వర్ధమాన దేశాలపై ఫెడ్ రేటు దెబ్బ..
పెట్టుబడులు తరలిపోవచ్చని మూడీస్ హెచ్చరిక
అమెరికా ఎకానమీ స్థిరపడుతుండటాన్ని ప్రతిబింబిస్తూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం.. వర్ధమాన దేశాలకూ ప్రయోజనకరమే అయినప్పటికీ.. ఆయా దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోయే అవకాశాలుఉన్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో అక్కడ దిగుమతులకు డిమాండ్ పెరగడం వల్ల వర్ధమాన దేశాల ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరగలదని తెలిపింది.అదే సమయంలో ఫెడ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలిపోవచ్చునని..
ఇది వాటిపై ఆధారపడిన సంస్థలకు ప్రతికూలం కాగలదని వివరించింది. అలాగే రాజకీయంగా,విధానాలపరంగా అనిశ్చితికి దారితీయొచ్చని మూడీస్ పేర్కొంది. ఫెడ్ క్రమానుగతంగా మరో రెండు మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని అభిప్రాయపడింది. మొత్తం మీద 2017 ఆఖరు నాటికి వడ్డీ రేట్లు 1.25– 1.5శాతం స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఈ ప్రభావాలు అమెరికా కన్నా మిగతా వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపైనే ఎక్కువగా కనిపించవచ్చని వివరించింది.