20 మంది వైద్యులు... ఏడున్నర గంటలు...
* కరీంనగర్ జిల్లా మహిళకు విజయవంతంగా గుండెమార్పిడి
* పదేళ్ల తర్వాత నిమ్స్‌లో ఈ తరహా ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) వైద్యులు మరో రికార్డు సాధించారు. ఇటీవల కాలేయ, పాక్షిక పుర్రె మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు... తాజాగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు గురువారం గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసి, పునర్జన్మ ప్రసాదించారు. జీవన్‌దాన్, సీఎంఆర్‌ఎఫ్ సహాయంతో పదేళ్ల తర్వాత నిమ్స్‌లో గుండె మార్పిడి చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు.
కరీంనగర్‌జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓంలత(30) ఏడాది కాలంగా తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నారు. స్థానిక వైద్యులను సంప్రదించగా... గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. మందులు, సర్జరీలతో నయం కాదని స్పష్టం చేశారు. దీంతో ఆమె మూడు వారాల క్రితం నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఆర్‌వీ కుమార్‌ను సంప్రదించారు. ఈ సమస్యకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమని సూచించారు. శస్త్రచికిత్సకు రూ.11 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. వైద్య ఖర్చులు భరించే స్తోమత బాధితురాలికి లేకపోవడంతో... సీఎంఆర్‌ఎఫ్, జీవన్‌దాన్‌లో ఆమె పేరు నమోదు చేశారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.
బ్రెయిన్‌డెడ్ యువకుడి గుండె దానం...
కాగా, వరంగల్ జిల్లా హుజురాబాద్ సమీపంలో గత శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పి.వినయ్‌కుమార్(20) తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతడిని మంగళవారం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో... బుధవారం వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్థారించారు. కుమారుని అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. జీవన్‌దాన్ ఇన్‌చార్జి స్వర్ణలత సమాచారంతో నిమ్స్ వైద్యులు గుండె సేకరించారు. బాధితురాలికి దాత గుండె సరిపోతుందని నిర్థారించుకున్నారు.
20 మంది వైద్యులు... ఏడున్నర గంటలు...
రాత్రి పదకొండు గంటలకు యశోద ఆస్పత్రిలో దాత నుంచి గుండె సేకరించారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గ్రీన్‌చానల్ ద్వారా ఏడు నిమి షాల్లోనే నిమ్స్‌కు చేర్చారు. అప్పటికే ఆపరేషన్ థియేటర్‌లో బాధితురాలి ఛాతిని ఓపెన్ చేసి శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. కార్డియో థొరాసిక్ అధిపతి ఆర్‌వీ కుమార్ నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్య బృందం... బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏడున్నర గంటలు శ్రమించి బాధితురాలికి విజయవంతంగా గుండె అమర్చింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచారు. మరో 48 గంటల తర్వాత ఆమె స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.