Donate Life
-
అన్నయ్యకు ప్రేమతో...
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్‌రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాతా దేవ్ లక్నోలోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య సుదీప్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్( ఐఆర్ఎస్) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్‌కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్సీ)లో సుదీప్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్‌కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం. సూరత్‌లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేస్తోన్న సుదీప్ కుమార్‌కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్సీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. çసూరత్‌కు చెందిన బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్‌కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్ లైఫ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్‌కు మ్యాచ్ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత. రాయ్‌పూర్‌కు చెందిన అనుమిత, ఫరిదాబాద్‌కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్‌కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి. ‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్ సుజాత దేవ్ చెప్పారు. ‘‘నేను సుజాతకు థ్యాంక్స్ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్‌కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్ కుమార్ చెప్పారు. -
ఈ హృదయం అమరం
తాను చనిపోతూ మరొకరికి ప్రాణదానం బెంగళూరు: ముళబాగులుకు చెందిన మోహన్‌కుమార్ తాను చనిపోతూ మరొకరికి జీవం పోశారు. దీంతో అతని హృదయం మరో శరీరంలో జీవిస్తూ ఆ వ్యక్తికి పునర్జన్మనిచ్చింది. వివరాలు... ముళబాగులకు చెందిన మోహన్‌కుమార్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈనెల 14న స్వస్థలం వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం మోహన్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డులోని మనిపాల్ ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా మంగళవారం రాత్రి మోహన్‌కుమార్ బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నారని వైద్యులు ధ్రువీకరించారు. అంతేకాకుండా అతని అవయవాలను దానం చేయాడానికి కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి 12:58 గంటల సమయంలో ప్రత్యేక ఆంబులెన్స్ ద్వారా మోహన్ కుమార్ శరీరం నుంచి వేరుచేసిన హృదయాన్ని దాదాపు 14 కిలోమీటర్ల దూరంలోని ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రికి ఎనిమిది నిమిషాల్లో వైద్య సిబ్బంది చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి మోహన్‌కుమార్ గుండెను విజయవంతంగా అమర్చారు. కాగా, అంబులెన్స ప్రయాణిం చే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నగర ట్రాఫిక్ విభాగం గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసింది. -
రక్తదానం.. ప్రాణదానం
చేవెళ్ల: రక్తదానం ప్రాణ దానంతో సమానమని పెద్దలు చెప్పాలు. అయితే ప్రస్తుత తరుణంలో అవగాహనలోపంతో చాలా మంది రక్తదానానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకక సుమారు 78 శాతం మంది ప్రాణాలను కోల్పోవాల్సి వస్తున్నది. 2012 గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి నలుగురు మాత్రమే రక్తదానం చేయడానికి ముందుకువస్తున్నారు. దీనికి ప్రజల్లో అవగాహన లోపమే కారణమని వైద్యులు చెబుతున్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే తాము బలహీనపడిపోతామనే అపోహతో చాలా మంది రక్తదానానికి ముందుకు రావడంలేదు. దేశంలో ప్రతి రెండున్నర సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతున్నది. ఒక వ్యక్తి దానం చేసిన రక్తం మరో నలుగుర్ని కాపాడుతుంది. ప్రమాదాలు, ప్రసవసమయంలో రక్తస్రావం జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే గుండెకు సంబంధించిన ఆపరేషన్లు, క్యాన్సర్, రక్తహీనత, తలసీమియా, హిమోఫీలియా తదితరులకు కూడా కావాల్సినంత రక్తం దొరకకపోవడంతో ప్రాణాలు బలవుతున్నాయి. రక్తదానం చేస్తే కోల్పోయిన ప్లాస్మాను రెండు రోజుల్లో, కణాలను 21 రోజుల్లో శరీరం తిరిగి పొందుపరుచుకుంటుందని వారు వివరిస్తున్నారు. రక్తదాతకు అర్హతలు 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు, 45కేజీల కంటే అధిక శరీర బరువు కలిగిన వారు, రక్తపోటు, నాడీ రేటు, గుండె కొట్టుకునే స్థితి.. సాధారణంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ రక్తదానం చేస్తే జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చు. ఈ లెక్కన ప్రతిఒక్కరూ 672 మంది ప్రాణాలు కాపాడిన వారవుతారు. రక్తంలోని గ్రూపులు 1900 సంవత్సరం ప్రాంతంలో వియన్నా దేశానికి చెందిన డాక్టర్. కార్ల్ లాండ్ స్టైనర్ రక్తం గ్రూపులను మొదటిసారిగా కనుగొన్నారు. దీనికి గుర్తింపుగా 1930 సంవత్సరంలో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులుగా గుర్తించారు. ఏబీ గ్రూపు వారిని విశ్వగ్రహీతలు అని, ఓ గ్రూపు వారిని విశ్వదాతలు అని అంటారు. ఆ ఉపాధ్యాయుడు ఆదర్శప్రాయుడు రక్తదాన ఆవశ్యకతను గుర్తించిన చేవెళ్ల మండలంలోని కమ్మెట జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు పి.రామక్రిష్ణారావు 2007 నుంచి ఇప్పటివరకు 35 రక్తదాన శిబిరాలను స్వచ్ఛందంగా నిర్వహించారు. రక్తదానంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఈయన కృషిని ప్రభుత్వం కూడా గుర్తించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 14న ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య చేతులమీదుగా రామక్రిష్ణారావు సత్కారాన్ని, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.