ఆయిల్, గ్యాస్ పరిశ్రమకు గడ్డుకాలం!
మూడీస్ నివేదిక
* 2016లో ఆయిల్, గ్యాస్ ధరలు బలహీనమేనని అంచనా...
* పెట్టుబడులు 25 శాతం వరకూ పడిపోవచ్చని విశ్లేషణ
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ ధరలు ఈ సంవత్సరం కూడా బలహీనంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక మంగళవారం అభిప్రాయపడింది. అధిక సరఫరాలు దీనికి కారణమని తెలిపింది. ఆయా అంశాల నేపథ్యంలో గ్యాస్ క్షేత్రాల అన్వేషణ, ఉత్పత్తులపై మూలధనం పెట్టుబడులు 20 నుంచి 25 శాతం శ్రేణిలో పడిపోయే అవకాశాలు ఉన్నాయనీ విశ్లేషించింది. ‘చమురు, సహజ వాయువుల పరిశ్రమ: 2016లో మూలధన పెట్టుబడుల, సవాళ్లు’ అన్న శీర్షికన మూడీస్ తాజా నివేదిక విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే...
* మార్కెట్ షేర్ పెంచుకోవడంపై దృష్టిపెట్టిన ఒపెక్ (ఓపీఈసీ)-పలు ఒపెక్ యేతర ఉత్పత్తి దేశాలు భారీగా ఉత్పత్తులను కొనసాగించడం వల్ల సరఫరాలు అధికంగా కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేత కూడా సరఫరాల పెరుగుదలకు కారణం.
* ఉత్పత్తుల తగ్గుదల, ధరలు తక్కువగా ఉండడం వంటి అంశాలు భారత్, చైనా, అమెరికా వంటి దేశాల్లో చమురు వినియోగం పెరుగుదలకు దోహదపడుతుంది.
* దిగువ స్థాయిలో ధరలు సంబంధిత కమోడిటీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు సవాలే. ఇక ఈ రంగం కూడా ‘డిఫాల్ట్స్’ సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు. చమురు అన్వేషణ, ఉత్పత్తి (ఈ అండ్ పీ) కంపెనీల క్యాష్ ఫ్లోస్‌పై ఇప్పటికే దిగువస్థాయి ధరలు ప్రభావం చూపుతున్నాయి. డ్రిల్లింగ్, ఆయిల్‌ఫీల్డ్ సర్వీస్ ప్రొవైడర్ల వంటి ఇతర ఇంధన కంపెనీలపై కూడా ప్రతికూల జాడలు కనిపిస్తున్నాయి.
* ట్రెడెడ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2016లో బ్యారల్‌కు సగటున 43 డాలర్లుగా ఉండవచ్చు. అటు తర్వాత ఏడాది 48 డాలర్లకు, 2018లో 53 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.
* సవాళ్లను అధిగమించడానికి పరిశ్రమలో కొన్ని కంపెనీల కొనుగోళ్లు, విలీనాల అవకాశం ఉంది. ఫండింగ్ అవసరాలూ అదనపు ఇబ్బందులు సృష్టించవచ్చు. దీనితో దివాలా దిశగా కొన్ని కంపెనీలు నడిచే కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఆయా అంశాలు అసెట్ విలువలు ‘కొనుగోళ్లకు’ ఆకర్షణగా మారేందుకు దోహదపడతాయి.