చిరు వ్యాపారులపై కోవిడ్‌ పిడుగు!   | Coronavirus More Affected On Small Traders | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారులపై కోవిడ్‌ పిడుగు!  

Published Sat, Aug 1 2020 3:43 AM | Last Updated on Sat, Aug 1 2020 4:17 AM

Coronavirus More Affected On Small Traders - Sakshi

రాజారాం గృహావసర వస్తువులను ఊరూరా తిరిగి విక్రయిస్తుంటాడు. జనాలకు ఏయే వస్తువులు కావాలో ముందే చెబితే, వాటిని వారికి అందజేయడంతో పాటు ఇతర వస్తువులు తెచ్చి విక్రయించడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇప్పుడు కరోనా వైరస్‌తో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ బయటకు వెళ్లినా వైరస్‌ సోకుతుందన్న కారణంతో తమతమ ఊళ్లలోకి గ్రామస్తులు రానివ్వడంలేదు.  

రహీం ప్లాస్టిక్‌ వస్తువులు అమ్ముతుంటాడు. మంచి డిమాండ్‌ ఉండటంతో సుమారు నాలుగైదు  గ్రామాల్లో తిరుగుతుంటాడు. వారంలో ఐదారు గ్రామాలు చుట్టబెట్టడమే కాకుండా వారాంతపు సంతలో సైతం విక్రయిస్తాడు. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో ఎక్కడికి వెళ్లలేకపోతున్నాడు. వెళ్దామన్నా ఇతర గ్రామాల్లోకి రాకుండా గ్రామస్తులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వ్యాపారం మరింత ఇబ్బందిగా మారింది. 

సాక్షి, హైదరాబాద్‌: చిన్న వ్యాపారాలకు దెబ్బ... ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభ పరిస్థితుల్లో ఇది కేవలం రాజారాం, రహీమ్‌ అనే ఒకరిద్దరు చిరు వ్యాపారులకే పరిమితమైన సమస్య కాదు. మధ్య తరగతి, దిగువ తరగతికి చెందిన వారికి తక్కువ ధరలకే వివిధ పరికరాలు, వస్తువులు, సరుకులు అమ్ముకునే ‘హర్‌ ఏక్‌ మాల్‌’ చిరు వ్యాపారులు, వీధివీధినా తిరిగి ఆయా వస్తువులు విక్రయించే సంచార వ్యాపారులు ఇలా చిన్నా, చితకా వ్యాపారాలు చేసుకునే వారందరి జీవితాలు తలకిందులై పోయాయి. కస్టమర్లు కోరుకునే వివిధ రకాల సరుకులు కొనుగోలు చేసేందుకు అవసరమైన పెట్టుబడి అందుబాటులో లేక కొం దరు చిరు వ్యాపారులు ఇబ్బందిపడుతున్నారు. అప్పోసొప్పో చేసి ఆయా వస్తువులను తెచ్చి, ఊరూరా తిరిగి అమ్మే ప్రయ త్నం చేసినా కొనేందుకు ఎవరూ ముం దుకు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

గ్రామాల్లోకి రానివ్వడం లేదు... 
చిన్నచిన్న తోపుడుబండ్లు, సైకిళ్లు, మోపెడ్‌లపై రోజువారీ వ్యాపారాలు చేసుకునే వారికి కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరుకులు తీసుకుని వెళుతున్న వారిని కరోనా భయంతో గ్రామాల్లోకి అడుగుపెట్టకుండా ఊరి బయటే అడ్డుకుంటున్నారు. దీంతో వస్తువులు, సరుకులు అమ్ముడుపోక నిరాశగా ఇళ్లబాట పట్టాల్సి వస్తోంది. గతంలో ఊళ్లల్లో ఏర్పాటు చేసిన  సంతల్లో సంచార వ్యాపారులు   వస్తువులను విక్రయించుకునే వీలుండగా, ఇప్పుడు కోవిడ్‌ భయంతో ఈ సంతలు కూడా నిలిచిపోవడంతో వీరి వ్యాపారాలు ముందుకు సాగడం లేదు. 

బకాయిలతో మరో కష్టం... 
అప్పులుచేసి తీసుకొచ్చిన వస్తువులు అమ్ముడుపోక ఒకవైపు, తీసుకొచ్చిన స్టాక్‌కు డబ్బు కట్టాలంటూ గుత్త వ్యాపారుల బెదిరింపులు మరోవైపు.  స్టాక్‌ అమ్ముడుపోనందున మరికొన్ని రోజులు గడువు కావాలంటూ చిరువ్యాపారులు ప్రాధేయపడుతున్నా, డబ్బు కట్టాల్సిందేనంటూ వారిపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు సొంత ఊరిలోనైనా సరుకులు, వస్తువులు అమ్ముకుందామంటే, గ్రామాల్లోకి సరుకులను తీసుకొచ్చేవారిని రానివ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కుంటున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement