బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె గొప్ప మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కొత్త జీవితం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ఆచార్య.. తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. కాగా 74 ఏళ్ల లాలూ యాదవ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వైద్యం కోసం కూతురుతో కలిసి ఆయన సింగపూర్ కూడా వెళ్లొచ్చారు.
ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో లాలూకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో తండ్రికి తన కిడ్నీ దానం చేయాలని రోహిణి నిర్ణయించుకున్నారు. అయితే కూతురు ప్రతిపాదనను లాలూ మొదట్లో వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కానీ చివరికి రోహిణి ఒత్తిడి చేయడం, వైద్యుల సూచన మేరకు ఆయన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే లాలూ సింగపూర్ వెళ్లబోతున్నారు. అక్కడే ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది.
ఇక లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసేందుకు ఆయన కుమార్తె రోహిణి ముందుకు రావడం పట్ల ఆర్జేడీ పార్టీ శ్రేణులతోపాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment