ఒక ఎడారి పువ్వు!
గ్రేట్ లవ్ స్టోరీస్
నాజీ క్యాంపులు ఎలా ఉంటాయి? ఎవరో నరాలను గట్టిగా మెలిపెడు తున్నట్లుగా ఉంటాయి. చావుకు బతుకుకు మధ్య శ్వాస ఆడక...‘బతికి చావడం కంటే, చచ్చి బతకడం నయం’ అనిపించేలా ఉంటాయి. హిట్లర్ నాజీ క్యాంపులలో జీవితమే ఉండదు. అలాంటిది ‘ప్రేమ’ ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది. ప్రేమని బందూకులు భయపెట్టలేవు. ఇంకే రకమైన భయాలూ దాన్ని ఆపలేవని నిరూపించిన చారిత్రక ప్రేమకథ ఇది.
పోలెండ్‌లోని నాజీ కాన్సన్‌ట్రేషన్ క్యాంపులో గార్‌డగా పని చేస్తాడు ఫ్రాంక్. అతడు ఎలా ఉంటాడు? అడగాల్సిన అవసరం లేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఫ్రాంక్ కూడా జాత్యాహంకారంతో, యూదు వ్యతిరేకతతో... మిలిగిన నాజీలలాగే కఠినంగా ఉంటాడు. 1933... హిట్లర్ పవర్‌లోకి వచ్చిన రోజులవి. నాజీలలో విజాతి వ్యతిరేకత అగ్గిలా ఎగిసిపడుతోన్న దినాలవి. పోలెండ్‌లోని కాన్సన్‌ట్రేషన్ క్యాంప్‌లో భయం రాజ్యమేలుతోంది. జర్మన్ ఆక్రమిత ప్రాంతాలలోని యూదులు, కమ్యూనిస్ట్ ప్రేమికులు మొదలైన వాళ్లు దీనిలో బందీలు. అలాంటి వాళ్లలో హెలెనా సిట్రోనోవా ఒకరు. స్లొవేకియాకు చెందిన హెలెనా యూదు మతంలో పుట్టడమే తప్పైపోయింది. చేయని నేరానికి డెత్ క్యాంపులోకి వచ్చి పడింది.
కొందరిని మాట కలుపుతుంది. కొందరిని పాట కలుపుతుంది. కరడుగట్టిన మూర్ఖ భావాలతో రగిలిపోయే ఫ్రాంక్, కలువపువ్వులాంటి హెలెనాతో ప్రేమలో పడడానికి కారణం మాత్రం పాట! ఒకానొకరోజు డెత్‌క్యాంప్‌లో ఒంటరిగా పాట పాడుకుంటోంది హెలెనా. అది ఫ్రాంక్ విన్నాడు. ఆమె గొంతు, పాడిన విధానం ఫ్రాంక్‌కు తెగ నచ్చేశాయి. అందుకే తన పుట్టిన రోజు వేడుకలో ఆ అమ్మాయితో పాట పాడించుకున్నాడు. ఇక ఆరోజు నుంచి హెలెనాను మౌనంగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సాకుతో ఆ అమ్మాయితో మాట్లాడేవాడు.
అదేంటో తెలియదుగానీ, హెలెనాని ప్రేమించడం మొదలు పెట్టినప్పటి నుంచి అతనిలో కోపం మాయమైంది. ఎప్పుడూ ద్వేషం, అశాంతితో నిండి ఉండే అతని హృదయం ప్రశాంత సరోవరం అయింది. ఓసారి ఒక మూల పనిచేసుకుంటున్న హెలెనాపై ఒక చీటీ విసిరాడు ఫ్రాంక్. ఆ చిన్న చీటీలో పెద్ద మాట ఉంది... ‘ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ.’ ‘పిచ్చివాడిలా ఉన్నాడు’ అని నవ్వుకుంది హెలెనా. సరదా కోసం అలా రాసి ఉంటాడని కూడా అనుకుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ తన పట్ల అతడి కళ్లలో కనిపించే నిజాయితీని గమనించింది.
తనకు తెలియకుండానే ఫ్రాంక్ ప్రేమలో పడిపోయింది. గంటల తరబడి మాటలు లేవు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. చూపులతోనే వారి మనసులు ముడిపడి పోయాయి. సమయం చూసుకొని, అందరి కళ్లూ గప్పి, హెలెనాని, ఆమె అక్కని క్యాంపు నుంచి తప్పించాడు ఫ్రాంక్. వాళ్లు ఇజ్రా యెల్ వెళ్లి తలదాచుకున్నారు. అయితే ఆ తర్వాత ఫ్రాంక్, హెలెనాలు కలుసు కున్నారా, మనసు విప్పి మాట్లాడు కున్నారా, ఇద్దరూ ఒక్కటయ్యారా అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. అది నేటికీ రహస్యమే. అయితే అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం మాత్రం....అతని హృదయంలో ఆమె, ఆమె హృదయంలో అతడు ముద్రపడిపోయారని! వారి ప్రేమ అజరామరమైనదని!!
* ఫాంక్, హెలెనాల ప్రేమకథపై ఇజ్రాయెల్ టీవీలో 2003లో ‘ఏ డిఫరెంట్ లవ్ స్టోరీ’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది.
* వీరి ప్రేమకథపై ‘ఫర్ సచ్ ఏ టైమ్’ అనే నవల వచ్చింది. కేట్ బ్రెస్ట్లిన్ రాసిన ఈ నవల ‘ఇన్‌స్పిరేషనల్ రొమాంటిక్ నావెల్’గా గుర్తింపు పొందింది.