అన్నయ్యకు ప్రేమతో... | Lucknow Woman gifts kidney to brother on Rakhi | Sakshi
Sakshi News home page

అన్నయ్యకు ప్రేమతో...

Aug 22 2021 12:17 AM | Updated on Aug 22 2021 12:17 AM

Lucknow Woman gifts kidney to brother on Rakhi - Sakshi

అన్న సుదీప్‌ కుమార్‌కు రాఖీ కడుతున్న డాక్టర్‌ సుజాతా దేవ్‌

సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్‌. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్‌రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్‌లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు.

రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి  స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్‌ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు.

గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుజాతా దేవ్‌ లక్నోలోని మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య  సుదీప్‌ కుమార్‌ 1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌( ఐఆర్‌ఎస్‌) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్‌కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిడ్నీ డిసీజ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐకేడీఆర్‌సీ)లో సుదీప్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్‌కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం.

సూరత్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేస్తోన్న సుదీప్‌ కుమార్‌కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్‌సీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. çసూరత్‌కు చెందిన బ్రెయిన్‌ డెడ్‌ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్‌కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క  ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్‌ లైఫ్‌’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి  అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు.

అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని  ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్‌కు మ్యాచ్‌ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత.

 రాయ్‌పూర్‌కు చెందిన అనుమిత, ఫరిదాబాద్‌కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్‌ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్‌కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి.  

‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్‌ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్‌ సుజాత దేవ్‌ చెప్పారు.

‘‘నేను సుజాతకు థ్యాంక్స్‌ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్‌కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్‌ కుమార్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement