కలిసే పోటీ చేద్దాం.. విపక్ష కూటమి తీర్మానం | Will Contest Polls Together As Far As Possible INDIA Blocs Resolution | Sakshi
Sakshi News home page

కలిసే పోటీ చేద్దాం.. విపక్ష ‘ఇండియా’ కూటమి నేతల తీర్మానం

Published Sat, Sep 2 2023 2:30 AM | Last Updated on Sat, Sep 2 2023 5:20 AM

Will Contest Polls Together As Far As Possible INDIA Blocs Resolution - Sakshi

ముంబై: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేయాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు తీర్మానించారు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలని, రాష్ట్రాల స్థాయిలో సీట్ల పంపకం ప్రక్రియను వెంటనే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చారు. ముంబైలో ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం శుక్రవారం ముగిసింది.

ముందస్తు ఎన్నికలు, ఒకే దేశం–ఒకే ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కూటమి తదుపరి కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని తీర్మానాలు చేశారు. కూటమికి సంబంధించిన కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంపాటు సీట్ల పంపకంపై చర్చించడానికి 14 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కలిసే పోటీ చేద్దామంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ‘జుడేగా భారత్, జీతేగా భారత్‌’ అనే థీమ్‌తో వివిధ భాషల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం ఆమోదించారు. చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ‘ఇస్రో’ను ప్రశంసిస్తూ మరో తీర్మానం ఆమోదించారు. అయితే, ఈ సమావేశంలో కూటమి కన్వినర్‌ ఎంపికపై దృష్టి పెట్టలేదు.  

ఈ నెల 30 నాటికి సీట్ల పంపకం పూర్తి  
ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్‌ గాం«దీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్, శివసేన       (ఉద్ధవ్‌) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌తోపాటు వివిధ పారీ్టల ముఖ్య నాయకులు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీతారాం ఏచూరి, డి.రాజా, తేజస్వీ యాదవ్, అఖిలేష్‌ యాదవ్, కపిల్‌ సిబల్, జయంత్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ        సెపె్టంబర్‌ 30 నాటికి పూర్తవుతుందని ఇండియా కూటమి వర్గాలు వెల్లడించాయి.  

మోదీ సర్కారు ఓటమి తథ్యం: ఖర్గే  
నియంతృత్వ పాలనకు కౌంట్‌డౌన్‌ మొదలైందని, మోదీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు సాగించినా వచ్చే ఎన్నికల్లో పరాజయం తథ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఒకే దేశం, ఒకే ఎన్నికల పేరిట దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ప్రజలను ఎవరూ మోసం చేయలేరని స్పష్టం చేశారు.

అంతకముందు విపక్ష ఇండియా కూటమి సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ప్రతిపక్ష కూటమి బలాన్ని చూసి మోదీ ప్రభుత్వం బెంబేలెత్తిపోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకపై మరింత ఉధృతంగా విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉందని, దాడులు, అరెస్టులు జరగబోతున్నాయని, కక్ష సాధింపు రాజకీయాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు.

విశ్వసనీయ ప్రత్యామ్నాయం: పవార్‌  
బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ఇండియా కూటమి రూపంలో ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఇండియా కూటమి సమావేశానికి 28 పారీ్టలకు చెందిన 86 మంది నేతలు హాజరయ్యారని తెలిపారు.  

‘ముందస్తు’కు సిద్ధంగా ఉండాలి: నితీశ్‌  
లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని, అందుకు ఇండియా కూటమి సిద్ధంగా ఉండాలని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సూచించారు.  

60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం: రాహుల్‌  
దేశంలో 60 శాతం జనాభాకు ‘ఇండియా’ కూటమిలోని పారీ్టలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చెప్పారు. ఈ పారీ్టలన్నీ కలిసికట్టుగా ఉంటే బీజేపీని సులభంగా ఓడించవచ్చని అన్నారు.  

కన్వినర్‌ అవసరం లేదు: ఉద్ధవ్‌ ఠాక్రే  
ప్రతిపక్ష ఇండియా కూటమికి కన్వినర్‌ అవసరం లేదని శివసేన(ఉద్ధవ్‌) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఏకాభిప్రాయంతో ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. కూటమి లోగోపై ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తున్నామని వివరించారు.

మాకు పబ్లిసిటీ ఆఫీసర్‌ మోదీ: స్టాలిన్‌  
బీజేపీ ప్రభుత్వం సాధించేదేమీ లేదని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ విమర్శించారు. మోదీ సర్కారును ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని చెప్పారు. తమ కూటమికి ప్రధాని మోదీ ‘పబ్లిసిటీ ఆఫీసర్‌’గా మారారని పేర్కొన్నారు.

సమన్వయ కమిటీలో ఎవరెవరు?  
14 మందితో కూడిన సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ఇండియా కూటమి ఖరారు చేసింది. వివిధ పారీ్టల నాయకులతో ఇందులో భాగస్వామ్యం కలి్పంచారు. కె.సి.వేణుగోపాల్‌(కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌(ఎన్సీపీ), టీఆర్‌ బాలు(డీఎంకే), తేజస్వీ యాదవ్‌(ఆర్జేడీ),   అభిõÙక్‌ బెనర్జీ(తృణమూల్‌ కాంగ్రెస్‌), సంజయ్‌ రౌత్‌(శివసేన), హేమంత్‌ సోరెన్‌(జేఎంఎం), రాఘవ్‌ చద్ధా(ఆమ్‌ ఆద్మీ పారీ్ట), జావెద్‌ అలీఖాన్‌(సమాజ్‌వాదీ పారీ్ట), లాలన్‌ సింగ్‌(జేడీ–యూ), డి.రాజా(సీపీఐ), ఒమర్‌ అబ్దుల్లా(నేషనల్‌ కాన్ఫరెన్స్‌), మెహబూబ్‌ ముఫ్తీ(పీడీపీ) ఇండియా కూటమి సమన్వయ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. తమ పార్టీ తరఫు సభ్యుడి పేరును తర్వాత వెల్లడిస్తామని సీపీఎం ప్రకటించింది.   
 

ఇది కూడా చదవండి: Jamili Elections: 'జమిలి'పై కమిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement