Meet Colleen Le, Donated Her Kidney To Boyfriend - Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం కిడ్నీ ఇచ్చి.. గుండెబద్దలయ్యే బాధను దిగమింగుకుని మరీ..

Published Sat, Jul 16 2022 5:34 PM | Last Updated on Sat, Jul 16 2022 6:09 PM

Meet Colleen Le Once Donated Her Kidney To Boyfriend - Sakshi

ఇదేం కొత్త కాదు.. కానీ, ఈమె కథ మాత్రం పెదాలపై చివర్లో నవ్వులు పూయించడం ఖాయం.

ఇష్టపడే వ్యక్తులకు సహాయం చేయాలనుకోవడం మంచిదే.. కొన్నిసార్లు చాలా ముఖ్యం కూడా. కానీ, ఆ దయాగుణమే కొందరి జీవితాల్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ఏ ప్రేయసి చేయని త్యాగం చేసి.. చివరకు అతని చేతిలో దారుణంగా మోసపోయింది. అయినా ఆమె పెదాలపై చిరునవ్వు విరబూయడం మాత్రం ఆగిపోలేదు.

ప్రేమించడం అంటే.. కొందరి దృష్టిలో ప్రేమను ఇవ్వడం.. మరిచిపోవడం!. కానీ, అవతలి వ్యక్తిని తమ సర్వస్వంగా భావించడం అనేదే అసలైన ప్రేమగా నిర్వచించింది ఆ యువతి. ప్రేమలో అవతలి వాళ్లను గౌరవించడంతో ఆగిపోకుండా.. వాళ్లకు ఆపదొస్తే కాపాడుకోవం కూడా బాధ్యత అనుకుంది. అలా అనుకుంది కాబట్టే.. వెల కట్టలేని కానుకను ప్రియుడికి బహుమతిగా సమర్పించుకుంది. కానీ, ఆమె ప్రేమకు అతను అర్హుడు కాదని గుండె బద్దలయ్యే నిజం తెలిసినా.. చిరునవ్వుతో జీవితంలో ముందుకు సాగుతోంది. 

ప్రేమించిన వ్యక్తి కోసం..
కాలిఫోర్నియాలోని యోర్బా లిండాకు చెందిన కోలీన్‌ లీ(30).. బహుశా కొందరికి ఈమె గురించి తెలిసే ఉండొచ్చు. ఏడేళ్లు వెనక్కి వెళ్తే.. 2015లో కోలీన్‌కు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికి గురించి ఏమీ తెలియకున్నా గుడ్డిగా మనసారా ప్రేమించేసింది ఆ యువతి. డేటింగ్‌ చేసి నాలుగు నెలలు తిరగకుండానే.. అతనికి కిడ్నీ సమస్య ఉందని తెలుసుకుంది. సమస్య ముదరడంతో.. అతన్ని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. అందుకే తన కిడ్నీని దానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో అతనేం బలవంతం చేయలేదు. కానీ, మానసికంగా, భావోద్వేగంగా ఆమెను బాగా ప్రభావితం చేశాడు. అతను ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం ఇబ్బంది పడుతుంటే.. చూస్తూ తట్టుకోలేకపోయింది ఆమె. ఎందుకంటే.. అతన్ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టి. 

మొత్తానికి అతనికి కిడ్నీ దానం చేసింది. కథ సుఖాంతం కావాలి కదా. అలా జరగలేదు. కొన్ని నెలలపాటు మొక్కుబడిగా ఆమెతో మాట్లాడాడు అతను. ఆ తర్వాత.. ఆమె నిజాయితీకి మెచ్చో లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ ఆమె గుండె బద్దలయ్యే నిజాన్ని చెప్పాడు అతను. చెప్పాపెట్టకుండా ఓరోజు ఆమె దగ్గరికి వెళ్లి.. తాను ప్రేమించలేదని, కేవలం మోసం మాత్రమే చేశానని చెప్పాడతను.

సెకండ్‌ ఛాన్స్‌- ప్చ్‌..
అంతే.. ఆమెకు నోట మాట రాలేదు. ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. కానీ, ఆమె సహనం కోల్పోలేదు. ఎందుకంటే ప్రేమలో తాను నిజాయితీగా ఉంది కాబట్టి. మరో అవకాశం ఇవ్వాలని అనుకుంది. కాల్స్‌ చేసింది. మెసేజ్‌లు పెట్టింది. ప్చ్‌.. దేనికి బదులు లేదు. పైగా అన్నింటా ఆమెను బ్లాక్‌ చేశాడు. అంటే..  మరో అవకాశానికి అతను సిద్ధంగా లేడని ఆలస్యంగా అర్థమైంది ఆమెకు. అందుకే అతన్ని వదిలేసింది. జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది.

 

కోలీన్‌ లీ.. ఇప్పుడు మళ్లీ ఈ పేరు ఎందుకు తెర మీదకు వచ్చింది. ఎందుకంటే.. టిక్‌టాక్‌లో ఆ మధ్య ఓ వీడియో ద్వారా ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది కాబట్టి. ఆమెది ప్రేమ విషాదం.. కానీ, దానికి ఆమె జోడించింది హ్యూమర్‌ను.  పది మిలియన్ల వ్యూస్‌, 3 మిలియన్ల లైకులతో ఆమె వీడియో ఆ షార్ట్‌ వీడియో మేకింగ్‌ యాప్‌లో ఇంకా దూసుకుపోతోంది. అందులో ఆమె త్యాగానికి దక్కిన ప్రతిఫలానికి దిగ్భ్రాంతి, సానుభూతి కామెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

నేను నిజంగా అతనితో నా శేష జీవితాన్ని గడపాలని అనుకున్నా. ఎంతగానో ప్రేమించాను కాబట్టే అతని ప్రాణాన్ని కాపాడాను. కానీ, అతను నాతో చాలా తేలికగా బంధాన్ని తెంచుకున్నాడు. అతని జీవితంలో నేను లేను అనే వాస్తవాన్ని దిగమింగుకోవడం చాలా కష్టమే. కానీ, జీవితం అక్కడితోనే ఆగిపోకూడదు కదా! అని చిరునవ్వుతో చెప్తోంది కోలీన్‌ లీ. ఆ నవ్వే ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement