గొలుసు కోసమే స్వర్ణలత హత్య!
- పరియస్తుడే ప్రాణం తీశాడు
- ముగ్గురు నిందితుల అరెస్టు
- విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడి
మచిలీపట్నం క్రైం : సంచలనం కలిగించిన స్వర్ణలత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. స్వర్ణలతతో పరిచయం ఉన్న వ్యక్తే పథకం ప్రకారం ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్వర్ణలతను అంతమొందించటంలో పరిచయం ఉన్న వ్యక్తితో పాటు మరో ఇరువురు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ డాక్టర్ కె.వి. శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించి సంఘటన వివరాలు వెల్లడించారు.
మచిలీపట్నంకు చెందిన మరకా శ్రీను, ముచ్చు శ్రీను, కుంభా శ్రీను స్నేహితులు. మొదటి నుంచి వ్యసనాలకు బానిసైన మరకా శ్రీను గతంలో పలు బైక్ దొంగతనాలకు పాల్పడగా అతనిపై మచిలీపట్నంతో పాటు విజయవాడ, ఏలూరుల్లోని పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముచ్చు శ్రీను ఆటో డ్రైవర్ కాగా, కుంభా శ్రీను కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే గతంలో మరకా శ్రీనుకి పట్టణానికి చెందిన కడియాల స్వర్ణలతకు పరిచయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఇటీవల వేసవి సెలవులకు పుట్టింటికి వచ్చిన స్వర్ణలతను గతంలో ఉన్న పరిచయంతోశ్రీను మాయమాటలు చెప్పి బయటికి వెళదామని కోరాడు. దీంతో స్వర్ణలత అతనితో కలిసి బయటికి వెళ్లేందుకు ఒప్పుకుంది. శ్రీను అతని స్నేహితులైన ముచ్చు శ్రీను, కుంభా శ్రీనును కలిసి తనకు ఓ మహిళ పరిచయమైనట్లు చెప్పి ఆమెను నమ్మకంగా తీసుకెళ్లి అంతమొందిస్తే పెద్ద మొత్తంలో బంగారం చేతికి వస్తుందని, వచ్చే బంగారాన్ని పంచుకుని దర్జాగా బతకొచ్చని చెప్పడంతో స్వర్ణలతను హత్య చేసేందుకు వారివురు అంగీకరించారు.
ఈ నెల 10 వతేదీన శ్రీను స్వర్ణలతకు ఫోన్ చేసి బయటికి రమ్మని కోరాడు. బయటకు వచ్చిన స్వర్ణలతను ముచ్చు శ్రీను, అతని స్నేహితులు ఆటోలో ఎక్కించుకుని బందరు మండల పరిధిలోని చిన్నాపురం మీదుగా భోగిరెడ్డిపల్లి ఐదో నంబరు పంట కాలువ సమీపానికి తీసుకెళ్లారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీను, మరకా శ్రీను తువ్వాలును ఆమె మెడకు చుట్టి ఊపిరి ఆడకుండా చేశారు.
అలాగే ముందుగా పథకం వేసుకున్న వారు పురుగుమందు బాటిల్‌ను వెంట తీసుకెళ్లి ఆమె గొంతులో బలవంతంగా పోశారు. అయినప్పటికీ స్వర్ణలత చనిపోయిందో లేదోననే అనుమానంతో ఆటోలోని స్టెఫినీ టైరుతో ఆమె తలపై బలంగా కొట్టి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని అక్కడి నుంచి ఆటోలో తిరిగి స్వర్ణలత ఇంటి సమీపానికి చేరుకుని ఆమె మూడేళ్ల కుమారుడిని ఇంటికి సమీప ప్రాంతంలో వదిలేసి ఉడాయించారు.
ఈ సంఘటనపై భోగిరెడ్డిపల్లి వీఆర్‌వో ఈ నెల 11వ తేదీన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు స్వర్ణలతను హత్య చేసింది పై ముగ్గురేనని తేలడంతో గురువారం మధ్యాహ్నం బందరులోని మూడుస్తంభాల సెంటర్లో రూరల్ సీఐ ఎస్ వీ వీ ఎస్ మూర్తి, ఎస్సై ఈశ్వర్, స్టేషన్ సిబ్బంది వారిని అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి అపహరించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఆటోతో పాటు వారు ఉపయోగించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్టు చేసిన ముగ్గురిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. హత్యకేసును ఛేదించండంలో కృషి చేసిన సీఐ మూర్తి, ఎస్సై ఈశ్వర్‌లతో పాటు స్టేషన్ సిబ్బందిని ఆయన అభినందించారు. రూరల్ సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి, టౌన్ సీఐ బీవి సుబ్బారావు, రూరల్, మచిలీపట్నం ఎస్సైలు ఈశ్వర్‌కుమార్, శ్రీహరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.