![బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం](/styles/webp/s3/article_images/2017/09/4/61465586145_625x300.jpg.webp?itok=QcCbZI9c)
బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం
2020 నాటికి తప్పదంటున్న మూడీస్ నివేదిక
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ సహా తన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2020 నాటికి రూ.1.2 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. బ్యాలెన్స్ షీట్ల పటిష్టతకు అవసరమని పేర్కొన్న ఈ మొత్తం పరిమాణం ప్రభుత్వ ప్రణాళికా పరిమాణానికన్నా అధికంగా ఉండడం గమనార్హం. 2019 మార్చి నాటికి 22 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక.
ఇందులో ఇప్పటికే కేంద్రం రూ.25,000 కోట్లు సమకూర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకన్నా... అవసరమైతే మరింత సమకూర్చుతామని కూడా కేంద్రం హామీ ఇస్తోంది. కాగా, మార్చి 11వ తేదీ నాటికి ఈ 11 బ్యాంకుల పనితీరును కూడా మూడీస్ సమీక్షించింది. రానున్న 12 నెలల్లో సైతం బ్యాంక్ అసెట్ క్వాలిటీ ఒత్తిడిలో ఉంటుందని పేర్కొంది.