ఓ ఆత్మకథ...
మిస్టరీ
‘‘అబ్బ... ఎంత అందంగా ఉన్నావే. నాకే ముద్దొచ్చేస్తున్నావ్’’... సుగంధ బుగ్గలు పట్టి లాగింది మైత్రి.
‘‘ఛీ ఊరుకోవే’’ అంది సుగంధ స్నేహితురాలి చేతుల్ని తోసేస్తూ.
‘‘ఏం సిగ్గుపడుతున్నావే. మా దగ్గరే ఇలా ఉంటే, ఇక మీ ఆయన వచ్చాక ఎన్ని సిగ్గులొలకబోస్తావో’’ అంది మరో స్నేహితురాలు రాగిణి కన్నుగీటుతూ. నిజంగానే సిగ్గు ముంచుకు వచ్చింది సుగంధకి. రెండు చేతులతో ముఖాన్ని మూసుకుంది. ‘‘ఏడిపించింది చాలు వెళ్లండి’’ అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో.
‘‘వెళ్లిపోతాంలేవే. మీ ఆయన వచ్చే టైమయ్యిందని మాక్కూడా తెలుసులే’’ పకపకా నవ్వుతూ వెళ్లిపోయారందరూ.
గోడకున్న గడియారం వైపు చూసింది సుగంధ. తొమ్మిదీ పది అయ్యింది. ఇంకో పది నిమిషాల్లో భర్త వస్తాడు. ఓసారి గదంతా పరికించి చూసింది సుగంధ. అందంగా అలంకరించి ఉంది. మంచం నిండా పూలు పరిచి ఉన్నాయి. వాటి గుబాళింపులు గదంతా వ్యాపించాయి.
మంచం దిగి అద్దం దగ్గరకు వెళ్లింది సుగంధ. మైత్రి చెప్పింది నిజమే. తను ఈ దుస్తుల్లో ఎంతో అందంగా ఉంది. ఓసారి తన రూపాన్ని సాంతం చూసుకుంది. పక్కకు జరిగిన పాపిట బిళ్లను సరి చేసు కుంది. బొట్టు కాస్త పెద్దదైనట్టుగా అని పించడంతో తీసేసి చిన్న స్టిక్కర్ పెట్టు కుంది. తృప్తిగా నవ్వుకుని వెళ్లి మంచంపై కూర్చుంది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సుగంధ గబగబా దుపట్టాను ముఖం కనిపించకుండా తల మీదుగా కప్పుకుంది.
తలుపు మూసి వచ్చాడు విమలేష్. ‘‘సారీ... లేటయ్యింది. ఫ్రెండ్స్ వదిలి పెడితేగా. ఒకటే ఏడిపించారు’’ అన్నాడు సుగంధ పక్కనే కూర్చుంటూ.
‘‘ఫరవాలేదు’’... సుగంధ స్వరం మంద్రంగా పలికింది. ఆమెకు దగ్గరగా జరిగాడు విమలేష్. మెల్లగా దుపట్టాను పైకి లేపాడు. గడ్డం పుచ్చుకుని సుగంధ ముఖాన్ని పైకి లేపాడు.
అంతే... ఉలిక్కిపడి లేచాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు కంగారుగా.
‘‘అవును... నేనే’’ అంది సుగంధ. ఈసారి ఆమె స్వరం మంద్రంగా లేదు. మొరటుగా ఉంది. కంచు మోగినట్టుగా ఉంది. ఆ స్వరానికి గది దద్దరిల్లింది.
‘‘నువ్వు... నువ్వు..’’... మాట రావడం లేదు విమలేష్‌కి. నిలువెల్లా వణికిపోతున్నాడు. చెమటతో తడిసి ముద్దవుతున్నాడు. సుగంధ అతడివైపే చూస్తోంది. కోపంగా... కసిగా... అసహ్యంగా. ‘‘ఎందుకలా దూరంగా వెళ్లిపోతున్నావ్. రా... దగ్గరకు రా’’ అంది.
తల అడ్డంగా ఊపాడు విమలేష్. అక్కడ్నుంచి పారిపోవాలని ఉంది. కానీ కాళ్లు కదలడం లేదు. ఒళ్లంతా గడ్డకట్టేసి నట్టుగా అనిపిస్తోంది. కానీ కదలాలి. అక్కడ్నుంచి పారిపోవాలి. ఎలాగో శక్తిని కూడదీసుకున్నాడు. ఒక్క అంగలో గదిలోంచి బయటకు పరుగుదీశాడు.
ఇల్లంతా గోలగోలగా ఉంది. సుగంధ ఏడుస్తోంది. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. పెద్దలంతా విమలేష్‌ని నిలబెట్టి నిలదీస్తున్నారు. విమలేష్ మాట్లాడటం లేదు. భయంభయంగా సుగంధ వైపే చూస్తున్నాడు.
‘‘నేనంటే ఆయనకు ఇష్టం లేదను కుంటా. అందుకే నన్ను వదిలేసి బయటకు వచ్చేశారు. వద్దంటే చెప్పమనండి. వెళ్లిపోతాను’’ అంది సుగంధ ఏడుస్తూ.
‘‘చెప్పరా... అమ్మాయి అడుగుతోంది కదా! తనంటే ఇష్టం లేదా. మరెందుకు పెళ్లి చేసుకున్నావ్. ముందే చెప్పి చావొచ్చు కదా’’... అరుస్తున్నాడు విమలేష్ తండ్రి.
‘‘తను... తను సుగంధ కాదు నాన్నా. దెయ్యం. నన్ను చంపడానికి వచ్చింది. నన్ను కచ్చితంగా చంపేస్తుంది.’’
విమలేష్ మాటలకు విస్తుపోయా రంతా. బంగారు బొమ్మలాంటి పిల్లని పట్టుకుని దెయ్యమంటాడేంటి అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఏదో గాలి సోకినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అన్నారు తలపండిన వాళ్లు కొందరు.
‘‘నాకే గాలీ సోకలేదు. నేను చెప్పేది నిజం. అది సుగంధ కాదు. పుర్వి. నన్ను చంపడానికొచ్చింది. దాన్ని నేను మోసం చేశానని నా మీద పగబట్టింది. దెయ్యమై వచ్చింది నన్ను చంపడానికి. దాన్ని పంపెయ్యండి. వెంటనే పంపెయ్యండి.’’
పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాడు విమలేష్. అందరూ అతని మాటలకు అవాక్కయిపోయారు. పుర్వి ఎవరు? ఆమెను విమలేష్ మోసం చేయడమేంటి? ఆమె దెయ్యమై రావడమేంటి? ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ అయోమయంగా చూడసాగారు. అప్పుడు పెదవి విప్పింది సుగంధ.
‘‘మీ అందరి మనసుల్లో ఉన్న ప్రశ్నలు నాకు తెలుసు. వాటికి సమాధా నాలు నా దగ్గరున్నాయి’’ అంటూ చెప్పడం మొదలుపెట్టింది.
మూడు నెలల క్రితం ఓ మధ్యాహ్నం... తన గదిలో పడుకుని పుస్తకం చదువు కుంటోంది సుగంధ. అంతలో ఫోన్ మోగింది. స్క్రీన్ మీద నంబర్ చూడగానే సంతోషంగా లేచి కూర్చుంది. పుస్తకం పక్కన పడేసి, ఫోన్ చేతిలోకి తీసుకుంది.
‘‘ఏయ్ పుర్వీ.. ఎలా ఉన్నావే? ఎన్నాళ్లయ్యింది నీతో మాట్లాడి... ఏంటే విశేషాలు?’’.. ప్రశ్నల వర్షం కురిపించింది.
‘‘ఏం లేదు సుగంధా... నీతో మాట్లాడాలనిపించింది. అందుకే చేశాను.’’
పుర్వి గొంతు మెల్లగా ఉంది. ఏదో బాధ బరువును మోస్తున్నట్టుగా ఉంది. ‘‘ఏంటే? ఎందుకలా ఉన్నావ్? ఏమైంది?’’ ఆతృతగా అడిగింది సుగంధ.
అలా అడగడంతోనే బావురుమంది పుర్వి. వెక్కి వెక్కి ఏడవసాగింది. ‘‘నేను మోసపోయాను సుగంధా. దారుణంగా మోసపోయాను. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటే గుడ్డిగా నమ్మాను. ఎంతో దగ్గరైపోయాను. ఇప్పుడేమో తను నన్ను మానేసి వేరే అమ్మాయిని చేసు కుంటానంటున్నాడు. ఇంట్లోవాళ్లు ఒప్పు కోరు అంటూ వంకలు చెబుతున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నానే. ఈ ద్రోహాన్ని నేను భరించలేకపోతున్నాను.’’
మ్రాన్పడిపోయింది సుగంధ. ‘‘అతను చాలా మంచివాడన్నావ్ కదే. అలా ఎందుకు చేస్తున్నాడు?’’
‘‘మోసగాడు అలా కాకపోతే ఎలా చేస్తాడు సుగంధా. తప్పు నాదే. నేనే తనని నమ్మకుండా ఉండాల్సింది. నీకో విషయం తెలుసా? నేను తల్లిని కాబోతున్నాను. అందుకే పెళ్లి చేసుకొమ్మని అడిగాను. కుదరదన్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లి కుదిరి పోయిందట. మరో మూడు నెలల్లో పెళ్లి అట. చూశావా ఎంత మోసం చేశాడో? నా జీవితం ముగిసిపోయింది సుగంధా. ఇక నేను బతికి లాభం లేదు.’’
‘‘అయ్యో పుర్వీ... అలా అనకు. అలా ఏం జరగదు. నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. నువ్వు...’’
సుగంధ మాట పూర్తి కాకముందే ఫోన్ కట్ అయిపోయింది. గుండె జారి పోయింది సుగంధకి. పుర్వి చాలా బాధలో ఉంది. తొందరపడి ఏమీ చేసుకోదు కదా!
అలా అనుకోగానే మనసు రెపరెప లాడింది. వెంటనే పుర్వి దగ్గరకు వెళ్లాలి అనుకుంటూ మంచం దిగింది. అంతలో ఆమె తల్లి లోనికి వచ్చింది.
‘‘అమ్మా... నేను పుర్వి వాళ్లింటికి వెళ్తున్నాను’’ అంది సుగంధ హ్యాండ్‌బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ.
నిట్టూర్చింది తల్లి. ‘‘నేనూ వస్తాన్రా. పాపం పుర్వి.’’
అయోమయంగా చూసింది సుగంధ. ‘‘ఏంటమ్మా... ఎందుకలా అన్నావ్’’ అంది తల్లి ముఖంలోకి చూస్తూ.
‘‘నాకు విషయం తెలిసింది. నీ ఫ్రెండ్ రూప ఇప్పుడే చెప్పింది. నీ సెల్‌కి చేస్తే ఎంగేజ్ వస్తోందట. అందుకే ల్యాండ్‌లైన్‌కి చేసింది. పాపం పుర్వి ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకుందట కదా!’’
హడలిపోయింది సుగంధ.
ఏమంటోంది అమ్మ? పుర్వి ఆత్మహత్య చేసుకుందా? అది కూడా ఈ రోజు ఉదయమా? అదెలా? మరి ఇంతవరకూ తనతో మాట్లాడింది ఎవరు? పుర్వి కాదా? మాట్లాడింది తనే. కచ్చితంగా తనే. మరి పొద్దున్నే చనిపోవడమేంటి?
వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది సుగంధకి. జరిగినదాన్ని జీర్ణించుకోలేక ఉన్నచోటే కూలబడిపోయింది.
‘‘ప్రేమలో మోసపోయిన పుర్వి చని పోయింది. తన ప్రాణాలు తనే తీసుకుంది. కానీ తన మరణం వెనుక ఉన్న నిజం మరుగున పడిపోకూడదని అనుకుంది. అందుకే ఆ నిజాన్ని నాకు చేరవేసింది. ఆ రోజు నాకు ఫోన్ చేసింది... పుర్వి ఆత్మ.’’
వింటున్నవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఏం చెబుతోంది సుగంధ? ఆత్మా?
‘‘మీరు నమ్మరని నాకు తెలుసు. మొదట నేనూ నమ్మలేదు. కానీ నమ్మక తప్పని పరిస్థితి. ఆ రోజు మా అమ్మ, నేను పుర్వి వాళ్లింటికి వెళ్లాం. తను ఉరి వేసుకుని చనిపోయిందని తెలిసింది. పోస్ట్‌మార్టమ్ చేసిన డాక్టర్‌తో మాట్లాడితే తను గర్భవతి అని తేలింది. తర్వాత పుర్వి గదంతా వెతికాను. తన పుస్తకాల్లో ఒకచోట ఆమె ప్రియుడి ఫొటో దొరికింది. అది చూసి నేను షాక్ తిన్నాను. ఎందుకంటే ఆ ఫొటో ఎవరిదో కాదు... నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిది. ఆ వ్యక్తి ఎవరో కాదు... విమలేష్.’’
ఈసారి అదిరి పడ్డారంతా.
సుగంధ చెప్పే కఠోర వాస్తవాల్ని జీర్ణించుకోలేక పోయారు వాళ్లు. అయితే ఆమె చెప్పిన ప్రతి మాటా ముమ్మాటికీ నిజం. సుగంధ, పుర్వి డిగ్రీ వరకూ కలిసే చదువుకున్నారు. పీజీకి మాత్రం వేర్వేరు కాలేజీల్లో చేరారు. కానీ అన్ని విషయాలనూ ఫోన్‌కాల్స్ ద్వారా పంచుకునేవారు. అలానే తన ప్రేమ విషయం కూడా సుగంధకు చెప్పింది పుర్వి. అయితే ఆమె ఎవరిని ప్రేమించింది అన్నది మాత్రం సుగంధకు తెలియదు. దాంతో విమలేష్‌తో తనకు పెళ్లి కుదుర్చుతామంటే ఓకే చెప్పింది.
అయితే అంత తెలివిగా ఓ ఆడపిల్లను మోసం చేసినవాడు నిలదీసి అడిగితే నిజం చెప్పడు. అతడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు తన దగ్గర సాక్ష్యాలూ లేవు. అందుకే స్నేహితురాలికి న్యాయం చేయడం కోసం మౌనంగా అతణ్ని పెళ్లి చేసుకుంది సుగంధ. మొదటిరాత్రి పుర్విలా మాస్క్ వేసుకుని, ఆమెలా నటించి అతడితోనే నిజాన్ని చెప్పించింది. పుర్విని మోసగించి, ఆమె మరణానికి కారణమైన విమలేష్‌ని జైలుకు పంపించింది.
ఇది మధ్యప్రదేశ్‌లో జరిగిన వాస్తవ గాథ. మరి ఇది విన్నాక కూడా దెయ్యాలు, ఆత్మలు అంతా ట్రాష్ అనాలా? లేక వాటిని ఉనికిని అంగీకరించాలా?