దెయ్యాలు కట్టిన గుడి!..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..! | This Kakanmath Temple Was Supposedly Built By Ghosts Overnight! | Sakshi
Sakshi News home page

దెయ్యాలు కట్టిన గుడి కాకన్‌మఠ్‌ టెంపుల్‌ !..అక్కడ ప్రతి అంగుళం ఓ మిస్టరీ..!

Published Sun, Nov 19 2023 1:26 PM | Last Updated on Sun, Nov 19 2023 2:33 PM

This Kakanmath Temple Was Supposedly Built By Ghosts Overnight! - Sakshi

మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్‌ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడంటే భక్తి, దెయ్యమంటే భయం. పసివయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి.. ‘దండం పెట్టుకో..’ అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవ్వరూ! గొంతు బొంగురుగా చేసి.. ‘హో..’ అనే ఓ విచిత్రమైన శబ్దంతో ‘అదిగో వస్తుంది’ అనే ఓ అబద్ధంతో బెదరగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలుండవు.. అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. కాకన్‌మఠ్‌ టెంపుల్‌ మిస్టరీ కూడా అలాంటిదే.

మధ్యప్రదేశ్, మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్‌ నుంచి సుమారు 70 కి.మీ దూరంలో ఉన్న ఈ దేవాలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి, నిర్మించిన ఈ కట్టడం.. చూడటానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్‌ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైడింగ్‌ మెటీరియల్‌ (జిగట పదార్థం) వాడకుండా.. పెద్ద రాళ్లు, చిన్న రాళ్లను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్‌ ఏంటంటే.. రాత్రికి రాత్రే దెయ్యాలు, ప్రేతాత్మలు కలసి ఈ గుడిని నిర్మించాయని చెబుతుంటారు. అందుకే ఇక్కడికి వెళ్లే సందర్శకులంతా.. అదే భయంతో మెసులుకుంటారు.

దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం.. నేటికీ చెక్కుచెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు.. ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్‌లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి లేడు. వాచ్‌మన్‌ కూడా లేడు. కొందరు హోమ్‌ గార్డ్స్‌ మాత్రం.. ఈ గుడికి కాస్త దూరంగా.. రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూంటారు.

ఏదో అతీతమైన శక్తి.. ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుందనేది అక్కడివారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే.. ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని, అక్కడికి వెళ్లి చూసి.. ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయం అయిపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయిందని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలిజిస్ట్‌లు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తారు. చుట్టుపక్కల పరిశోధనలు చేస్తారు కానీ, ఈ ఆలయాన్ని మాత్రం టచ్‌ చేసే సాహసం చేయరు.

అయితే నేటికీ ఈ ఆలయం చుట్టూ.. ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్లు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడపడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తారు. అవన్నీ కొన్ని శత్రుమూకలు ఈ ఆలయంపై దాడి చేసి, కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని.. కిందున్న ఏ రాయిని కదిలించినా, గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒకరకమైన శబ్దం వస్తుందనే పుకార్లూ విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందంటూ తమకు తెలిసింది చెప్పి  భయాన్ని పుట్టిస్తూంటారు చాలామంది. నిజాన్ని నిరూపించే సాహసమైతే ఎవరూ చేయలేదు. దాంతో ఈ ఆలయనిర్మాణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
సంహిత నిమ్మన

(చదవండి: వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement