maitri
-
భారత్-నేపాల్ మైత్రి యాత్ర రైలు ప్రారంభం.. టిక్కెట్ ఎంతంటే..
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు చెందిన భారత్ గౌరవ్ రైలు సిరీస్‌లో మరో రైలు ప్రారంభమైంది. భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలు నేపాల్ పర్యటన కోసం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుండి పరుగులందుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ రైలు ప్రయాణంతో పర్యాటకులు భారత్ - నేపాల్ భాగస్వామ్య సాంస్కృతిక వారసత్వాన్ని చవిచూడగలుగుతారు. ఈ యాత్రకు ‘ఇండియా- నేపాల్ మైత్రి యాత్ర’ అని పేరు పెట్టారు. రైల్వేల ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అందరూ సందర్శించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా భారత్ గౌరవ్ యాత్ర పేరుతో ఈ నూతన సేవను ప్రారంభించామని, ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త భారత్ గౌరవ్ యాత్రలు ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఈ భారత్ గౌరవ్ రైలులో ప్రయాణికులు భారతదేశం- నేపాల్‌ల సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ఒకే ప్యాకేజీలో పర్యటించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 'ఇండియా నేపాల్ మైత్రి యాత్ర' ప్రయాణం 9 రాత్రులు, 10 పగళ్లు ఉండనుంది. ఈ రైలు ప్యాకేజీలో అయోధ్య, కాశీ, సీతామర్హి, జనక్‌పూర్, పశుపతినాథ్, బిండియా బస్ని టెంపుల్లను దర్శించవచ్చు. ప్రయాణికుల బస, ప్రయాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారతీయ రైల్వే కల్పిస్తుంది.ఈ రైలులో మొదటి ఏసీ క్యాబిన్ ఛార్జీ ఒక్క వ్యక్తికి రూ.1,05,500, ఇద్దరికి రూ.89,885, ముగ్గురికి రూ.87,655లు ఉంటుంది. ఇందులో బెడ్ విత్ చైల్డ్ ఛార్జీ రూ.82,295. సెకండ్ ఏసీలో ఒక్క వ్యక్తి టిక్కెట్ ధర రూ.94,735. ఇద్దరు వ్యక్తులకు రూ.79,120 కాగా, ముగ్గురికి రూ.76,890. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.71,535గా ఉంది. థర్డ్ ఏసీలో ఒక్క వ్యక్తికి రూ.81,530, ఇద్దరికి రూ.66,650, ముగ్గురికి రూ.64,525. ఇందులో బెడ్‌తో కూడిన పిల్లల ఛార్జీ రూ.60,900గా ఉంటుంది. ఈ రైలులో ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యవంతమైన సీట్లతో పాటు పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. రైలులో ప్రయాణికుల కోసం రెండు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో 370 రోజులకు పైగా! -
Maitri Patel: రైతు కూతురు.. అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్..
ఆకాశంలో విమానం ఎగురుతున్న శబ్దం వచ్చిందంటే చాలు ఇంట్లో ఏ మూలన ఉన్నా.. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి విమానం కనపడినంతసేపూ గాలిలో చేతులూపుతూ సంతోషపడుతుంటారు చిన్నపిల్లలు. గుజరాత్‌కు చెందిన మైత్రి పటేల్ కూడా తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తొలిసారి విమానాన్ని చూసింది. ‘అబ్బ! బలే ఉంది! ఆకాశంలో ఎంత బాగా ఎగురుతుందో అని సంబరపడడమేగాక, తను కూడా పెద్దయ్యాక విమానం నడపాలని అప్పుడే నిర్ణయించుకుంది. అనాటి కలను ఈరోజు నిజం చేసుకుని, దేశంలోనే తొలి అతి పిన్న కమర్షియల్ పైలట్‌గా నిలిచింది. సూరత్‌లోని ఓల్పాడ్ నగరానికి చెందిన మైత్రి తండ్రి కాంతీలాల్ వ్యవసాయం చేస్తున్నారు. తల్లి రేఖ బెన్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో సివిల్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కూతుర్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టాలన్న తపనతో ప్రైవేటు స్కూల్లో చేర్చి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు కాంతీలాల్ దంపతులు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ స్కూల్ విద్య అయ్యాక.. ఇంటర్మీడియట్లో ఉండగా మైత్రిని ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో చేర్పించారు. అక్కడ కెప్టెన్ ఏడీ మాణిక్ మైత్రికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో.. ఒకపక్క ఇంటరీ్మడియట్ చదువుతూనే పైలట్‌కు సంబంధించిన గ్రౌండ్ శిక్షణను పూర్తిచేసింది. శని, ఆదివారాల్లో ఎంట్రన్స్ పరీక్షకు సన్నద్ధమవుతూ అమెరికాలో పైలట్ ట్రైనింగ్ తీసుకునేందుకు అర్హత సాధించింది. ఇక్కడ వరకు అంతా సాఫీగా సాగినప్పటికీ అగ్రరాజ్యంలో పైలట్ ట్రైనింగ్ తీసుకోవడానికి కావలసినంత డబ్బు సమకూరలేదు. చిన్నప్పటి నుంచి తమ కూతుర్ని పైలట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రోత్సహిస్తున్న కాంతీలాల్... తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న స్థలాన్ని విక్రయించి మైత్రిని అమెరికాలో పైలట్ ట్రైనింగ్ కోర్సులో చేర్పించారు. పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన ట్రైనింగ్‌ను మైత్రి కేవలం పన్నెండు నెలల్లోనే పూర్తిచేసింది. చాలామంది పద్దెనిమిది నెలలు పూర్తయినా కూడా ట్రైనింగ్‌ను పూర్తిచేయలేరు. అటువంటిది ఆరునెలల ముందుగానే పైలట్ ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి అమెరికా పైలట్ లైసెన్స్‌ను పొందింది మైత్రి. దీంతో ఇండియాలోనే అతిపిన్న తొలి కమర్షియల్ పైలట్‌గా రికార్డు సృష్టించింది మైత్రి పటేల్. ఈ విషయం తెలిసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆమెను అభినందించారు. ఏదైనా త్వరగా నేర్చుకుంటుంది.. ‘‘మైత్రి సూరత్‌లో, స్కైలైన్ ఏవియేషన్ ముంబైలో ఉంటుంది. ఒకపక్క చదువుకుంటూ, మరోపక్క పైలట్ శిక్షణ తీసుకోవడం కష్టం. అందుకే ఆమెకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాము. త్వరగా నేర్చుకునే అమ్మాయి కావడంతో... కరోనా సమయంలో కూడా పూర్తి సమయాన్ని కేటాయించి గ్రౌండ్ స్థాయి శిక్షణ పూర్తి చేసింది. అమెరికాలో 18 నెలల్లో పూర్తిచేయడానికి చాలా కష్టపడే శిక్షణను, పన్నెండు నెలల్లోనే పూర్తిచేసి దేశమంతా గర్వపడేలా చేసింది. ఇప్పుడు మైత్రి పటేల్ మహిళాభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. ఈమెను చూసి మరికొంతమంది పైలట్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని కెప్టెన్ మాణిక్ చెప్పారు. ప్రస్తుతం మైత్రి బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపడానికి త్వరలోనే శిక్షణ తీసుకోడానికి సన్నాహకాలు చేసుకుంటోంది. ‘‘ప్రస్తుతం అమెరికా లైసెన్స్ వచ్చింది. త్వరలో దానిని ఇండియన్ లైసెన్స్‌గా మార్చుకుని ఎయిర్ లైన్స్‌లో పనిచేస్తాను. పైలట్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయపడతాను’’ అని మైత్రి చెబుతోంది. 19 ఏళ్ల వయసులో ఇంత గొప్ప విజయం సాధించిన మైత్రి ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: చెత్తబుట్టలో పడేసే సీసాలతో అందమైన షాండ్లియర్ -
కొత్తపేటలో సాక్షి మైత్రి సదస్సు
-
ఓ ఆత్మకథ...
మిస్టరీ ‘‘అబ్బ... ఎంత అందంగా ఉన్నావే. నాకే ముద్దొచ్చేస్తున్నావ్’’... సుగంధ బుగ్గలు పట్టి లాగింది మైత్రి. ‘‘ఛీ ఊరుకోవే’’ అంది సుగంధ స్నేహితురాలి చేతుల్ని తోసేస్తూ. ‘‘ఏం సిగ్గుపడుతున్నావే. మా దగ్గరే ఇలా ఉంటే, ఇక మీ ఆయన వచ్చాక ఎన్ని సిగ్గులొలకబోస్తావో’’ అంది మరో స్నేహితురాలు రాగిణి కన్నుగీటుతూ. నిజంగానే సిగ్గు ముంచుకు వచ్చింది సుగంధకి. రెండు చేతులతో ముఖాన్ని మూసుకుంది. ‘‘ఏడిపించింది చాలు వెళ్లండి’’ అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. ‘‘వెళ్లిపోతాంలేవే. మీ ఆయన వచ్చే టైమయ్యిందని మాక్కూడా తెలుసులే’’ పకపకా నవ్వుతూ వెళ్లిపోయారందరూ. గోడకున్న గడియారం వైపు చూసింది సుగంధ. తొమ్మిదీ పది అయ్యింది. ఇంకో పది నిమిషాల్లో భర్త వస్తాడు. ఓసారి గదంతా పరికించి చూసింది సుగంధ. అందంగా అలంకరించి ఉంది. మంచం నిండా పూలు పరిచి ఉన్నాయి. వాటి గుబాళింపులు గదంతా వ్యాపించాయి. మంచం దిగి అద్దం దగ్గరకు వెళ్లింది సుగంధ. మైత్రి చెప్పింది నిజమే. తను ఈ దుస్తుల్లో ఎంతో అందంగా ఉంది. ఓసారి తన రూపాన్ని సాంతం చూసుకుంది. పక్కకు జరిగిన పాపిట బిళ్లను సరి చేసు కుంది. బొట్టు కాస్త పెద్దదైనట్టుగా అని పించడంతో తీసేసి చిన్న స్టిక్కర్ పెట్టు కుంది. తృప్తిగా నవ్వుకుని వెళ్లి మంచంపై కూర్చుంది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సుగంధ గబగబా దుపట్టాను ముఖం కనిపించకుండా తల మీదుగా కప్పుకుంది. తలుపు మూసి వచ్చాడు విమలేష్. ‘‘సారీ... లేటయ్యింది. ఫ్రెండ్స్ వదిలి పెడితేగా. ఒకటే ఏడిపించారు’’ అన్నాడు సుగంధ పక్కనే కూర్చుంటూ. ‘‘ఫరవాలేదు’’... సుగంధ స్వరం మంద్రంగా పలికింది. ఆమెకు దగ్గరగా జరిగాడు విమలేష్. మెల్లగా దుపట్టాను పైకి లేపాడు. గడ్డం పుచ్చుకుని సుగంధ ముఖాన్ని పైకి లేపాడు. అంతే... ఉలిక్కిపడి లేచాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు కంగారుగా. ‘‘అవును... నేనే’’ అంది సుగంధ. ఈసారి ఆమె స్వరం మంద్రంగా లేదు. మొరటుగా ఉంది. కంచు మోగినట్టుగా ఉంది. ఆ స్వరానికి గది దద్దరిల్లింది. ‘‘నువ్వు... నువ్వు..’’... మాట రావడం లేదు విమలేష్కి. నిలువెల్లా వణికిపోతున్నాడు. చెమటతో తడిసి ముద్దవుతున్నాడు. సుగంధ అతడివైపే చూస్తోంది. కోపంగా... కసిగా... అసహ్యంగా. ‘‘ఎందుకలా దూరంగా వెళ్లిపోతున్నావ్. రా... దగ్గరకు రా’’ అంది. తల అడ్డంగా ఊపాడు విమలేష్. అక్కడ్నుంచి పారిపోవాలని ఉంది. కానీ కాళ్లు కదలడం లేదు. ఒళ్లంతా గడ్డకట్టేసి నట్టుగా అనిపిస్తోంది. కానీ కదలాలి. అక్కడ్నుంచి పారిపోవాలి. ఎలాగో శక్తిని కూడదీసుకున్నాడు. ఒక్క అంగలో గదిలోంచి బయటకు పరుగుదీశాడు. ఇల్లంతా గోలగోలగా ఉంది. సుగంధ ఏడుస్తోంది. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. పెద్దలంతా విమలేష్ని నిలబెట్టి నిలదీస్తున్నారు. విమలేష్ మాట్లాడటం లేదు. భయంభయంగా సుగంధ వైపే చూస్తున్నాడు. ‘‘నేనంటే ఆయనకు ఇష్టం లేదను కుంటా. అందుకే నన్ను వదిలేసి బయటకు వచ్చేశారు. వద్దంటే చెప్పమనండి. వెళ్లిపోతాను’’ అంది సుగంధ ఏడుస్తూ. ‘‘చెప్పరా... అమ్మాయి అడుగుతోంది కదా! తనంటే ఇష్టం లేదా. మరెందుకు పెళ్లి చేసుకున్నావ్. ముందే చెప్పి చావొచ్చు కదా’’... అరుస్తున్నాడు విమలేష్ తండ్రి. ‘‘తను... తను సుగంధ కాదు నాన్నా. దెయ్యం. నన్ను చంపడానికి వచ్చింది. నన్ను కచ్చితంగా చంపేస్తుంది.’’ విమలేష్ మాటలకు విస్తుపోయా రంతా. బంగారు బొమ్మలాంటి పిల్లని పట్టుకుని దెయ్యమంటాడేంటి అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఏదో గాలి సోకినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు తలపండిన వాళ్లు కొందరు. ‘‘నాకే గాలీ సోకలేదు. నేను చెప్పేది నిజం. అది సుగంధ కాదు. పుర్వి. నన్ను చంపడానికొచ్చింది. దాన్ని నేను మోసం చేశానని నా మీద పగబట్టింది. దెయ్యమై వచ్చింది నన్ను చంపడానికి. దాన్ని పంపెయ్యండి. వెంటనే పంపెయ్యండి.’’ పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాడు విమలేష్. అందరూ అతని మాటలకు అవాక్కయిపోయారు. పుర్వి ఎవరు? ఆమెను విమలేష్ మోసం చేయడమేంటి? ఆమె దెయ్యమై రావడమేంటి? ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ అయోమయంగా చూడసాగారు. అప్పుడు పెదవి విప్పింది సుగంధ. ‘‘మీ అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలు నాకు తెలుసు. వాటికి సమాధా నాలు నా దగ్గరున్నాయి’’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది. మూడు నెలల క్రితం ఓ మధ్యాహ్నం... తన గదిలో పడుకుని పుస్తకం చదువు కుంటోంది సుగంధ. అంతలో ఫోన్ మోగింది. స్క్రీన్ మీద నంబర్ చూడగానే సంతోషంగా లేచి కూర్చుంది. పుస్తకం పక్కన పడేసి, ఫోన్ చేతిలోకి తీసుకుంది. ‘‘ఏయ్ పుర్వీ.. ఎలా ఉన్నావే? ఎన్నాళ్లయ్యింది నీతో మాట్లాడి... ఏంటే విశేషాలు?’’.. ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఏం లేదు సుగంధా... నీతో మాట్లాడాలనిపించింది. అందుకే చేశాను.’’ పుర్వి గొంతు మెల్లగా ఉంది. ఏదో బాధ బరువును మోస్తున్నట్టుగా ఉంది. ‘‘ఏంటే? ఎందుకలా ఉన్నావ్? ఏమైంది?’’ ఆతృతగా అడిగింది సుగంధ. అలా అడగడంతోనే బావురుమంది పుర్వి. వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘నేను మోసపోయాను సుగంధా. దారుణంగా మోసపోయాను. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే గుడ్డిగా నమ్మాను. ఎంతో దగ్గరైపోయాను. ఇప్పుడేమో తను నన్ను మానేసి వేరే అమ్మాయిని చేసు కుంటానంటున్నాడు. ఇంట్లోవాళ్లు ఒప్పు కోరు అంటూ వంకలు చెబుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నానే. ఈ ద్రోహాన్ని నేను భరించలేకపోతున్నాను.’’ మ్రాన్పడిపోయింది సుగంధ. ‘‘అతను చాలా మంచివాడన్నావ్ కదే. అలా ఎందుకు చేస్తున్నాడు?’’ ‘‘మోసగాడు అలా కాకపోతే ఎలా చేస్తాడు సుగంధా. తప్పు నాదే. నేనే తనని నమ్మకుండా ఉండాల్సింది. నీకో విషయం తెలుసా? నేను తల్లిని కాబోతున్నాను. అందుకే పెళ్లి చేసుకొమ్మని అడిగాను. కుదరదన్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లి కుదిరి పోయిందట. మరో మూడు నెలల్లో పెళ్లి అట. చూశావా ఎంత మోసం చేశాడో? నా జీవితం ముగిసిపోయింది సుగంధా. ఇక నేను బతికి లాభం లేదు.’’ ‘‘అయ్యో పుర్వీ... అలా అనకు. అలా ఏం జరగదు. నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. నువ్వు...’’ సుగంధ మాట పూర్తి కాకముందే ఫోన్ కట్ అయిపోయింది. గుండె జారి పోయింది సుగంధకి. పుర్వి చాలా బాధలో ఉంది. తొందరపడి ఏమీ చేసుకోదు కదా! అలా అనుకోగానే మనసు రెపరెప లాడింది. వెంటనే పుర్వి దగ్గరకు వెళ్లాలి అనుకుంటూ మంచం దిగింది. అంతలో ఆమె తల్లి లోనికి వచ్చింది. ‘‘అమ్మా... నేను పుర్వి వాళ్లింటికి వెళ్తున్నాను’’ అంది సుగంధ హ్యాండ్‌బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ. నిట్టూర్చింది తల్లి. ‘‘నేనూ వస్తాన్రా. పాపం పుర్వి.’’ అయోమయంగా చూసింది సుగంధ. ‘‘ఏంటమ్మా... ఎందుకలా అన్నావ్’’ అంది తల్లి ముఖంలోకి చూస్తూ. ‘‘నాకు విషయం తెలిసింది. నీ ఫ్రెండ్ రూప ఇప్పుడే చెప్పింది. నీ సెల్‌కి చేస్తే ఎంగేజ్ వస్తోందట. అందుకే ల్యాండ్‌లైన్‌కి చేసింది. పాపం పుర్వి ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుందట కదా!’’ హడలిపోయింది సుగంధ. ఏమంటోంది అమ్మ? పుర్వి ఆత్మహత్య చేసుకుందా? అది కూడా ఈ రోజు ఉదయమా? అదెలా? మరి ఇంతవరకూ తనతో మాట్లాడింది ఎవరు? పుర్వి కాదా? మాట్లాడింది తనే. కచ్చితంగా తనే. మరి పొద్దున్నే చనిపోవడమేంటి? వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది సుగంధకి. జరిగినదాన్ని జీర్ణించుకోలేక ఉన్నచోటే కూలబడిపోయింది. ‘‘ప్రేమలో మోసపోయిన పుర్వి చని పోయింది. తన ప్రాణాలు తనే తీసుకుంది. కానీ తన మరణం వెనుక ఉన్న నిజం మరుగున పడిపోకూడదని అనుకుంది. అందుకే ఆ నిజాన్ని నాకు చేరవేసింది. ఆ రోజు నాకు ఫోన్ చేసింది... పుర్వి ఆత్మ.’’ వింటున్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఏం చెబుతోంది సుగంధ? ఆత్మా? ‘‘మీరు నమ్మరని నాకు తెలుసు. మొదట నేనూ నమ్మలేదు. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఆ రోజు మా అమ్మ, నేను పుర్వి వాళ్లింటికి వెళ్లాం. తను ఉరి వేసుకుని చనిపోయిందని తెలిసింది. పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్‌తో మాట్లాడితే తను గర్భవతి అని తేలింది. తర్వాత పుర్వి గదంతా వెతికాను. తన పుస్తకాల్లో ఒకచోట ఆమె ప్రియుడి ఫొటో దొరికింది. అది చూసి నేను షాక్ తిన్నాను. ఎందుకంటే ఆ ఫొటో ఎవరిదో కాదు... నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిది. ఆ వ్యక్తి ఎవరో కాదు... విమలేష్.’’ ఈసారి అదిరి పడ్డారంతా. సుగంధ చెప్పే కఠోర వాస్తవాల్ని జీర్ణించుకోలేక పోయారు వాళ్లు. అయితే ఆమె చెప్పిన ప్రతి మాటా ముమ్మాటికీ నిజం. సుగంధ, పుర్వి డిగ్రీ వరకూ కలిసే చదువుకున్నారు. పీజీకి మాత్రం వేర్వేరు కాలేజీల్లో చేరారు. కానీ అన్ని విషయాలనూ ఫోన్‌కాల్స్ ద్వారా పంచుకునేవారు. అలానే తన ప్రేమ విషయం కూడా సుగంధకు చెప్పింది పుర్వి. అయితే ఆమె ఎవరిని ప్రేమించింది అన్నది మాత్రం సుగంధకు తెలియదు. దాంతో విమలేష్తో తనకు పెళ్లి కుదుర్చుతామంటే ఓకే చెప్పింది. అయితే అంత తెలివిగా ఓ ఆడపిల్లను మోసం చేసినవాడు నిలదీసి అడిగితే నిజం చెప్పడు. అతడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు తన దగ్గర సాక్ష్యాలూ లేవు. అందుకే స్నేహితురాలికి న్యాయం చేయడం కోసం మౌనంగా అతణ్ని పెళ్లి చేసుకుంది సుగంధ. మొదటిరాత్రి పుర్విలా మాస్క్ వేసుకుని, ఆమెలా నటించి అతడితోనే నిజాన్ని చెప్పించింది. పుర్విని మోసగించి, ఆమె మరణానికి కారణమైన విమలేష్ని జైలుకు పంపించింది. ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన వాస్తవ గాథ. మరి ఇది విన్నాక కూడా దెయ్యాలు, ఆత్మలు అంతా ట్రాష్ అనాలా? లేక వాటిని ఉనికిని అంగీకరించాలా? -
తొలి వెలుగు!
గ్రేట్ లవ్ స్టోరీస్ ప్రేమలో విషాదం ఉంటుంది. కానీ, అసలైన విషాదం... మనలో ప్రేమే లేకపోవడం! మైత్రి ప్రేమరాహిత్యంతో ఎందుకు కనిపిస్తుంది? ప్రేమ అనే మాట వినగానే ఎందుకు ఉలిక్కిపడుతుంది? ఆమె ఎప్పుడూ ఏదీ చెప్పదు. కానీ ఆమె కళ్లలో కనిపించీ కనిపించని నల్లటి విషాదపు నీడ మాత్రం... ఏదో చెప్పకనే చెబుతుంది. దాన్ని నాజరస్ గుర్తించాడు. అందుకే ఆమె మౌనాన్ని తన మాటలతో చెరిపేయాలని, తన పెదవులపై నవ్వుల పూలు పూయించాలని కలలు కన్నాడు. అమావాస్య చీకట్లో నుంచి ఆమెను బయటికి తీసుకువచ్చి... వెన్నెల వర్షంలో తడిపెయ్యాలని తహతహలాడాడు. ‘‘ఎందుకిలా నా చుట్టూ తిరుగు తున్నావు... వేరే పనేమీ లేదా?’’ ఒకరోజు కోపంగా నాజరస్‌ను నిలదీసింది మైత్రి. ‘‘లేదు. నిన్ను ప్రేమించడమే నాకు ఉన్న ఏకైక పని’’... అప్పటి వరకు లేని గాంభీర్యాన్ని కొని తెచ్చుకుని అన్నాడు నాజరస్. ‘‘పిచ్చివాడిలా ఉన్నావే... అసలు నా గురించి నీకేం తెలుసు?’’ అడిగింది మైత్రి. ‘‘ఏమీ తెలియనక్కర్లేదు. అన్నీ తెలుసు కుని ప్రేమించడం ప్రేమ కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించడమే ప్రేమ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను.’’ ఆ తర్వాత వారి మధ్య కొన్ని నిమిషాల మౌనం. క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే నాజరస్... అప్పుడు మాత్రం మౌనాంకితుడైపోయాడు. న్యాయమూర్తి తీర్పు కోసం ఎదురు చూస్తున్న ఖైదీలా ఉన్నాడు. అతడి ఎదురు చూపులు ఫలించాయి. ‘సరే’ అంది మైత్రి. ఆనందంతో నోట మాట రాలేదు నాజరస్కి. కళ్ల నుంచి కన్నీళ్లు మౌనంగా జారుతున్నాయి! కానీ మైత్రికి ఆనందంతో కూడా కన్నీళ్లు రావడం లేదు. ఎందుకంటే ఆమె మనసులోని చెమ్మను విధి పూర్తిగా పీల్చేసింది. ఆమె గతం అలాంటిది! బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని కలలు కనేది మైత్రి. ‘‘ఆడపిల్ల పదవ తరగతి వరకు చదివితే చాలు’’ అంటూ చదువు మానిపించి ఆమెకి పెళ్లి చేసేశాడు తండ్రి. అయిపోయిందేదో అయిపోయింది, సర్దుకుపోదాం అనుకుంది మైత్రి. కానీ ఆ అవకాశం లేకపోయింది. ఎందుకంటే, భర్తకి లేని చెడు అలవాటు లేదు. బాగా తాగి వచ్చి మైత్రిని చావబాదే వాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా అతడిలో మార్పు రాలేదు. అంతా తన ఖర్మ అనుకుంది. అయితే అంతలోనే ఒకరోజు అతడు వచ్చి భోరుమన్నాడు. ‘‘ఏమైంది?’’ అని ఆందోళనగా అడిగింది మైత్రి. ‘‘నాకు హెచ్ఐవీ సోకింది. ఇక ఎంతో కాలం బతకను’’ అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. బెంగాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల్లోనే మరణించాడు. భర్త నుంచి తనకు హెచ్ఐవీ సోకిందేమోనని పరీక్షలు చేయించుకుంది మైత్రి. బతుకు మరోసారి చీకటయినట్లు అనిపించింది. తనకు కూడా హెచ్ఐవీ సోకింది! కాస్తయినా కనికరం లేకుండా అత్తింటివాళ్లు మైత్రిని ఇంటి నుంచి తరిమేశారు. పిల్లలను ఆమె దగ్గరికి వెళ్లనివ్వలేదు. చివరకు ఆమెను కన్న తల్లి కూడా కూతుర్ని చేరదీయలేదు. ఎటు చూసినా చీకటి. భవిష్యత్తు అన్నది కన్ను పొడుచుకు చూసినా కాన రాలేదు. సరిగ్గా అదే సమయంలో ‘బీఎన్‌పీఎల్’(బెంగాల్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవీ, ఎయిడ్స్) సభ్యులు కొందరు పరిచయమయ్యారు. వాళ్లంతా తనలాగే భర్తను పోగొట్టుకున్న వారు. హెచ్ఐవీ బాధితులు. వారితో చెలిమి మైత్రిలో ధైర్యాన్ని నింపింది. ఆ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగమూ దొరి కింది. ఆ పని చేస్తూనే సంస్థ ప్రచార కార్య క్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో విషాదం నుంచి ఉపశమనం లభించినట్లు అనిపిం చింది మైత్రికి. సరిగ్గా ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక స్వచ్ఛంద సంస్థలో పని చేస్తున్న నాజరస్ పరిచయమయ్యాడు. ఆమె జీవితానికి ఒక కొత్త అర్థం ఇచ్చాడు. మైత్రిని పెళ్లాడిన నాజరస్‌ను ‘పిచ్చోడు’ అన్నారు చాలామంది. అతని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఏ ఒక్కరూ వారి వెంట నిలవలేదు సరికదా సూటి పోటి మాటలు, వెటకారాలతో వాళ్ల మనసులకు తూట్లు పొడవాలని ప్రయత్నించారు. కానీ నాజరస్ పట్టించుకోలేదు. ఆ నిరసనల సెగ మైత్రిని తాకనివ్వలేదు. ఆమెను సంతోషంగా ఉంచడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా సాగిపోతున్నాడు. ఆ ప్రేమ ముందు వెక్కిరింపులు, అవహేళనలు చిన్నబోయాయి. అవి వారి ప్రేమబంధానికి దిష్టిచుక్కలుగా మిగిలిపోయాయి. -
'సాక్షి మైత్రి' సెమినార్‌కు అద్భుత స్పందన
-
సాక్షి ‘మైత్రి’కి విశేష స్పందన
సాక్షి, సిటీబ్యూరో: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు, స్వయం ఉపాధితో మెరుగైన భవితనందించేందకు ‘సాక్షి’ ప్రారంభించిన ‘మైత్రి మహిళ’కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం మైత్రి మహిళ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టైలరింగ్ వర్క్‌షాప్ (కుట్టు శిక్షణ)నకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఉషా మిషన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌లో అధునాతన డిజైన్లతో టైలరింగ్‌లో రాణించేందుకు అవసరమైన మెళుకువలను నిపుణుల పర్యవేక్షణలో నేర్పించారు. ‘మైత్రి మహిళ’ ఎంతో మందికి ఉపయోగపడుతోందని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు సంతోషం వ్యక్తంచేశారు. ఈ శిక్షణ ద్వారా టైలరింగ్‌లో వస్తున్న ఆధునాతన డిజైన్లు, మార్పులను తెలుసుకోగలిగామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ‘సాక్షి’ మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా... వంటలు, స్వయం ఉపాధి, బోధన, వ్యాపార, ఆరోగ్య, న్యాయ సలహాల వంటి అంశాల్లో మహిళలకు శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనాలనుకునేవారు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు.