సాక్షి, హైదరాబాద్: ఆదిభట్ల ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హతుడు బతికుండగానే నోటికి ప్లాస్టర్ వేసి, కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బలవంతంగా గోనె సంచిలో కుక్కారని, గాలి కూడా చొరబడకుండా మూట గట్టిగా కట్టేయడంతో లోపల ఊపిరాడక మరణించి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈనెల 16న బొంగుళూరు టోల్‌గేట్ నుంచి 1.5 కి.మీల దూరంలో బ్రాహ్మణపల్లి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.
తెలిసిన వాళ్ల పనే..
హత్య అనంతరం మృతదేహాన్ని ఎక్కడ పారేయాలో కూడా దుండగులు ముందుగానే ప్లాన్ చేశారని, ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవుల్లో జాతీయ రహదారులలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎవరూ గుర్తించలేరని నిందితులు భావించి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. హతుడికి తెలిసిన వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై సంచిలో మూటకట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చి ఓఆర్‌ఆర్ సరీ్వస్ రోడ్డులో పడేసి ఉంటారని వివరించారు. అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి వాహన టైర్ల గుర్తులు లభించలేదని, రోడ్డు పైన ఎర్రటి మరకలు ఉండడంతో రక్తం కావచ్చని అనుమానించి..నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పారు.
సాంకేతిక ఆధారాలతోనే ముందుకు..
హతుడి ఎవరనేది తేలితేనే కేసు దర్యాప్తు సులువవుతుందని భావించిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వందలాది అదృశ్యం కేసుల వివరాలను సేకరించారు. ఘటనాస్థలంలో మృతదేహంపై లభ్యమైన వస్తువులు, హతుడి వయసు, పోలికలతో యువకుల అదృశ్యం కేసుల వివరాలను పోలుస్తున్నారు. ఘటనాస్థలం, పరిసర ప్రాంతాలలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో పాటు మృతదేహంపై ఎలాంటి కత్తిపోట్లు, గాయాలను పోలీసులు గుర్తించలేదు. శరీరంలో విష ప్రయోగం ఆనవాళ్లు సైతం ఫోరెన్సిక్ పరీక్షలలో వెల్లడికాలేదు. దీంతో కేసు దర్యాప్తు పూర్తిగా సాంకేతిక ఆధారాల పైనే ఆధారపడి ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిని బట్టి హత్య ఈనెల 8–10 తేదీలలో జరిగి ఉండొచ్చని, దీంతో ఆయా తేదీలలో ఓఆర్‌ఆర్ మీద ప్రయాణించిన సుమారు 12 లక్షల వాహనాలను, లక్షల కొద్ది ఫోన్ కాల్స్‌ను జల్లెడ పడుతున్నామని తెలిపారు. లక్షల్లో ఉన్న డేటా వందల్లోకి వస్తేనే దర్యాప్తు కొలిక్కి వస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment