వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని ఘాతుకం
దాడి చేసి చంపేసిన ప్రియుడు, అతని స్నేహితులు
ఆమదాలవలస: మండలంలోని బొబ్బిలిపేట సమీపంలో గత నెల 25వ తేదీ రాత్రి జరిగిన గురుగుబిల్లి చంద్రయ్య హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసులో రాజకీయ కోణం లేదని, కేవలం వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని, ఇందులో ప్రమేయమున్న 10 మందిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకనంద తెలిపారు. ఈ మేరకు ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గరుగుబల్లి చంద్రయ్య భార్య ఈశ్వరమ్మకు అదే గ్రామానికి చెందిన చింతాడ బాలమురళీకృష్ణకు కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. విషయం తెలుసుకున్న భర్త చంద్రయ్య భార్యను మందలించి సెల్‌ఫోన్ వాడకుండా కట్టుదిట్టం చేయడంతో పాటు బాలమురళీకృష్ణతో ఉన్న ఆర్థిక లావాదేవీలను కూడా నిలుపుదల చేశాడు.
దీంతో కక్షపెంచుకున్న బాలమురళీకృష్ణ చంద్రయ్యకు తెలియకుండా మరొక ఫోన్‌తో ఈశ్వరమ్మతో రహస్య సంభాషణలు సాగించేవాడు. ఈ క్రమంలో తమకు అడ్డంగా ఉన్న చంద్రయ్యను చంపాలనే ఉద్దేశంతో తన సోదరుడు, శ్రీనివాసచార్యులపేటకు చెందిన గురుగుబిల్లి అరవింద్ సాయం తీసుకున్నాడు. అతను తన స్నేహితులైన బూర్జ మండలం ఉప్పినవలసకు చెందిన వంశీ, గణేష్‌లను కూడా రంగంలోకి దించాడు. వీరంతా కలిసి చంద్రయ్యను హతమార్చడానికి బొబ్బిలిపేట సమీపంలో చెరువు వద్ద రెండు రోజులు మాటువేసినా ఫలితం లేకపోయింది. ఈ 25న చంద్రయ్య ఇంటి వద్ద బయలుదేరిన వెంటనే భార్య ఈశ్వరమ్మ చెరువు వద్ద ఎదురుచూస్తున్న బాలమురళీకృష్ణకు ఫోన్ చేసి చెప్పింది. స్కూటీపై వస్తున్న చంద్రయ్యను వీరంతా అడ్డగించి బీరు సీసాలు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చారు.
మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులోకి ఈడ్చుకెళ్లి తుప్పల చాటున పడేశారు. అదే రోజు రాత్రి భార్య ఈశ్వరమ్మ ముందుగా భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మళ్లీ అర్ధరాత్రి సమయంలో తన భర్త శవంగా పొలాల్లో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ, ఎస్‌ఐ ఎస్.బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణలో బొబ్బిలిపేటకు చెందిన చింతాడ బాలమురళీకృష్ణ ప్రథమ నేరస్తుడుగా, ఉప్పినవలసకు చెందిన గొల్లపల్లి వంశీ, సవలాపురం గణేష్, బొబ్బిలిపేటకు చెదిన చంద్రయ్య భార్య జి.ఈశ్వరమ్మలను తదుపరి నేరస్తులుగా, సవలాపురం ప్రవీణ్, బొమ్మాలి శ్రీవర్థన్(శివ), బొమ్మాలి ఉమామహేష్, ఈసర్లపేటకు చెందిన యర్లంకి కృష్ణ, శ్రీనివాసాచార్యులపేటకు చెందిన గురుగుబెల్లి అరవింద్‌లతో పాటు మరో మైనర్‌కు కూడా నేరంలో ప్రమేయమున్నట్లు గుర్తించారు. వీరందరినీ అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేసిన తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, డీఎస్పీ వివేకానంద అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment