కష్టాల్లో ‘డ్వాక్రా’ | Difficulties 'Dwcra' | Sakshi
Sakshi News home page

కష్టాల్లో ‘డ్వాక్రా’

Published Mon, Dec 8 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM

కష్టాల్లో ‘డ్వాక్రా’

నారు పోసిన వాడు నీళ్లు పొయ్యకుండా పోతాడా! అనేది సామెత. అంటే పుట్టుక ఇచ్చిన దేవుడు జీవించడానికి ఏదో మార్గం చూపిస్తాడనేది అర్థం. డ్వాక్రా సంఘాల విషయంలో అది తిరగబడింది. సంఘాల ఏర్పాటుకు బీజం వేసిన సీఎం చంద్రబాబు పదేళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉసురు తీశారు. ఎన్నికల వేళ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట మార్చారు. హామీ మేరకు రూ.పది వేలు కూడా ఇవ్వకుండా నామం పెట్టారు. అప్పులకు తోడు వడ్డీ భారం పెరిగింది. మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సంఘాలపై చీకట్లు అలుముకున్నాయి. సొంత జిల్లాలోనే డ్వాక్రా సంఘాల నుంచి సీఎం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
 
సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది జిల్లాలోని  43,837 గ్రూపులకు రూ.1,177 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా  బ్యాంకు లు ఇప్పటివరకు కేవలం 12,652 సంఘాలకు రూ.475 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చే శాయి. ఇంకా 31 వేల గ్రూపులకు రుణాలు చెల్లించాల్సి ఉన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో మొత్తం 62 వేల డ్వాక్రా గ్రూపులు ఉండగా, 58,602 గ్రూపులు  బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి.

ప్రతి నెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు రూ.100 కోట్లు కడుతున్నాయి. 11 శాతం మాత్రమే బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు రుణమాఫీ హామీతో  చాలా గ్రూపులు ఎన్నికల అనంతరం బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరి గా యి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీలు  పడడమే కాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. దీంతో చాలా గ్రూపులు ఇదే పరిస్థితినెదుర్కొంటున్నాయి.

చంద్రబాబు రుణమాఫీ హామీని తుంగలో తొక్కడంతో  డ్వాక్రా గ్రూపుల అప్పులు  పెరిగాయి.  జిల్లా వ్యా ప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి రూ.58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా రూ.7,436 గ్రూపులు  3 నెలలుగా రూ.147 కోట్లను కట్టలేని పరిస్థితిలో బ్యాంకులకు చెల్లించడం  నిలిపివేశాయి. బ్యాంకులు సకాలం లో రుణాలు మంజూరు చేయలేదు.
 
బలవంతపు రుణవసూళ్లు
రుణమాఫీ సంగతి దేవుడెరుగు. ముందు డ్వాక్రా రుణాలను తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు డ్వాక్రా రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే  రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పైగా పాతబకాయిలకు సంబంధించి  రీపేమెంట్ చేయకపోతే అధిక వడ్డీలు వసూలు చేయాల్సి వస్తుందని, బకాయిలు చెల్లించకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదని తేల్చి చెబుత్నున్నారు.

సకాలంలో తిరిగి చెల్లించకపోతే రూ.5 లక్షలకు నెలకు రూ.5 వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సందేనంటూ బెదిరిం పులకు సైతం దిగారు . జిల్లాలో  62 వేల డ్వాక్రా సంఘాల్లో దాదాపు 7.80 లక్షల మంది  సభ్యులున్నారు.  2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.  2013-14లో రూ.1387 కోట్ల రుణాలు ఇచ్చారు.

ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో  రూ.147 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ. 58 కోట్లు ఉన్నారుు. మొత్తంగా  ఈ ఏడాది ప్రారంభం నాటికే ఇచ్చిన రూ. 1200 కోట్లు బకాయిలు ఉండగా, బలవంతపు వసూళ్ల పుణ్యమాని ఇప్పటికే 89 శాతం వసూలు చేశారు.  
 
రూ. పది వేలు ఏదీ?
మరో వైపు అక్కాచెల్లెళ్లకు ఖర్చుల కోసం ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేలు ఉచితంగా ఇస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదే పదే చెప్పారు. కానీ పైసా విదల్చలేదు. జిల్లాలోని  7.80 లక్షలసభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల వంతున  మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.  మొత్తంగా చంద్రబాబు మాటలు నమ్మి పోసపోయామంటూ మహిళలు వాపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement