సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల రిటైల్ కస్టమర్లకు ప్రత్యేకించి దిగువ ఆదాయ రుణ గ్రహీతలకు కష్టాలు కొనసాగుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు రుణ వ్యయాలు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని తెలిపింది. మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ శ్రీకాంత్ వడ్లమాని తెలిపిన ముఖ్యాంశాలు చూస్తే...
- కరోనా ప్రారంభ దశలో ఊహించినదానికన్నా మెరుగ్గా ప్రస్తుత బ్యాంకింగ్ రుణ నాణ్యత ఉంది. ప్రత్యేకించి కార్పొరేట్ రుణాల విషయంలో బ్యాంకింగ్ బాగుంది. మొండిబకాయిలకు సంబంధించి తగినకేటాయింపులు జరపడం దీనికి ఒక కారణం.
- ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మొండిబకాయిలు తగ్గుతున్నాయి. మహమ్మారి కరోనా ప్రేరిత సవాళ్ల వల్ల మధ్య, చిన్న తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) రుణ గ్రహీతలు ఇబ్బందులు పడ్డారు. ఎకనమీ రికవరీ దశలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విభాగానికి సంబంధించి రుణ నాణ్యతలో సవాళ్లు తలెత్తకుండా ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన చర్యలు తగిన ఫలితాన్ని ఇచ్చాయి.
- ప్రైవేటు రంగ బ్యాంకులతో పోల్చితే ప్రైవేటు రంగం బ్యాంకింగ్ రుణ నాణ్యత బాగుంటుంది. అయితే కేంద్రం నుంచి తాజా మూలధన కల్పన కొంత ఊరటనిచ్చే అంశం.
- 2021 చివరి ఆరు నెలల కాలంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రుణ నాణ్యత మరింత దెబ్బతినవచ్చు. 2022లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే వీలుంది. ఆటో, చిన్న వ్యాపారాల్లో ఒడిదుడుకులు దీనికి కారణంగా మారే వీలుంది.
తగిన స్థాయిలో వృద్ధి, ద్రవ్యలోటు అంచనాలు
వృద్ధి, ద్రవ్యలోటు అంచనాల విషయంలో 2021-22 బడ్జెట్ వాస్తవికతకు అద్దం పడుతోందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో 2021-22లో ప్రభుత్వ ఆదాయ– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 6.8 శాతానికి కట్టడి చేస్తామని పేర్కొంటూ, వృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ద్రవ్యపరమైన బలహీన పరిస్థితి భారత్‌కు 2021కు ‘క్రెడిట్’ సవాళ్లను విసురుతుందనీ మూడీస్ పేర్కొంది. ద్రవ్యలోటును బడ్జెట్ ప్రతిపాదనలకన్నా తక్కువగా ఉంచాల్సిన అవసరాన్ని మూడీస్ సూచించింది. అలాగే భారత్ రుణ భారాన్నీ మూడీస్ ప్రస్తావించింది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకోవాలి. వ్యత్యాసం– ద్రవ్యలోటు అంచనాలను 9.5 శాతానికి (2020-21 స్థూల దేశీయోత్పిత్తి-జీడీపీలో) సవరిస్తున్నట్లు బడ్జెట్ పేర్కొంది. 2020-21 బడ్జెట్ ప్రకారం 3.5 శాతం వద్ద (రూ. రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్నది లక్ష్యం. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 6.8 శాతానికి కట్టడి చేయాలన్నది బడ్జెట్ లక్ష్యమని వివరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళతామని ఆర్థికమంత్రి భరోసాను ఇచ్చారు. 2019-20లో ద్రవ్యలోటు 4.6 శాతం. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021-22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023-24 నాటికి 5 శాతానికి, 2024-25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. జీడీపీలో రుణ నిష్పత్తి 90 శాతానికి దాటిపోయే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 2019లో ప్రభుత్వ రుణ–జీడీపీ నిష్పత్తి 72 శాతంగా ఉంది. రేటింగ్ విషయంలో ఈ అంశం చాలా కీలకమైనది.
వృద్ధి అంచనాలు 13.7 శాతానికి పెంపు
భారత్ ఎకానమీ 2021–22లో 13.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణత ఏడు శాతానికి పరిమితం అవుతుందని విశ్లేషించింది. ఈ మేరకు నవంబర్ అంచనాలను గణనీయంగా మెరుగుపరచింది. అప్పట్లో 2021–22 ఆర్థిక సంవత్సరం వృద్ధిని 10.8 శాతంగా అంచనావేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్షీణతను 10.6 శాతంగా పేర్కొంది. సాధారణ పరిస్థితులు నెలకొనడం, వ్యాక్సినేషన్ వేగవంతంతో మార్కెట్‌లో విశ్వాసం మెరుగుపడ్డం తన క్రితం అంచనాల తాజా సవరణకు కారణమని మూడీస్ వివరించింది. సంస్కరణల అమలు ఇప్పటికీ భారత్‌కు సవాళ్లు విసురుతున్న అంశమేనని తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే విషయంలో ఇంకా అస్పష్టత ఉందని విశ్లేషించింది.
Comments
Please login to add a commentAdd a comment