కాంగ్రెస్‌కు గరిష్ట సీట్లు ఖాయం: ఖర్గే
పట్నా జన్‌విశ్వాస్ ర్యాలీ బలప్రదర్శన
ప్రసంగించిన ఆర్‌జేడీ చీఫ్ లాలూ
పాల్గొన్న వామపక్ష పార్టీల నేతలు
పట్నా: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బిహార్ రాజధాని పట్నా వేదికగా ఎన్నికల ప్రచార నగారా మోగించారు. ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలో ఆదివారం జరిగిన ‘జన్ విశ్వాస్ మహా ర్యాలీ’లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదిపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ..రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను ఉసి గొల్పుతూ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. వాటిని చూసి తాము భయపడటం లేదని చెప్పారు. దేశ సంపదను, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. కేవలం ఇద్దరు, ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడుతున్న మోదీ ప్రభుత్వం, దేశ జనాభాలో 73 శాతం మేర ఉన్న వెనుకబడిన వర్గాలు, దళితులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా బిహార్ మాజీ సీఎం, ఆర్‌జేడీ చీఫ్ లాలూ యాదవ్ ప్రసంగిస్తూ.. ఇటీవల తమను వదిలేసి ఎన్‌డీఏ పక్షంలో చేరిన సీఎం నితీశ్‌పై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం కావాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేలా మీలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు నేను ఇక్కడే ఉంటాను’అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ..యూపీ, బిహార్‌లలో కలిపి 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఓడిస్తే కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య కూడా ర్యాలీలో ప్రసంగించారు.
రైల్వేపై రాహుల్ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ధనికులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రైల్వే విధానాలను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని మోదీని నమ్మితే నమ్మక ద్రోహం గ్యారెంటీ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘డైనమిక్ ఫేర్ పేరుతో ఏటా 10 శాతం చొప్పున రైలు చార్జీలను ప్రభుత్వం పెంచుతోంది. క్యాన్సిలేషన్ చార్జీలను, ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరలను సైతం పెంచింది’’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment