పాత పరిచయమే ప్రాణం తీసింది
- పథకం ప్రకారమే స్వర్ణలత హత్య
- పోలీసుల అదుపులో ముగ్గురు
- వీడిన హత్య కేసు మిస్టరీ
మచిలీపట్నం క్రైం : స్వర్ణలత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకూ ఛేదించారు. పరిచయం ఉన్న వ్యక్తే పథకం ప్రకారం ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేల్చారు. స్వర్ణలతను అంతమొందించడంలో ఆ వ్యక్తితో పాటు మరో ఇరువురు పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఇప్పటికే హంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరిచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే గతంలో నేరచరిత కలిగిన ఓ పాత నేరస్థుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టగా అతనికి ఒక కారు డ్రైవర్‌తో పాటు మరో ఆటో డ్రైవర్ సహకరించినట్లు సమాచారం. విశాఖపట్నంకు చెందిన కడియాల స్వర్ణలత వేసవి సెలవులను పురస్కరించుకుని తన భర్త, కుమారుడితో కలిసి గత నెల మచిలీపట్నంలోని పుట్టింటికి వచ్చింది. కొన్ని రోజుల అనంతరం భర్త తిరిగి విశాఖపట్నం వెళ్లిపోగా స్వర్ణలత ఆమె కుమారుడు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన స్నేహితురాలిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె చీకటిపడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఖంగారుపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మరుసటి రోజు బందరు మండలంలోని భోగిరెడ్డిపల్లి ఐదో నంబరు పంట కాలువ గట్టుపై గుర్తు తెలియని ఓ మహిళ హత్యకు గురైనట్లు రూరల్ పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు ఆరా తీయగా హత్యకు గురైంది స్వర్ణలతేనని తేలింది. దీంతో స్వర్ణలత హత్యపై రూరల్‌పోలీసులు కేసు నమోదు చేశారు.
పథకం ప్రకారమే హత్య...
స్వర్ణలత హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆమెను హత్య చేసింది పరిచయం ఉన్న వ్యక్తేనని తేలింది. గతంలో స్వర్ణలత తల్లిదండ్రులు ఇంగ్లీషుపాలెంలో ఉండేవారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఓ (బైక్ దొంగ) యువకుడు ఆమెతో చనువుగా ఉండేవాడు. అయితే పరిచయం అయిన వ్యక్తి బైక్‌లను అపహరిస్తాడని తెలియడంతో స్వర్ణలత అతన్ని దూరంగా పెట్టింది. స్వర్ణలతకు వివాహమయిన అనంతరం వారి మధ్య ఉన్న పరిచయం శాశ్వితంగా తెగిపోయింది.
కాగా వేసవిసెలవులకు ఇటీవల స్వర్ణలత పుట్టింటికి రాగా వారివురూ మరలా కలుసుకున్నారు. దీంతో సదరు బైక్ దొంగ ఏకాంత వాతావరణంలో కలుసుకుందామంటూ ఆమెకు మాయమాటలు చెప్పి మొహమాటపెట్టాడు. దీంతో స్వర్ణలత బయటకు వెళ్లేందుకు అంగీకరించింది. వెంటనే సుకర్లాబాద్‌కు చెందిన మరో కారుడ్రైవర్‌ను కలిసి తనకు ఓ యువతి పరిచయమయిందని ఆమెను బయటకు తీసుకెళ్లి అంతమొందిస్తే పెద్ద మొత్తంలో బంగారం చేతికి వస్తుందని చెప్పాడు.
అందులో వాటా ఇస్తానని నమ్మకంగా చెప్పాడు. దీంతో సదరు కారుడ్రైవర్ సైతం ఆమెను హత్య చేసేందుకు అంగీకరించాడు. ఈ పథకంలో వీరద్దరితో పాటు మరో ఆటో డ్రైవర్ కూడా కలిశాడు. అలా పథకం వేసుకున్న వారు అదే రోజు రాత్రి స్వర్ణలతను ఆటోలో ఎక్కించుకుని చల్లపల్లి రోడ్డులోకి తీసుకెళ్లారు. స్వర్ణలతను హత్య చేయాలనుకున్న వారు ముగ్గురు కోనేరుసెంటర్‌లోని బంగారు దుకాణాల్లో పొటాష్ కొనేందుకు ప్రయత్నించారు. అయితే దుకాణ యజమానులు ఎవరూ పొటాష్‌ను విక్రయించకపోవటంతో పురుగుల మందు సీసాను వెంట తీసుకెళ్లారు.
మార్గమధ్యంలో కూల్‌డ్రింక్ సీసాలో పురుగుల మందు కలిపారు. చల్లపల్లి రోడ్డులో కొంత దూరం వెళ్లాక నమ్మకంగా ఆమెతో తాగించారు. అనంతరం చల్లపల్లి రోడ్డు నుంచి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ కారు డ్రైవర్ స్వర్ణలత పట్ల అసభ్యంగా వ్యవహరించి తన కోర్కె తీర్చమని బలవంతం చేశాడు. అందుకు ఆమె ప్రతిఘటించటంతో మెను తీసుకెళ్లిన యువకుడు, ఆటో డ్రైవర్ కలిసి స్వర్ణలత మెడకు కండువా చుట్టి బలవంతంగా నులిమారు.
దీంతో స్వర్ణలత సృహ కోల్పోగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా ఒలుచుకున్నారు. అనంతరం వెంట తీసుకెళ్లిన పురుగుల మందును బలవంతంగా గొంతులో పోశారు. అదీ చాలదన్నట్టు ఆఖరి ప్రయత్నంగా ఆటోలో ఉన్న స్టెఫినీతో ఆమె తలపై బలమైన దెబ్బలు కొట్టారు. దీంతో స్వర్ణలత ప్రాణాలు విడిచింది. స్వర్ణలత ప్రాణాలు విడిచిందని నిర్ధారణకు వచ్చిన ఆ ముగ్గురు ఆటోలో తిరిగి భాస్కరపురం చేరుకుని ఆమె కుమారుడిని రోడ్డుపై వదిలి అక్కడి నుంచి ఉడాయించారు.
పోలీసుల అదుపులో హంతకులు...
స్వర్ణలత హత్యలో ప్రధాన పాత్ర పోషిం చిన పాత నేరస్ధుడుని ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని లకడీకాపూల్ సమీపంలో అదుపులోకి తీసుకోగా మిగిలిన కారు, ఆటో డ్రైవర్‌లను మరుసటి రోజు మచిలీపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణలతను హత్య చేసి బంగారంతో ఉడాయించిన సదరు యువకుడు ఆ నగలు అమ్మిన డబ్బులతో కొత్త ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి దానిపై వైఫ్‌గిఫ్ట్ అని స్టిక్కరింగ్ చేయించుకుని హైదరాబాద్‌లో తిరుగుతుండగా రూరల్ ఎస్సై ఈశ్వర్ ఇతర సిబ్బంది పట్టుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడిపై మచిలీపట్నంతో పాటు భీమవరం ప్రాంతాల్లో సైతం పలు కేసులున్నట్లు తెలుస్తోంది.