ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఇప్పటికే రెండుసార్లు సర్జరీ చేసుకున్న ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ సుధీర్ తైలంగ్(56) గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 30 సంవత్సరాలుగా వేసిన కార్టూన్లను ఢిల్లీలో 2014లో ప్రదర్శించిన ఆయన... చివరిగా మాజీ ప్రధాని మన్మోహన్‌పై కార్టూన్‌ల పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొన్నేళ్ల పాటు వివిధ జాతీయ దినపత్రికల్లో కార్టూనిస్ట్‌గా పనిచేసిన సుధీర్ తైలంగ్‌కు 2004లో పద్మశ్రీ అవార్డు వరించింది.
తైలంగ్ పూర్వీకులు తెలంగాణకు చెందినవారని, తెలంగాణగా ఉన్న పేరు తైలంగ్‌గా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజస్తాన్‌లోని బికనూర్‌లో పుట్టిన సుధీర్ తైలంగ్ ప్రముఖ రాజకీయ నేతలపై కార్టూన్లు వేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. విరివిగా వివిధ జాతీయ చానళ్లలో జరిగిన చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి కార్టూన్ రంగానికి తీరని లోటు అని ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ హైదరాబాద్ సంతాపం వ్యక్తం చేసింది.