సహజసిద్ధమైన గుండె కవాటాలను అందించడమే లక్ష్యం
పేద రోగులకు ఉచితంగా హార్ట్ వాల్వులు పంపిణీ
త్వరలో హార్ట్ వాల్వ్ బ్యాంకును ప్రారంభించనున్న వైద్య మంత్రి
లక్డీకాపూల్: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్ వాల్వ్)లను అందించేందుకు నిమ్స్ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు.
ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్‌ల మార్పిడి ఆపరేషన్ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్ వాల్వ్ బ్యాంక్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని భావిస్తున్నారు.
బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల నుంచి సేకరణ..
బ్రెయిన్ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్ డెత్‌కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్ బ్యాంక్) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్‌కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment