ప్రేతాల పార్క్ | takakanonuma greenland park in goasts! | Sakshi
Sakshi News home page

ప్రేతాల పార్క్

Published Sun, Sep 27 2015 1:08 AM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM

ప్రేతాల పార్క్ - Sakshi

ప్రేతాల పార్క్

మిస్టరీ
* సరదా కోసం వెళ్లారు.
* శవాలుగా మారారు.
* దెయ్యాలై సంచరిస్తున్నారు.
మే 1973, జపాన్‌లోని హొబారా...
‘టకకనోనుమా గ్రీన్‌ల్యాండ్ పార్క్’ అన్న బోర్డు కనిపించగానే హుషారొచ్చే సింది ‘షోమా’కి. ‘‘మమ్మీ... అటు చూడు, ఎంత బాగుందో’’ అంటూ గంతులు వేయసాగాడు. నవ్వలేక నవ్వింది అసాకా. ఎనిమిదేళ్ల పిల్లాడు షోమా.

నెల రోజుల క్రితం ఓపెన్ చేసిన ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ గురించి టీవీలో చూశాడు. అప్పటి నుంచీ ఒకటే గొడవ అక్కడికి తీసుకెళ్లమని. కానీ అసాకాకి ఇష్టం లేదు. ఎందుకంటే వారం రోజుల క్రితం అక్కడో ప్రమాదం జరిగింది. జారుడు బల్ల మీద నుంచి జారుతూ ఓ పిల్లాడు అదుపు తప్పి పక్కకి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి అక్కడి కక్కడే చనిపోయాడు.

ఆ సంఘటన గురించి వార్తల్లో చూసి హడలిపోయింది అసాకా. ‘తన కొడుక్కి కూడా అలాంటిదే మైనా అయితే’ అన్న ఆలోచనతో ఆమె తల్లి హృదయం తల్లడిల్లుతోంది. కానీ ఎంత చెప్పినా భర్త వినలేదు. పిల్లాడు సరదా పడుతున్నాడు కదా అంటూ తీసుకొచ్చాడు.
 ‘‘ఏంటి అసాకా నువ్వు. ఇంకా మూతి ముడుచుకునే ఉన్నావ్. వాడు చూడు ఎలా గంతులేస్తున్నాడో. వాడి కోసమే కదా వచ్చాం. నువ్విలా ఉంటే ఎలా?’’... డల్‌గా ఉన్న భార్యను చూసి అన్నాడు కైలానో.
 
‘‘నీకు అర్థం కాదులే నా బాధ. జరగరానిది ఏదైనా జరిగిందంటే?’’... కినుకగా అంది అసాకా.
 కైలానో నవ్వేశాడు. ‘‘నువ్వు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు అసాకా. ఎవరికో ఏదో జరిగిందని అందరికీ జరుగుతుందా ఏంటి!’’ అంటూ బాబుతో పాటు లోనికి నడిచాడు. మౌనంగా అనుసరించింది అసాకా. లోపలికి వెళ్లీ వెళ్లడంతోనే జెయింట్ వీల్ వైపు పరుగెత్తాడు షోమా. దాదాపు నలభై పెట్టెల వరకూ ఉన్న ఆ పెద్ద జెయింట్ వీల్‌ని చూసి ఎక్కడలేని సంతోషం వేసింది వాడికి. అది ఎక్కించమంటూ మారాం చేయడం మొదలుపెట్టాడు. అసాకా నచ్చజెప్పబోయింది కానీ వినలేదు. ఏడుపు అందుకున్నాడు. దాంతో వాడిని జెయింట్‌వీల్ ఎక్కించడానికి సిద్ధపడ్డాడు కైలానో.
 
‘‘వద్దు కైలానో. నా మాట విను. నాకెందుకో భయంగా ఉంది’’ అంది అసాకా కంగారుగా. ‘‘ఫర్వాలేదు డియర్. మనమూ వాడితో పాటు ఎక్కుదాం రా’’ అన్నాడు కైలానో. తల అడ్డంగా ఊపింది అసాకా.
 ‘‘సరే నేను వెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు’’ అంటూ పిల్లాణ్ని తీసుకుని జెయింట్ వీల్ దగ్గరకు వెళ్లాడు కైలానో. రెండు టికెట్లు తీసుకున్నాడు. బాబుతో సహా వెళ్లి ఓ తొట్టిలో ఎక్కి కూచున్నాడు.
 
దూరంగా నిలబడి చూస్తోంది అసాకా. ఎందుకో తెలీదు... ఆమె మనసు కీడు శంకిస్తోంది. గుండె దడదడా కొట్టుకుంటోంది. అంతలో జెయింట్‌వీల్ కదిలింది.
 ‘‘హే... మమ్మీ. మేమిప్పుడు ఎలా తిరుగుతామో చూడు. పైకి... పైపైకి వెళ్లిపోతాం’’ అంటూ అరిచాడు షోమో. కొడుకు సంతోషం చూసి ముచ్చటేసింది అసాకాకి.
 మెల్లగా తిరగడం మొదలైన జెయింట్ వీల్ కాసేపటికి వేగం పుంజుకుంది. గిరగిరా తిరుగుతోంది.  క్షణాలు గడిచాయి. నిమిషాలు గడిచాయి. ఇంకాసేపుంటే వేగం తగ్గేది. జెయింట్‌వీల్ ఆగేది. కానీ అంతలోనే ఓ పెద్ద అరుపు... ‘‘మమ్మీ’’ అంటూ.
 
ఉలిక్కిపడింది అసాకా. అది తన కొడుకు గొంతు. ఏమైంది?
 చప్పున తలెత్తి పైకి చూసింది. అంతే... ఆమె గుండె ఆగినంత పనయ్యింది. ఓ తొట్టి... చక్రం నుంచి విడిపోయింది. అంత ఎత్తునుంచి నేలమీద పడటానికి దూసుకొస్తోంది. క్షణాల్లో అది నేలను తాకింది. అందులో ఉన్న ఇద్దరూ ఎగిరి నేలమీద పడ్డారు. ఆ ఇద్దరూ... కైలానో, షోమో.
 పడీ పడటంతోనే షోమో తల నేలకు గుద్దుకుని బద్దలయ్యింది. ఆ చిన్నారి ఆయువు క్షణాల్లో తీరిపోయింది. కైలానో ఒంట్లో ఎముకలు ఫెళఫెళా విరిగి పోయాయి. చెవుల్లోంచి, ముక్కులోంచి రక్తం వస్తోంది. రెండు మూడు క్షణాల్లో అతని ప్రాణం కూడా అనంత వాయువుల్లో కలిసిపోయింది.
 
ఏం జరిగిందో ఒక్కక్షణం ఎవరికీ అర్థం కాలేదు. అసాకాకి అయితే అస్సలు అర్థం కాలేదు. కళ్లెదుటే తన భర్త, కొడుకు మృత్యులోయలోకి జారిపోయారన్న నిజాన్ని ఆమె నమ్మలేకపోతోంది. కొయ్యబారిపోయి చూస్తూండిపోయింది. ఇక ఆ తర్వాత ఆమెలో మళ్లీ చలనం కలగలేదు. ఎందుకంటే... ఆ షాక్‌ని తట్టుకోలేక ఆమె గుండె ఆగిపోయింది.
 
పోలీస్ టీమ్ వచ్చి ఎలా జరిగిందో ఇన్వెస్టిగేట్ చేసి, ప్రమాదం అని నిర్ధారించుకుంది. అంబులెన్సు వచ్చి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తీసుకుపోయింది. మీడియా వచ్చి ఆ ప్రమాదం తాలూకు వివరాలను రాసుకుని వెళ్లింది. అక్కడితో ఆ కథ ముగిసిపోయింది అని దేశమంతా అనుకుంది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. అది యావత్ దేశాన్నే కాదు, ప్రపంచాన్నే భయంతో వణికించింది. ఇంతకీ ఏం జరిగింది?
   
‘‘ఏంటిది మేనేజర్‌గారూ...  ఏం జరుగుతోందిక్కడ? మీ పార్కు తెరిచాక ఇది మూడో ప్రమాదం’’... కాస్త సీరియస్‌గానే అన్నాడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్.
 మేనేజర్ తత్తరపడ్డాడు. ‘‘సారీ సర్. ఇది నిజంగా దురదృష్టకరమే. మేము ఎంతో పకడ్బందీగా అన్నీ ప్లాన్ చేసి ఈ పార్కుని ఏర్పాటు చేశాం. అన్నీ అధునాతన యంత్రాలే. అయినా ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు’’ అన్నాడు బుర్ర గోక్కుంటూ.
 ‘‘మీరేం చేశారో, ఏం చేస్తున్నారో మాకు తెలీదు.

ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారో చెప్పండి. మీ పార్క్ తెరచిన మూడు వారాలకే చిన్నపిల్లాడి మరణం సంభవించింది. అనుకోకుండా జరిగిన సంఘటన అనుకున్నాం. జెయింట్ వీల్ ప్రమాదం కారణంగా ఒకే కుటుంబంలోని ముగ్గురూ మృత్యువాత పడ్డారు. ప్రమాదంలే అనుకుని ఊరుకున్నాం. ఇవాళ స్విమ్మిగ్‌పూల్‌లో పడి పాప చనిపోయింది. ఇప్పుడేం అనుకోమంటారు?’’
 
కంగారు పడిపోయాడు మేనేజర్. ‘‘అలా అనకండి సర్. మేం కావాలని ఎవరి ప్రాణాలూ తీయం కదా! మా ఖర్మకొద్దీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంకోసారి ఇలా జరక్కుండా చూసుకుంటాం. మమ్మల్ని నమ్మండి ప్లీజ్’’ అంటూ కాళ్లా వేళ్లా పడ్డాడు.
 దాంతో మరోసారి అది యాక్సిడెంట్ అని రాసుకుని వెళ్లిపోయారు పోలీసులు. అదే వాళ్లు చేసిన తప్పు. ఎందుకంటే మేనేజర్ చెప్పినట్టుగా ప్రమాదాలు ఆగలేదు. ఏదో ఒకటి ముంచుకొస్తూనే ఉంది. ఆ పార్క్‌లో మృత్యుదేవత వీరవిహారం చేయడం మొదలుపెట్టింది.
 
ఓరోజు వేగంగా తిరుగుతున్న రోలర్ కోస్టర్ పట్టాలు తప్పి పడిపోయింది. దాంతో ఇద్దరు చనిపోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకో రోజు స్వింగ్ రైడ్ చేస్తున్నప్పుడు తాడు తెగి ఓ అమ్మాయి కింద పడింది. తలకు బలమైన గాయం తగిలి బ్రెయిన్ డెడ్ అయ్యింది. మరోరోజు ఫుడ్ కోర్టులో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలామంది అస్వస్థులయ్యారు. తర్వాత ఇంకోరోజు ఏకంగా ఫుడ్ కోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. ముగ్గురు చనిపోయారు.
 
ఇలా ఒకటీ రెండూ కాదు... వరుసగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దాంతో యాజమాన్యం ఆలోచనలో పడింది. కొన్నాళ్లపాటు పార్కుని మూసేసి ప్రతి యంత్రాన్నీ పరీక్షించింది. ప్రతి నిర్మాణ నాణ్యతనీ పరిశీలించింది. అణువణువూ చెక్ చేసి, ఏ సమస్యా లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్లీ పార్కును తెరిచింది. కానీ ఫలితం లేదు. మళ్లీ అక్కడ మృత్యుఘోష మొదలయ్యింది.
 
అస్తమానం ఏదో ఒక ప్రమాదం. అడుగడుగునా భయం. కొందరు చని పోయారు. ఇంకొందరు గాయపడ్డారు. దుష్టశక్తులు ఉన్నాయని, అవే అందరినీ కబళిస్తున్నాయని కొందరన్నారు. అక్కడ చనిపోయినవాళ్ల ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని, తమకు కనిపిస్తున్నా యని, ఏవేవో అరుపులు, కేకలు వినిపిస్తు న్నాయని చెప్పారు. ఓ చిన్న పిల్ల ఆత్మ అయితే అందర్నీ భయపెట్టసాగింది. దాంతో కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఆ పార్‌‌క, సందర్శకుల్లేక వెలవెల బోయింది. అన్ని ఆధునిక హంగులూ, అలరించే అంశాలూ ఉన్నా... దెయ్యాల భయంతో నిర్మానుష్యమైపోయింది. చివరికి శాశ్వతంగా మూతబడింది. కాల క్రమంలో శిథిలావస్థకూ చేరుకుంది.
 
అయితే ఆ పార్క్ వల్ల ఏర్పడిన భయం మాత్రం అలానే ఉండిపోయింది. అందుకే ఆ ప్రదేశాన్ని అమ్ముదామని ఎంత ప్రయత్నించినా కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయినా ఎవరొస్తారు... దెయ్యమనే భయం మనసులో అంతగా నాటుకుపోయాక?!
 
టకకనోనుమా గ్రీన్‌ల్యాండ్ పార్క్‌లో దెయ్యాలున్నాయన్నది కేవలం అపోహ అని, చాలామంది చనిపోవడం వల్ల అందరికీ ఆ భయం పట్టుకుందని పార్క్ యాజమాన్యం, ఆ ప్రాంత అధికారులు ఎంతగానో చెప్పారు. అయితే జనం మాత్రం దాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఎందు కంటే అక్కడ దెయ్యాలను చూశామని చాలామంది బల్ల గుద్ది చెబుతున్నారు. ఎడ్వర్డ్స్ అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ సైతం అదే అంటున్నాడు.

ఓసారి అతను నిర్మానుష్యంగా ఉన్న పార్కును ఫొటోలు తీశాడు. తర్వాత వాటిని చూసి అవాక్కయ్యాడు. ఎందుకంటే ప్రవేశద్వారం దగ్గర తీసిన ఒక ఫొటోలో ఓ చిన్నపిల్ల ఉంది. ఆమె ముఖం విచిత్రంగాను, వికృతంగాను ఉంది. కాళ్లు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఆమె కచ్చితంగా దెయ్యమే అన్నాడు ఎడ్వర్డ్స్. ఎవరూ కాదని అనలేక పోయారు. ఎదురుగా అంత పెద్ద సాక్ష్యం కనబడుతుంటే ఎలా కాదనగలరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement