25 డాలర్లకు తగ్గనున్న చమురు
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పలు సంవత్సరాలపాటు ప్రస్తుత కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినా.. ఒకవేళ ఇరాన్ నుంచి ఉత్పత్తి మెరుగ్గా ఉంటే బ్యారెల్ ధర 25 డాలర్లకు కూడా పతనం కావొచ్చని వివరించింది. 2014 జూన్‌లో చమురు ధరల పతనం ప్రారంభమై ఇటీవలే దశాబ్దపు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటికే మార్కెట్లో పేరుకుపోయిన చమురు, గ్యాస్ నిల్వల వినియోగం నెమ్మదిగా జరుగుతున్నందున .. రేట్లు మరికొన్నాళ్ల పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగవచ్చని మూడీస్ వివరించింది.
2016లో చమురు ధరలు బ్యారెల్‌కు 33 డాలర్ల స్థాయిలోనే ఉండొచ్చని, వచ్చే ఏడాది 38 డాలర్లకు, అటుపైన 2018లో 43 డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది. ఇక ఈ ఏడాది అమెరికా హెన్రీ హబ్ సహజ వాయువు (గ్యాస్) రేటు యూనిట్‌కు (ఎంబీటీయూ) సగటున 2.25 డాలర్లుగా ఉండొచ్చని, వచ్చే ఏడాది 2.50 డాలర్లకు, 2018లో 2.75 డాలర్లకు చేరొచ్చని మూడీస్ పేర్కొంది. ఇలా కాకుండా చమురు, గ్యాస్ రేట్లకు కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయని మూడీస్ తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి సరఫరాలు తగ్గినా.. ఇరాన్ నుంచి పెరిగితే చమురు రేటు 25 డాలర్లకు, గ్యాస్ ధర యూనిట్‌కు 1.75 డాలర్లకు పడిపోవచ్చని వివరించింది. అమెరికా, చైనా, భారత్ సహా ప్రధాన వినియోగ దేశాల్లో డిమాండ్ కన్నా మించి ప్రస్తుతం ఉత్పత్తి, సరఫరా ఉంటోందని మూడీస్ పేర్కొంది. చమురు రేట్లు తక్కువగా ఉండటం వల్ల ఉత్పత్తి దేశాల వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కనీసం 0.8% మేర మందగించవచ్చని, అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపైనా ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది.