వృద్ధి అంచనాలకు మూడీస్ కోత..
- 7.5 నుంచి 7 శాతానికి తగ్గింపు
- పారిశ్రామిక మందగమనం,పెట్టుబడులు తగ్గడమే కారణం
ముంబై: 2015లో భారత్ వృద్ధి రేటును 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. 2016 వృద్ధి రేటును కూడా 7.6 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. చమురు ధరలు తగ్గడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్‌ఐఐ, ఈసీబీ, ఎఫ్‌డీఐలు మినహా ఒక ఆర్థిక సంవత్సరం దేశంలోకి వచ్చీ, పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య ఉన్న నికర వ్యత్యాసం) తక్కువ స్థాయిలో ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే పారిశ్రామిక మందగమనం, పెట్టుబడులు తగ్గడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశాలని వివరించింది. బ్యాంకుల రుణ వృద్ధి రేటు కూడా తక్కువ స్థాయిలో ఉండడాన్ని మూడీస్ నివేదిక ప్రస్తావించింది.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పలు ఆసియా పసిఫిక్ దేశాల వృద్ధి అంచనాలను కూడా మూడీస్ తగ్గించింది. వర్షాభావ పరిస్థితులు ద్రవ్యోల్బణం కదలికలపై అనిశ్చితి పరిస్థితిని సృష్టించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. చైనా నుంచి బలహీన డిమాండ్ ఈ ప్రాంతంలో ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మూడీస్ అంచనా వేసింది.
వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నాం: యూబీఎస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు అంచనాలను ఇంతక్రితం 7.5% నుంచి 7.1 శాతానికి తగ్గిస్తున్నట్లు స్విట్జర్లాండ్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ తాజా నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) వృద్ధి రేటు అంచనాలను సైతం 8.3 శాతం నుంచి 7.6%కి దించింది. దేశీయంగా,అంతర్జాతీయంగా భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంది. 2015-16 తొలి క్వార్టర్ వృద్ధి కేవలం 7% నమోదయిన నేపథ్యంలో ఇప్పటికే పలు రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు భారత్ వృద్ధి రేటు అంచనాలకు కోత పెడుతుండటం తెలిసిందే.
పటిష్టంగానే: ఓఈసీడీ
భారత్ పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) అంచనా వేసింది. అయితే చైనా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా దిగువముఖ ధోరణిలో కనిపిస్తోందని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ పేర్కొంది.