావరణ కారణాలతో వచ్చే ఆరోగ్యలోపాలూ... ఇవన్నీ కలిసి ప్రీ–మెచ్యుర్ బేబీల రిస్క్‌ను మరింతగా పెంచేస్తాయి.
లక్షణాలు
మెదడులో గడ్డలున్న పిల్లల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అవి...
- ఎంతకూ తగ్గని తలనొప్పి... ఇది నిరంతరమూ చిన్నారులను వేధిస్తుంటుంది.
- కారణం తెలియకుండా కనిపించే వాంతులు ∙పిల్లల ప్రవర్తనలో తేడాలు, మెదడులో గడ్డలు ప్రభావితం చేసే చోటు (సెంటర్)ను బట్టి కొన్నిసార్లు పిల్లలు వింతగా ప్రవర్తించవచ్చు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కారణం వెంటనే తెలియకపోవచ్చు.
- చిన్నారుల ఎదుగుదల ఆలస్యం కావడం (డెవలప్‌మెంటల్ డిలే)
సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడమెలా...
పిల్లలు తమ సమస్యను పెద్దవారిలా చెప్పలేరు. పైగా మెదడులో గడ్డలు ఉన్నప్పుడు పిల్లల్లో కనిపించే లక్షణాలు కూడా మామూలు పిల్లల్లోనూ ఏదో ఒక సమయంలో కనిపించేవే. ఈ అంశం కూడా సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడంలో సమస్యగా మారుతుంది. ఇక నిర్ధారణ కోసం లక్షణాలను బట్టి ఈఈజీ, అల్ట్రాసౌండ్ లేదా ఎమ్మారై స్కాన్‌లాంటి మెదడు స్కానింగ్ ప్రక్రియలతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
చిన్నారుల్లోని మెదడులో గడ్డలు ఉన్నట్లుగా ఎంత త్వరగా గుర్తిస్తే... చికిత్సకు అంతగా మేలు చేస్తుంది. నిజానికి ఈ అంశమే చికిత్సలో చాలా కీలకం. అందుకే తల్లిదండ్రులు మాత్రమే కాకుండా... పిల్లల స్కూలు టీచర్లు, ఇతరత్రా వారికి సేవలందించేవారు, సహాయకులు (కేర్ గివర్స్), డాక్టర్ల వంటి హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ అందరూ చిన్నారుల మెదడులో గడ్డలున్నప్పుడు కనిపించే లక్షణాలు, ఇతరత్రా అంశాలూ, సవాళ్లపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఎన్నో కొత్త పరిశోధనలు
ఇటీవల మెదడులో వచ్చే రకరకాల గడ్డలు... అందునా మరీ ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల్లో వచ్చే మెదడు గడ్డల విషయంలో చాలా కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మరిన్ని అధునాతన పరిశోధన ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మెదడు సర్జరీల్లో ‘న్యూరోనావిగేషన్’, ‘న్యూరోమానిటరింగ్), అలాగే కోత తక్కువగా ఉండే విధానాలు. ఈ పద్ధతుల్లో చేసే శస్త్రచికిత్సలో మెదడులోని అత్యంత సంక్లిష్టమైన భాగాలను 3–డీ ఇమేజ్‌లో గడ్డ నిర్దిష్టంగా ఎక్కడ ఉందో చూస్తూ, సర్జన్ సరిగ్గా అక్కడికే చేరడానికి వీలవుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి బాగా తగ్గడంతో పాటు, కోత కూడా తక్కువ కావడంతో బాధితులైన చిన్నారులు చాలా త్వరగా కోలుకుంటారు. మెదడులోని అత్యంత సున్నితమైన భాగాలకు చేరే సమయాల్లో కలిగే రిస్క్‌లను అంచనా వేసి, మిగతా భాగాలకు ఎలాంటి విఘాతం లేకుండా గడ్డ ఉన్న చోటికి చేరడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సునిశిత పరికరాలు బాగా తోడ్పడతాయి. అందువల్ల గతంతో పోలిస్తే ఇప్పుడీ సమస్య పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
చికిత్స
ఒకసారి సమస్య నిర్ధారణ జరిగాక చికిత్స అన్నది కేవలం ఒక స్పెషలిస్టు డాక్టరుతో కాకుండా అనేక రకాలుగా (మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) జరగాల్సిన అవసరం ఉంటుంది. మందులతో పాటు మెదడులో గడ్డ ఉన్న ప్రాంతాన్ని బట్టి... కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలూ అవసరమవుతాయి. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సి వస్తే... మెదడులో గడ్డ ఎలాంటి ప్రాంతంలో ఉంది, దానికి శస్త్రచికిత్స చేసే సమయంలో ఏయే వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది...లాంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సునిశితమైన, అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి రావచ్చు. అందుకే ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకూ... ఈ సమస్యలపై ప్రత్యేక అవగాహన ఉండటం చాలా అవసరం.
--డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్
(చదవండి: గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ఎన్నో? ఒక్కోసారి మరణానికి దాతీయొచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment