ప్రొద్దుటూరు క్రైం : సుమారు ఐదేళ్ల క్రితం ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్ వరుస హత్యలతో అట్టుడుకి పోయింది. కేవలం ఆరు నెలలలోపే ఐదుగురు మహిళలు హత్యకు గురయ్యారు. అయితే వాటిలో రెండు కేసులను పోలీసులు అప్పట్లో ఛేదించారు. మిగిలిన మూడు కేసుల్లో మాత్రం ఐదేళ్ల నుంచి చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు. కేసుల దర్యాప్తు కోసం అప్పట్లో ప్రత్యేక అధికారిని నియమించినా ఫలితం లేకుండా పోయింది. అనేక దఫాలుగా దర్యాప్తు చేసినా కేసుల్లో పురోగతి కనిపించలేదు.
ఒకానొక దశలో ఈ కేసులను మూస్తేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తమ వారిని ఎందుకు చంపారో అర్థం కాక మృతుల కుటుంబ సభ్యులు బాధ పడేవారు. మహిళలు చనిపోయారనే బాధ కన్నా ఎవరు హత్య చేశారు..ఎందుకు చంపాల్సి వచ్చిందనే మానసిక క్షోభే వారిలో ఎక్కువగా కనిపించేది. ఈ క్రమంలో ఇటీవల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసుకు సంబం«ధించి ఒక నిందితుడు దొరకడంతో శ్రీరాంనగర్ హత్యల మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది.
హత్యకు గురైన మహిళలు ..
ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్‌లో 2013 ఫిబ్రవరి నుంచి మహిళల హత్యలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న భీమునిపల్లె లక్ష్మీదేవి హత్యకు గురైంది. గాజుల వ్యాపారం చేస్తున్న ఆమె 25న ఇంటి నుంచి వెళ్లిపోగా 26న ఎర్రగుంట్ల మండలంలోని గోపులాపురం వద్ద శవమై కనిపించింది. నిందితులు ఆమె మృతదేహాన్ని కాల్చారు. ఈ హత్య జరిగిన రెండు నెలల్లోపే ఏప్రిల్ 29న శ్రీరాంనగర్‌లోని చౌడమ్మవీధిలో నివాసం ఉంటున్న మేరువ శారదను హత్య చేశారు. ఆమె భర్త వాసుదేవరావు వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేయగా, ఆమె ఇంటి దగ్గరే రేషన్ పని చేస్తుంటుంది.
29న భర్త దుకాణం నుంచి ఇంటికి రాగా భార్య ఇంట్లో కనిపించలేదు. వీధిలోనూ, బంధువుల ఊళ్లలోను ఆమె కోసం గాలించగా జాడ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు అదే నెల 30న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అదే రోజు ముద్దనూరు మండలంలోని కమ్మవారిపల్లె గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఆమె మృతదేహాన్ని పడేశారు. అదే ఏడాది జూన్ 3న శ్రీరాంనగర్‌లో గొంటుముక్కల రంగమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. దుండగులు హత్య చేసి ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి మురికి కాలువలో పడేశారు.
వీడిన మర్డర్స్ మిస్టరీ..?
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు కడప పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా వీరు డబ్బు, నగల కోసం అనేక మంది మహిళలను హత్య చేసినట్లు తెలిసింది. విచారణలో భాగంగా నిందితులను శనివారం శ్రీరాంనగర్‌కు తీసుకొని వచ్చారు. హత్యకు గురైన ప్రాంతాలు, వారి ఇళ్ల వద్దకు నిందితులను తీసుకొని వెళ్లినట్లు సమాచారం. నాలుగైదు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment