సీఎంకు తమ గోడు వినిపిస్తున్న మార్తమ్మ(ఫైల్)
కిడ్నీ దానం చేసి ఆ తల్లి కుమారుడికి మరోసారి ప్రాణం పోస్తే..జగనన్న ఆ కుటుంబానికి చేదోడుకు నిలిచారు. కిడ్నీ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును మొత్తం భరించడంతో పాటు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేసి.. ఆ యువకుడ్ని ప్రభుత్వ ఉద్యోగానికి సీఎం సిఫార్సు చేశారు. కష్టంలో తమకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామంటోంది ఆ కుటుంబం
కొనకనమిట్ల: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వేము వెలుగొండయ్య, మార్తమ్మల కుమారుడు వేము శ్రీనివాసులు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషిస్తూ తమ్ముడు బాబూరావును చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కిడ్నీ దెబ్బతిందని చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తల్లడిల్లింది. ఇంటికి ఆదరవుగా ఉన్న కుమారుడికి చిన్న వయసులోనే కిడ్నీ దెబ్బతినడంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా మదనపడ్డారు.
కుమారుడిని బతికించేందుకు తల్లీ మార్తమ్మ తన కిడ్నీ ఇవ్వడానికి ధైర్యం చేసింది. కానీ కిడ్నీ మార్చేందుకు హాస్పిటల్ ఖర్చు రూ.10 లక్షల వరకు అవుతుండటంతో ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈబీసీ నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురం పట్టణానికి వచ్చారు. తన కుమారుడు శ్రీనివాసులను తీసుకొని తల్లి మార్తమ్మ సీఎం జగన్‌ను కలిసేందుకు మార్కాపురం వచ్చారు. రోడ్డు పక్కన నిల్చోని ఉన్న వారిని గమనించిన సీఎం వారి దగ్గరకు వచ్చి పలకరించి వివరాలు తెలుసుకున్నారు.
కుమారుడిని బతికించేందుకు తన కిడ్నీ ఇస్తానని, మార్పిడికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని సీఎంకు విన్నవించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని, బీఎస్సీ నర్సింగ్ చదివిన నీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం, కిడ్నీ దానం చేసిన తల్లివైన నీకు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కలెక్టర్ దినేష్‌కుమార్‌కు సమస్యను పరిష్కరించమని ఆదేశాలిచ్చారు.
హామీ నెరవేర్చిన సీఎం జగన్ మోహన్‌రెడ్డి..
హామీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కలెక్టర్ రూ.లక్ష చెక్కును ఇచ్చారు. ఈ తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 లక్షలు మంజూరు కావడంతో విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆరోగ్యంగా ఉన్నాడు. రాయవరంలో ఉంటున్న మాకు దరిమడుగు వద్ద ఇంటి నివేశన స్థలం ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం.
కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు రూ.10 లక్షలను ముఖ్యమంత్రి జగనన్న మంజూరు చేయటంతో తన కుమారుడు ప్రసుత్తం ఆరోగ్యంగా ఉన్నాడని శ్రీనివాసులు తల్లి మార్తమ్మ సంతోషం వ్యక్తం చేసింది. సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిన శ్రీనివాసులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. దీంతో మార్తమ్మ కుమారుడిని తీసుకొని కలెక్టర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment