ఈ ఏడాది భారత్ వృద్ధిరేటు 4.7 శాతమే..
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థికాభివృద్ధి (జీడీపీ) రేటు అంచనాల కోత విషయంలో ఇప్పుడు ఇక ప్రపంచబ్యాంక్ వంతు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను తమ తాజా ‘భారత్ వృద్ధి అప్‌డేట్’ నివేదిక కుదించినట్లు బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా వ్యవహారాలు) మార్టిన్ రామ్ ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.2 శాతం ఉంటుందన్నది బ్యాంక్ తాజా అంచనా అని కూడా వెల్లడించారు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతం. అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాల్లో అరశాతం కుదింపు జరిగిందన్నమాట.
కారణం ఇదీ...
2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 5 శాతం వృద్ధి సాధించింది. గడచిన దశాబ్ద కాలంలో వృద్ధి సగటు 8 శాతం. భారత్ వృద్ధి 2013-14లో బలహీనం కావడానికి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ (4.4 శాతం వృద్ధి) పేలవ పనితీరు కారణమని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీనికితోడు తదుపరి రెండు నెలల్లో అంటే జూలై- ఆగస్టు నెలల్లో బిజినెస్ సెంటిమెంట్‌లో పూర్తి ప్రతికూల ధోరణి నెలకొందని వివరించింది.
కొన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్థంలోనూ వృద్ధి రేటుపై అధిక వడ్డీరేట్ల భారం పడే అవకాశం ఉందని వివరించింది. ఇక మొత్తం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదల, అధిక స్థాయిల్లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్), ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ఒత్తిడులు ఆర్థిక వ్యవస్థ సత్వర రికవరీకి అడ్డంకిగా మారుతున్నట్లు వరల్డ్ బ్యాంక్ సీనియర్ కంట్రీ ఎకనమిస్ట్ డీనిస్ మద్విదేవ్ పేర్కొన్నారు.
సానుకూల అంశాలు...
ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో భారత్ ఆర్థిక వ్యవస్థకు కొంత కలిసి వచ్చే అంశాలను ప్రపంచబ్యాంక్ నివేదిక వివరించింది. కోర్ గ్రూప్ ద్రవ్యోల్బణం (ఆహార వస్తువులు, ఇంధనం లైట్ విభాగం మినహా మిగిలిన విభాగాల టోకు ధరల సూచీ- ప్రధానంగా తయారీ రంగం) దిగిరావడం, వ్యవసాయ రంగంలో భారీ దిగుబడులు, రూపాయి బలహీనత ద్వారా ఎగుమతుల విభాగంలో లభించే ప్రయోజనాలు, విదేశీ కరెన్సీలలో రూపాయి మారకపు విలువ స్థిరత్వం వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. సాగు ప్రాంతం 5 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో వృద్ధి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది.
2012-13లో ఈ రంగం వృద్ధి 1.9 శాతం అయితే, 2013-14లో ఈ రేటు 3.4 శాతానికి చేరే అవకాశం ఉందని రామ్ వివరించారు. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపుతుందని విశ్లేషించారు. పారిశ్రామిక రంగం కొంత మెరుగుపడ్డంతోపాటు, ఎగుమతుల పెరుగుదల, కొత్త ప్రాజెక్టుల అమలు వంటి అంశాలు పరిస్థితులను మెరుగుపరచవచ్చని వివరించారు. గడచిన కొన్ని వారాలుగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతోందని సైతం పేర్కొన్నారు. సంస్కరణల విషయంలోనూ ఇదే సానుకూల ధోరణి ఉందన్నారు.
డీబీఎస్ ఇండియా అంచనా 5 శాతంఙఞ్చటకాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు దాదాపు ఐదు శాతంగా ఉంటుందని డీబీఎస్ ఇండియా తన తాజా నివేదికలో అంచనా వేసింది. 3.8 శాతం-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందన్నది తమ అంచనా అని సంస్థ జీఎం, సీఈఓ సంజీవ్ భాసిన్ పేర్కొన్నారు. మందగమనం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొంటూ, అందువల్ల వృద్ధిపై తక్కువ శ్రేణిలో ఖచ్చితమైన అంచనాలను చెప్పడం కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.