తొలి వెలుగు!
గ్రేట్ లవ్ స్టోరీస్
ప్రేమలో విషాదం ఉంటుంది. కానీ, అసలైన విషాదం... మనలో ప్రేమే లేకపోవడం!
మైత్రి ప్రేమరాహిత్యంతో ఎందుకు కనిపిస్తుంది? ప్రేమ అనే మాట వినగానే ఎందుకు ఉలిక్కిపడుతుంది? ఆమె ఎప్పుడూ ఏదీ చెప్పదు. కానీ ఆమె కళ్లలో కనిపించీ కనిపించని నల్లటి విషాదపు నీడ మాత్రం... ఏదో చెప్పకనే చెబుతుంది. దాన్ని నాజరస్ గుర్తించాడు. అందుకే ఆమె మౌనాన్ని తన మాటలతో చెరిపేయాలని, తన పెదవులపై నవ్వుల పూలు పూయించాలని కలలు కన్నాడు.
అమావాస్య చీకట్లో నుంచి ఆమెను బయటికి తీసుకువచ్చి... వెన్నెల వర్షంలో తడిపెయ్యాలని తహతహలాడాడు.
‘‘ఎందుకిలా నా చుట్టూ తిరుగు తున్నావు... వేరే పనేమీ లేదా?’’ ఒకరోజు కోపంగా నాజరస్‌ను నిలదీసింది మైత్రి.
‘‘లేదు. నిన్ను ప్రేమించడమే నాకు ఉన్న ఏకైక పని’’... అప్పటి వరకు లేని గాంభీర్యాన్ని కొని తెచ్చుకుని అన్నాడు నాజరస్.
‘‘పిచ్చివాడిలా ఉన్నావే... అసలు నా గురించి నీకేం తెలుసు?’’ అడిగింది మైత్రి.
‘‘ఏమీ తెలియనక్కర్లేదు. అన్నీ తెలుసు కుని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించడమే ప్రేమ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.’’
ఆ తర్వాత వారి మధ్య కొన్ని నిమిషాల మౌనం. క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే నాజరస్... అప్పుడు మాత్రం మౌనాంకితుడైపోయాడు. న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఖైదీలా ఉన్నాడు. అతడి ఎదురు చూపులు ఫలించాయి. ‘సరే’ అంది మైత్రి.
ఆనందంతో నోట మాట రాలేదు నాజరస్‌కి. కళ్ల నుంచి కన్నీళ్లు మౌనంగా జారుతున్నాయి! కానీ మైత్రికి ఆనందంతో కూడా కన్నీళ్లు రావడం లేదు. ఎందుకంటే ఆమె మనసులోని చెమ్మను విధి పూర్తిగా పీల్చేసింది. ఆమె గతం అలాంటిది!
బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేది మైత్రి. ‘‘ఆడపిల్ల పదవ తరగతి వరకు చదివితే చాలు’’ అంటూ చదువు మానిపించి ఆమెకి పెళ్లి చేసేశాడు తండ్రి. అయిపోయిందేదో అయిపోయింది, సర్దుకుపోదాం అనుకుంది మైత్రి. కానీ ఆ అవకాశం లేకపోయింది. ఎందుకంటే, భర్తకి లేని చెడు అలవాటు లేదు. బాగా తాగి వచ్చి మైత్రిని చావబాదే వాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అతడిలో మార్పు రాలేదు. అంతా తన ఖర్మ అనుకుంది. అయితే అంతలోనే ఒకరోజు అతడు వచ్చి భోరుమన్నాడు. ‘‘ఏమైంది?’’ అని ఆందోళనగా అడిగింది మైత్రి.
‘‘నాకు హెచ్‌ఐవీ సోకింది. ఇక ఎంతో కాలం బతకను’’ అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. బెంగాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల్లోనే మరణించాడు. భర్త నుంచి తనకు హెచ్‌ఐవీ సోకిందేమోనని పరీక్షలు చేయించుకుంది మైత్రి. బతుకు మరోసారి చీకటయినట్లు అనిపించింది. తనకు కూడా హెచ్‌ఐవీ సోకింది! కాస్తయినా కనికరం లేకుండా అత్తింటివాళ్లు మైత్రిని ఇంటి నుంచి తరిమేశారు. పిల్లలను ఆమె దగ్గరికి వెళ్లనివ్వలేదు. చివరకు ఆమెను కన్న తల్లి కూడా కూతుర్ని చేరదీయలేదు.
ఎటు చూసినా చీకటి.
భవిష్యత్తు అన్నది కన్ను పొడుచుకు చూసినా కాన రాలేదు. సరిగ్గా అదే సమయంలో ‘బీఎన్‌పీఎల్’(బెంగాల్ నెట్‌వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్‌ఐవీ, ఎయిడ్స్) సభ్యులు కొందరు పరిచయమయ్యారు. వాళ్లంతా తనలాగే భర్తను పోగొట్టుకున్న వారు. హెచ్‌ఐవీ బాధితులు. వారితో చెలిమి మైత్రిలో ధైర్యాన్ని నింపింది. ఆ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగమూ దొరి కింది. ఆ పని చేస్తూనే సంస్థ ప్రచార కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో విషాదం నుంచి ఉపశమనం లభించినట్లు అనిపిం చింది మైత్రికి. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న నాజరస్ పరిచయమయ్యాడు. ఆమె జీవితానికి ఒక కొత్త అర్థం ఇచ్చాడు.
మైత్రిని పెళ్లాడిన నాజరస్‌ను ‘పిచ్చోడు’ అన్నారు చాలామంది. అతని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏ ఒక్కరూ వారి వెంట నిలవలేదు సరికదా సూటి పోటి మాటలు, వెటకారాలతో వాళ్ల మనసులకు తూట్లు పొడవాలని ప్రయత్నించారు. కానీ నాజరస్ పట్టించుకోలేదు. ఆ నిరసనల సెగ మైత్రిని తాకనివ్వలేదు. ఆమెను సంతోషంగా ఉంచడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా సాగిపోతున్నాడు. ఆ ప్రేమ ముందు వెక్కిరింపులు, అవహేళనలు చిన్నబోయాయి. అవి వారి ప్రేమబంధానికి దిష్టిచుక్కలుగా మిగిలిపోయాయి.