క్రమం తప్పకుండా వస్తోన్నస్వామి శివానంద
మహాకుంభ్ నగర్: యూపీలోని ప్రయాగరాజ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహా కుంభ మేళాకు కోట్లాదిగా జనం తరలివస్తున్నారు. ఈ క్రతువులో బయటి ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు, మునులు సైతం పాలుపంచుకోవడం తెలిసిందే. అలాంటి కోవకు చెందిన వారే పద్మ శ్రీ అవార్డు గ్రహీత, యోగ సాధకుడు స్వామి శివానంద బాబా.
1896లో జన్మించిన స్వామి శివానంద బాబా గత వందేళ్లుగా ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగే ప్రతి కుంభమేళాలోనూ హాజరవుతున్నారు. తాజాగా, మహాకుంభమేళాకు సైతం వచ్చారు. సంగంలోని 16వ నంబర్ సెక్టార్‌లోని టెంట్‌లో ఈయన బస చేస్తున్నారు. టెంట్ బయట బాబా ఆధార్ కార్డు, పుట్టిన రోజు సర్టిఫికెట్ కాపీని ఆయన శిష్యులు ప్రదర్శనకు ఉంచారు. బాబా శిష్యుడు, బెంగళూరుకు చెందిన ఫల్గుణ్ భట్టాచార్య వారిలో ఒకరు.
‘బాబా బిచ్చగాళ్ల కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు సాధువుల బోధనలకు తరచూ వెళ్లేవారు. ఆ క్రమంలోనే వారు నాలుగేళ్ల వయస్సులో బాబాను సాధువులకు అప్పగించేశారు. ఆరేళ్ల వయస్సులో బాబా తిరిగి సొంతింటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆయన సోదరి మరణించింది. మరికొద్ది రోజులకు తల్లిదండ్రులు సైతం తనువు చాలించారు. వారి కర్మకాండలు పూర్తయ్యాక బాబా ఒంటరయ్యారు’అని భట్టాచార్య వివరించారు. ‘అప్పటి నుంచి జీవితమే మారిపోయింది. రాత్రి 9 గంటలకు పడుకుని, వేకువజామున 3 గంటలకే నిద్ర లేవడం మిగతా దినమంతా యోగా, ధ్యానంలోనే గడపడం దినచర్యంగా మార్చుకున్నారు’అని తెలిపారు. ఇప్పటి వరకు ఆయన అనారోగ్యం బారిన పడిన దాఖలాలు లేవన్నారు. కానుకలు స్వీకరించరని చెప్పారు.
పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని, ఉడికిన ఆహారాన్ని ఉప్పు, నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు. వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతం కబీర్ నగర్‌లోని ఆశ్రమంలో ఉంటున్నారని తెలిపారు. 2022 మార్చి 21వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మీ శ్రీ అవార్డును స్వీకరించారు. బాబా వయస్సు 125 ఏళ్లని రాష్ట్రపతి భవన్ అప్పట్లో పేర్కొంది. కాగా, ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకర అలవాట్లు, శారీరక శ్రమే కారణమన్నది స్వామి శివానంద బాబా అభిప్రాయం. అందుకే, ఉదయాన్నే మేల్కొనడం, కాసేపు నడక, కనీస అరగంటపాటు యోగ సాధనతోపాటు సరైన ఆహార నియమాలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారని ఫల్గుణ్ భట్టాచార్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment