జీ.. హుజూర్ | Public money, maps, save lives, is in contrast to the guards on duty | Sakshi
Sakshi News home page

జీ.. హుజూర్

Published Mon, Sep 8 2014 1:50 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

జీ.. హుజూర్ - Sakshi

జీ.. హుజూర్

సాక్షి ప్రతినిధి, కడప: ప్రజల ధన,మాన, ప్రాణాలను కాపాడాల్సిన రక్షకులు విధి నిర్వహణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కాసులుంటే ఎలాంటి కేసులైనా డీల్ చేస్తామంటున్నారు. అధికార పార్టీ నేతలకు అండగా ఉంటూ వారి ఆదే శాలను తు.చ. తప్పక పాటిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రైల్వేకోడూరు సర్కిల్ పరిధిలోని ఆ రెండు కేసులు.
 
 రైల్వేకోడూరు పరిధిలోని కొంతమంది పోలీసు అధికారులు ఒన్‌వేలో పయనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నా నియంత్రించాల్సిన ఉన్నతాధికారులు సైతం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటున్నారు. దీంతో బాధితులకు అన్యాయం జరుగుతోంది. ఎర్రచందనం కేసుల్లో అధికార పార్టీ మెప్పు కోసం ఓవిధంగా ట్రీట్‌మెంట్ ఇస్తే, హత్య కేసుల్లో కాసుల కోసం కేసుల్ని తారుమారు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 దర్యాప్తులో వింత వైఖరి....
  రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు పరిధిలో హైమావతి అనే అంగన్‌వాడీ టీచర్ జూలై 29న మృతి చెందింది. అత్తింటి వారు హత్య చేసి అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారనే ఆరోపణలున్నాయి. దర్యాప్తులో నిగ్గుతేల్చి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు అత్తింటివారికే వత్తాసు పలుకుతున్నారు. తమ కూతుర్ని భర్త అత్తమామలు కొట్టి చంపారని ైెహ మావతి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదును తోసిపుచ్చారు. హైమావతి రైలు కింద పడి చనిపోయిందని భర్త చెప్పినట్లుగానే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేశారు.
 
 వివాహం అయిన 7ఏళ్ల లోపు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే రెవెన్యూ అధికారుల సమక్షంలో శవపంచనామా చేయాల్సి ఉంది. ఆ నిబంధన పరిగణలోకి తీసుకున్న పోలీసు అధికారులు ఆమె రైలు కింద పడి మృతి చెందినట్లు రిపోర్టు తయారు చేశారు. రైలు కింద పడ్డ మహిళ మృతదేహం ఇంటి వద్ద ఎలా ఉందంటే అందుకో కట్టుకథను అల్లారు. ఓ మహిళ కిలోమీటరు దూరంలో ఉన్న రైల్వేట్రాక్‌పై పడితే గ్రామం మొత్తం అక్కడికెళ్లి వాలిపోతుంది. రైలు కింద పడ్డ మృతదేహంలోని శరీర భాగాలు నుజ్జునుజ్జు అయ్యే అవకాశం ఉంది. రైల్వే ట్రాక్ నుంచి మృతదేహాన్ని ఇంటికి తెచ్చే విషయాన్ని ఊరంతా గమనిస్తారు. కానీ మన అధికారులకు అవేవీ గుర్తుకు రాలేదు. శవపంచనామాలో కూడ పొందుపర్చరు.

అందుకు కారణం అధికారపార్టీ పైరవీలు, కాసుల వర్షం అని పలువురు పేర్కొంటున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో వళ్లుంతా వాపుడు గాయాలు, తల కుడివైపు కణత వద్ద గాయం, ఎడమ తొడమీద 15సెంటీమీటర్ల గాయం ఉన్నట్లు రికార్డు అయింది. వాటిని పరిశీలిస్తేనే విపరీతంగా కొట్టి చంపారని, కణతకు గాయం కావడంతోనే మృతి చెందిందని అంచనాకు రావచ్చు. అనేక కేసుల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులకు మాత్రం అలాంటి అనుమానం రాలేదు. కాగా భర్త కాళ్లు చేతులతో కొడితే హైమావతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. అందులో భాగంగా ఐపీసీ 304 బి సెక్షన్ కింద హైమావతి భర్తను మాత్రమే అరెస్టు చేసి, చేతులు దులుపుకున్నారు.
 
 ఎర్రచందనం కూలీ హత్యలోనూ....
 రైల్వేకోడూరుకు చెందిన ఎర్రచందనం కూలీ చాకలి వెంకటేసు ఫిబ్రవరి 8న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ స్మగ్లరు వద్దకు వెళ్లి 70 అడుగుల లోతుగల నీరు లేని బావిలో మృతదేహంగా కన్పించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత ప్రమాద వశాత్తు మృతి చెందాడనే అంచనాకు వచ్చారు. అందుకు కారణం వెంకటేసును కూలీగా తీసుకెళ్లిన స్మగ్లర్ల నుంచి ఉన్న ఒత్తిడేనని తెలుస్తోంది.
 
  వాస్తవానికి వెంకటేసు మృతి చెందగానే స్మగ్లర్‌పై కుటుంబ సభ్యులు ఒత్తిడి తేవడంతో ఎలాంటి కేసులు వద్దని రూ.2లక్షలకు పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ చేసిన వారిలో ఓ పోలీసు కానిస్టేబుల్, మరో హోంగార్డు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ స్మగ్లర్ రూ.50 వేలు మాత్రమే వెంకటేసు కుటుంబానికి చెల్లించి మిగిలిన మొత్తం పోలీసు బాస్‌లకు చెల్లించినట్లు తెలుస్తోంది. దాంతో కేసు దర్యాప్తులో పురోగతి లేకుండా పోయిందని సమాచారం.
 
  కాగా వెంకటేసు పోస్టుమార్టమ్ రిపోర్టులో మెడ కింది భాగంలో బిగుసుకోవడంతోనే ఊపిరి ఆడక మృతి చెందినట్లు తేలింది. పైగా 70 అడుగుల లోతున్న నీళ్లు లేని బావిలో ప్రాణంతో ఉన్న వ్యక్తి దూకితే కాళ్లు చేతులు విరిగే అవకాశం ఉంది. అవేవీ విరిగినట్లు పోస్టుమార్టమ్‌లో ధ్రువీకరణ కాలేదు. దీన్నిబట్టి వెంకటేసును ఎవ్వరో చంపి బావిలో వేసినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. ఈ దిశగా దర్యాప్తు చేయమని బాధితులు పోలీసు అధికారులదృష్టికి తీసుకెళితే స్మగ్లర్ల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.
 
 సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మురళి ఏమన్నారంటే.
 అంగన్‌వాడీ టీచర్ హైమావతి మృతి చెందిన కేసును రాజంపేట డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసు విషయం తెలియదు. వెంకటేసు మృతికి సంబంధించి అతని మెడ కింద ఒక వైపు మాత్రమే బిగుసుకున్నట్లు ఉంది. ఆ కారణంగా మృతి చెందే అవకాశం లేదని డాక్టర్ చెప్పారు. అయితే పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు కలిసి స్మగ్లరుకు, కూలీ కుటుంబానికి మధ్య పంచాయితీ నిర్వహించిన విషయం తెలియదు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement