నూనె, ఉప్పు లేదు.. పాలు, పండ్లు లేవు
8 ఏళ్ల వయస్సు నుంచే యోగాభ్యాసం.. వైవిధ్య భరితమైన భారతీయ సాంస్కృతిక జీవితానికి సమున్నతమైన ప్రతిరూపం. ప్రపంచంలోనే పెద్ద వయస్కులుగా భావించే నూటా ఇరవై ఆరు సంవత్సరాల పద్మశ్రీ స్వామి శివానంద .. రుషులు, మహర్షులకు మాత్రమే సాధ్యమైన పరిపూర్ణతను తన నిరాడంబర జీవన విధానం ద్వారా సుసాధ్యం చేశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాల్య స్నేహితుడైన స్వామి శివానంద.. 118 ఏళ్లుగా యోగా, ప్రాణాయామం చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ.. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న ఆయన జీవన విధానం యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. మూడు శతాబ్దాలను చూసిన ఈ యోగా గురు ఆదివారం నగరంలోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన యోగానమామి అనే యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి శివానంద సాక్షితో ప్రత్యేకంగా తన జీవితానుభవాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
– సాక్షి, హైదరాబాద్
డబ్బు లేని జీవితం, దానాలు, కోరికలు లేవు, నూనె, ఉప్పు, పాలు, పండ్లు ఇవేమీ నా జీవితంలో లేవు. రాత్రి 9 గంటలకే పడుకోవడం, ఉదయాన్నే 3 గంటలకు నిద్ర లేవడం, 118 సంవత్సరాలుగా యోగా.. ఇదే నా దీర్ఘాయువు రహస్యం. ఒకప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇప్పటి బంగ్లాదేశ్‌లో 1896 ఆగస్టు 8న జన్మించాను. నేను పుట్టిన ఆరు సంవత్సరాలకే భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగించే నా తల్లిదండ్రులు, సోదరి మరణించారు.
తదనంతరం నా గురువు ఓంకారానంద గోసామి దగ్గరే నా జీవితం కొనసాగింది. అలా ఎనిమిదేళ్ల వయస్సు నుంచే యోగా చేయడం ప్రారంభించాను. పురాతన, సాధారణ జీవన విధానాన్ని పాటించే నేను రెండు పూటల ఆహారం మాత్రమే తింటాను. అల్పాహారం చాలా అరుదుగా తింటాను, అందులోనూ ఉడికించిన బంగాళదుంపలు తింటాను. మధ్యాహ్నం రెండు చపాతీలు, ఉడకబెట్టిన బంగాళదుంపలు–కూరగాయలు, రాత్రి 8 గంటల సమయంలో బార్లీ, గంజి ఆహారంగా తీసుకుంటాను. ఏది తిన్నా తక్కువ పరిమాణంలో తింటాను. రుచికరమైన ఆహారం, ఫాస్ట్ ఫుడ్‌కి దూరంగా ఉంటాను.
జీవించడానికి తింటాను..
చాలామంది తినడానికి జీవిస్తారు కానీ నేను జీవించడానికి తింటాను. దినచర్యలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి అభ్యంగన స్నానం చేసి గంటసేపు అలా నడుస్తాను. అనంతరం యోగా, పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమవుతాను. పగలు రెండు గంటలు విశ్రాంతి తీసుకుంటాను. బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్న నాకు కుటుంబ సభ్యులు ఎవరూ లేరు, బ్రహ్మచారిగా వారణాసిలో నివసిస్తున్నాను.
అతి తక్కువగా మాట్లాడతాను. అనవసర సంభాషణలు, మానసిక ఆరోగ్యానికి మంచివి కాదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు నా దరి చేరలేదు. మందులు వాడాల్సిన అవసరం రాలేదు. ఈ వయస్సులో కూడా కర్రలేకుండా నడుస్తాను, పశ్చిమోత్తనాసనం, సర్వంగాసనం, పవన ముక్తాసనాలను ప్రదర్శిస్తాను. అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా వరల్డ్‌వైడ్ బుక్ రికార్డ్‌లో స్థానం పొందాను.
నేతాజీ నా బాల్య స్నేహితుడే..
ఎక్కువ సంవత్సరాలు జీవించాలంటే సర్వాంగాసనం, మత్సా్యసనం వేయాలి. ఇవి జీవితాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. గత 35 ఏళ్లుగా ఆరు ఖండాల్లో ప్రయాణించాను. ఒకానొక సమయంలో మిడిల్ ఈస్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్‌పోర్ట్‌లో నా పుట్టిన తేదీని చూసి ఆశ్చర్యపోయారు. సుభాష్ చంద్రబోస్ నా బాల్య స్నేహితుడే. ఆయన, నేను దాదాపు ఒకే సంవత్సర కాలంలో జన్మించాం.
యోగాకు ఆదరణ పెరిగింది
వందేళ్ల ప్రయాణంలో యోగా విధానంలో పలు మార్పులను గమనించాను. అప్పుడైనా ఇప్పుడైనా యోగా అనేది ఒక్కటే. గత కొన్ని సంవత్సరాలుగా యోగాకు ఆదరణ పెరిగింది. యోగా విధానాల్లో సందిగ్ధాలు ఉన్నప్పటికీ యోగాభ్యాసం, శ్వాస, ధ్యానం దాని ముఖ్యాంశాలు. యోగా గురు రామ్‌దేవ్ బాబా ఆచరిస్తున్న జీవన విధానం కూడా నాకు ఇష్టం. తను ఎంతో కృషి చేస్తున్నారు.
నా దృష్టిలో మనిషే దైవం
నా చిన్నతనంలో ఆకలి కడుపును నింపుకోడానికి భిక్షాటన చేసేవాళ్లం. అందులోని బాధ, అవస్థలు నాకు తెలుసు. ఈ దేశంలో ఇప్పటికీ కొందరు పేదలు పాలు, పండ్లు లేని జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే నేను కూడా పాలు, పండ్లు తినడం మానేశాను. నా దృష్టిలో మనిషే దైవం. మనుషులకు సేవ చేస్తే దైవానికి చేసినట్టే. అలాంటి మనుషులైన కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం వెలేసింది. వారికి సాంత్వన అందించాలనే ఉద్దేశంతో గత 50 ఏళ్లుగా వారికి సేవలు అందిస్తున్నా. పూరీలోని 600 వందల మంది కుష్టు రోగులకు అన్ని అవసరాలు తీరుస్తూ అండగా ఉంటున్నా. నాకు సంబంధించి ఎలాంటి పుస్తకాలు, మరే ఇతర మాధ్యమాలు లేవు. నా జీవితమే ఒక సందేశం.
ఆత్మీయతకు మారుపేరు హైదరాబాద్
హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి. కానీ ఈ నగరానికి చెందిన ఎందరో వ్యక్తులు నన్ను వారణాసిలో కలిశారు. హైదరాబాదీలు ఎంతో ఆత్మీయతను కలిగి ఉంటారు. నగరవాసులు మరింత యోగా సాధన చేయాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను.