bank transactions
-
ఆన్లైన్ పేమెంట్ మోసాలను అరికట్టేందుకు ముసాయిదా
ఆన్లైన్ చెల్లింపుల్లో జరిగే మోసాలను అరికట్టడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరిగే మోసాన్ని నిరోధించడానికి ఆర్బీఐ ముసాయిదాను రూపొందించింది. ఆరు నెలల పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని వినియోగదారుల కేవైసీను అప్డేట్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అలాగే పాస్వర్డ్, పిన్, సాఫ్ట్వేర్ టోకెన్లు, బయోమెట్రిక్‌లతో సహా డిజిటల్ చెల్లింపుల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని ప్రతిపాదించింది.కార్డు లావాదేవీలు మినహా ఇతర డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు గతంలో కొన్ని అథెంటికేషన్లను యాక్సెస్ చేసినా వాటిని నిరుపయోగంగానే వదిలేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి ఎన్ని అథెంటికేషన్లను తీసుకొచ్చినా లావాదేవీలు జరపాలంటే మాత్రం ప్రాథమికంగా ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం రూ.5,000 లోపు చేసే కార్డ్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ప్రీమియంలు, డిజిటల్ టోల్ చెల్లింపులు, రూ.7,500 లోపు చేసే ఆఫ్‌లైన్ చెల్లింపు లావాదేవీలను ఏఎఫ్ఏ నుంచి మినహాయించారు. అంతకుమించి లావాదేవీలు జరిపితే మాత్రం అథెంటికేషన్ ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: బ్యాంకు సర్వీస్ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్వేర్ దాడి!కస్టమర్ల వివరాలు, లావాదేవీల్లో మరింత భద్రత పాటించాలనే ఉద్దేశంతోనే ఏఈపీఎస్ ముసాయిదాను రూపొందించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆరు నెలల నుంచి ఎలాంటి లావాదేవీలు జరపని కస్టమర్ల కేవైసీ ప్రక్రియలో ముసాయిదాలోని ఆదేశాలు పాటించాలని తెలిపింది. -
హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్(సీబీఎస్)ను కొత్త ఇంజినీరింగ్ ప్లాట్‌ఫారమ్‌కు మారుస్తున్న నేపథ్యంలో యూపీఐ సేవలను తాత్కాలికంగా కొన్నిగంటల పాటు నిలిపేస్తామని ప్రకటించింది. దానికోసం జులై 13, 2024 శనివారం ఉదయం 3:00 నుంచి 3:45 వరకు, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు యూపీఐ సేవలు పనిచేయవని తెలిపింది.బ్యాంకింగ్ పనితీరు, సామర్థ్యం, విశ్వసనీయతను మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని బ్యాంక్ ప్రకటనలో చెప్పింది. కస్టమర్లకు మరింత వేగంగా సేవలందించేందుకు ఈ మైగ్రేషన్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. బ్యాంక్ సర్వర్లను యాక్సెస్ చేసేపుడు అధిక ట్రాఫిక్ వాల్యూమ్‌ను నిర్వహించడానికి ఇది తోడ్పడుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్శనివారం బ్యాంక్ సెలవు కావడంతో ఈ అప్డేషన్ కోసం జులై 13ను ఎంచుకున్నట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. యూపీఐ వినియోగదారులు మాత్రం శనివారం బ్యాంక్ ప్రకటించిన సమయాన్ని గమనించాలని కోరింది. కస్టమర్లు అంతకు ముందుగానే బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది. -
డీసీయూబీ డిపాజిటర్ల ఆందోళన
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని దుర్గా కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (డీసీయూబీ)లో డిపాజిట్ చేసిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాలపరిమితి ముగిసినా డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడంతో డిపాజిటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు. రుణాలు తీసుకున్న వారినుంచి రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేయకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీయూబీ లావాదేవీలను నిలిపివేస్తూ 2022 జూలై 29న ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో విజయవాడ విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో గల డీసీయూబీ బ్రాంచి వద్ద పలువురు డిపాజిటర్లు ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు 92 ఏళ్ల చరిత్ర గల ఈ బ్యాంక్‌తో 40–50 అనుబంధం ఉన్నవారు రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డిపాజిట్లు చేశారు. వారికి సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మద్దతుగా నిలిచారు. డిపాజిటర్లలో ఒకరైన ఎస్.లక్ష్మీకనకదుర్గ కుమారుడు సత్యకుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ డిపాజిట్ చేసిన వారిలో అంతా 50–60 ఏళ్లు పైబడిన వారేనని తెలిపారు.ఓ మహిళ తన కుమార్తె వివాహం నిమిత్తం రూ.7 లక్షలు డిపాజిట్ చేసిందని, ఆ మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. బ్యాంక్ సిబ్బంది డిపాజిటర్లు ఏమైనా అడిగితే దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి రావల్సిన బకాయిలను వసూలు చేయలేక డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలల్లో కొలిక్కి రావచ్చుబ్యాంక్లో పేరుకుపోయిన మొండి బకాయిల కారణంగా ఆర్బీఐ లావాదేవీలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిందని బ్యాంక్ సీఈఓ బంకా శ్రీనివాసరావు తెలిపారు. డిపాజిటర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని.. మొండి బకాయిలు ఉన్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం ద్వారా వసూలు చేయాలని ఆర్బీఐ ఆదేశించిందన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకుఉండగా.. మొండి బకాయిలు రూ.240 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నాయన్నారు. డిపాజిటర్లు మరో 6 నెలలు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని, ఆర్బీఐ నిబంధనలను సడలింవచ్చన్నారు. అప్పుడు మెచ్యూర్ అయిన డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దన్నారు. -
ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) డేగ కన్నేసింది. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఏక కాలంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు లావాదేవీల సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖకు అందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలు, డిపాజిట్ల సమాచారాన్ని అన్ని బ్యాంకులు వెంటనే ఐటీ శాఖకు అందజేయాలని సూచించింది. ఒక్క రోజులో రూ.10 లక్షలు అంత కన్నా ఎక్కువ ఉపసంహరణ, డిపాజిట్లు, నెలరోజుల్లో రూ. 50 లక్షలకు పైగా ఉపసంహరణ, డిపాజిట్లపై రోజువారీ నివేదికలను ఐటీ శాఖకు అందజేయాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలవారీగా బ్యాంకులన్నీ ఈ నివేదికలు పంపాలని స్పష్టం చేసింది. రూ. 2,000 కన్నా ఎక్కువగా డిజిటల్ బదిలీల సమాచారాన్ని కూడా ఐటీ శాఖకు పంపాలని తెలిపింది. ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు డిజిటల్ చెల్లింపులు, ఒక మొబైల్ నుంచి పలు మొబైల్ నంబర్లకు నగదు బదీలీల సమాచారాన్ని కూడా ఇవ్వాలని సూచించింది. వీటిపై క్షేత్రస్థాయిలో బ్యాంకుల సిబ్బందికి అవగాహన కల్పిచాలని తెలిపింది. ఎటువంటి అనధికార కార్యకలాపాలకు పాల్పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. నగదు తరలింపును నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ శాఖలతో కలిపి 105 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం తనిఖీలు చేస్తోంది. -
కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు
సాక్షి, హైదరాబాద్: కబాలీ తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్పూర్ క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చౌదరి సెల్ఫోన్లను స్వాదీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. ఆయా అంశాలపై స్పష్టత కోసం చౌదరిని రెండురోజులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. 12 మందికి కొకైన్ విక్రయం పోలీసుల విచారణలో కేపీ చౌదరి.. సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ విజ్ అలియాస్ ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి అలియాస్ రఘు తేజ, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారు. సెలబ్రిటీల కాంటాక్ట్‌లు, పార్టీ ఫొటోలను కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్‌లో భద్రపరుచుకున్నాడు. వాటిని పోలీసులు డీకోడ్ చేశారు. వందలాది ఫోన్ కాల్స్.. ఈ ఏడాది మేలో కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించాడు. ఈ సమయంలో సురేష్ రాజు, రతన్ రెడ్డి, గోవాలోని మీరాజ్ క్లబ్ మేనేజింగ్ పార్ట్నర్ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్ సుధీర్లతో కేపీ చౌదరి వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. పెద్దసంఖ్యలో ఫోన్‌కాల్స్ ఎందుకు చేశారని చౌదరిని ప్రశ్నించగా.. స్పష్టమైన సమాధానం చెప్పలేదని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ డ్రగ్స్ కస్టమర్లు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా చౌదరికి డ్రగ్స్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలలో 11 అనుమానాస్పద లావాదేవీలు జరిపాడు. వీటిపైనా సరైన వివరణ ఇవ్వలేదు. అమెరికాలో ఉంటున్న దుగ్గిరాల అమర్ రూ.లక్షల్లో, గోవాలో రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ సాహా రూ.85 వేలు, షేక్ ఖాజా అనే వ్యక్తి రూ.2 లక్షలు, బిహార్‌కు చెందిన కిన్షుక్ అగర్వాల్ రూ.16 వేలు, టి.సుజాత అనే మహిళ రూ.లక్ష నగదును కేపీ చౌదరి బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు వివరించారు. -
డబుల్ శాలరీ పడినట్లు మెసేజ్! అంతలోనే..
టెక్నికల్ తప్పిదాలతో ఒక్కోసారి భారీ నష్టాలు వాటిల్లుతుండడం చూస్తుంటాం. అలాంటి తప్పిదమే ఓ బ్యాంక్ నిల్వను ఖాళీ చేసేసింది. పొరపాటున మిలియన్ల డాలర్ల డబ్బు ఖాతాదారుల అకౌంట్లో జమ అయ్యింది. దీంతో డబుల్ జీతాలు పడ్డాయని కొందరు ఉద్యోగులు సంతోషపడగా.. ఆ ఆనందం వాళ్లకు ఎంతోసేపు నిలవలేదు. క్రిస్మస్ పండుగ నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. యూరోపియన్ బ్యాంక్ శాన్‌టాండర్ ఆరోజున లావాదేవీలు నిర్వహించింది. 2 వేలకు పైగా బిజినెస్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ కొట్టింది. 75 వేల ట్రాన్జాక్షన్స్ రూపంలో ఏకంగా 176 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో 1,300 కోట్ల రూపాయలు పైనే) జమ అయ్యాయి. అయితే కాసేపటికే చాలామంది ఉద్యోగులకు డబుల్ జీతాలు పడ్డట్లు సందేశాలు వచ్చాయి. మరోవైపు సప్లయర్స్‌కు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ ఎమౌంట్ అకౌంట్లలో పడింది. దీంతో అంతా డబుల్ బొనాంజా అనుకుని సంతోషపడ్డారు.అయితే.. బ్యాంకు నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో బ్యాంక్ అప్రమత్తం అయ్యింది. ‘షెడ్యూలింగ్ ఇష్యూ’ వల్ల డూప్లికేట్ పేమెంట్స్ జరిగిందని గుర్తించింది. పొరపాటును సరిదిద్దుకునేందుకు రంగంలోకి దిగింది. చాలావరకు అకౌంట్ల నుంచి మనీని వెనక్కి తీసేసుకుంది. అయితే కొన్ని అకౌంట్లు మాత్రం ప్రత్యర్థి బ్యాంకులు నిర్వహించే బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లడం కొసమెరుపు. టెక్నికల్ ఇష్యూ వల్ల తప్పిదం జరిగిందని, రికవరీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని శాన్‌టాండర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. యూకే బ్యాంకింగ్ వ్యవస్థలోని ‘బ్యాంక్ ఎర్రర్ రికవరీ ప్రాసెస్’ ప్రకారం.. జత అయిన డబ్బులను వెనక్కి రప్పించుకునే వీలుంది. అంతేకాదు ఈ పద్ధతిలో అవతలి బ్యాంకులు సైతం యాక్సిడెంటల్‌గా జమ అయిన చెల్లింపులను ఖాతాదారుల అకౌంట్ నుంచి వెనక్కి తీసుకుని.. నష్టపోయిన బ్యాంకుకు అందజేయాల్సి ఉంటుంది. చదవండి: ఒక్క ఏడాది.. పది మంది.. ఎంతో సంపాదించారో తెలిస్తే షాకే! -
PM Kisan Shceme : రైతులకు దక్కాల్సిన రూ.820 కోట్లు ఏమయ్యాయి?
ఇంటర్నెట్ బ్యాంకింగ్ నిర్వాహణ విషయంలో బ్యాంకులు చేస్తోన్న తప్పులకు రైతులు శిక్ష అనుభవిస్తున్నారు. బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. ఇందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరో ఉదాహరణగా నిలుస్తోంది. కిసాన్ యోజన దేశంలో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు (ఐదు ఎకరాలలోపు) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 6000లను కేంద్రం అందిస్తోంది. ప్రతీసారి రూ. 2,000ల వంతున మూడు విడతలుగా ఈ సాయం చేస్తోంది. ఈ పెట్టుబడి సాయం నేరుగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. వ్యవసాయ శాఖ లెక్కలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద దేశ వ్యాప్తంగా 68.76 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ప్రతీ నాలుగు నెలలకు రెండు వేల వంతున జమ చేస్తున్నారు. అయితే రెండేళ్ల కాలానికి సంబంధించి ఎంత మంది రైతులకు సాయం చేశారనే వివరాలను ఇటీవల కేంద్ర వ్యవసాయ ప్రకటించింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దాదాపు దేశ వ్యాప్తంగా ఒక శాతం మంది రైతులకు పెట్టుడి సాయం అందలేదు. 41 లక్షల మంది రైతులు రూ. 820 కోట్లు 2019 ఫిబ్రవరి నుంచి 2021 జూన్ 30 వరకు సేకరించిన వివరాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం వల్ల ఏకంగా 61.04 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ కాలేదు. బ్యాంకులు మరోసారి ప్రయత్నించగా విఫలమైన ఖాతాల్లో 34 శాతం మేరకు అంటే 20.88 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయగలిగారు. మిగిలిన 41 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా జమ కాలేదు. అంటే దాదాపు రూ.820 కోట్ల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలకు చేరనేలేదు. అక్కడే ఎక్కువ వెనుకబాటుతనం ఎక్కువగా ఉండే ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనే ఈ తరహా ఫెయిల్డ్ ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ 10.95 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. వారు ఫిర్యాదులు చేయగా ఇందులో కేవలం 8 శాతం మందికి అంటే 91 వేల మందికి తిరిగి డబ్బులను బ్యాంకులు జమ చేశాయి. బీహార్ విషయానికి వస్తే 1.38 లక్షల విఫల లావాదేవీలు ఉండగా ఇందులో కేవలం 6.8 శాతం మందికే 9,493 మందికే తిరిగి డబ్బులు జమ అయ్యాయి. నిర్లక్ష్యం ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డబ్బు తిరిగి ప్రభుత్వం వద్దకే చేరిందా ? లేక బ్యాంకర్ల దగ్గరే ఆగిపోయిందా అనే అంశంపై స్పష్టత లేదు. కానీ 41 లక్షల మంది రైతులకు అందాల్సిన రూ. 820 కోట్లు దక్కకుండా పోయాయి. రెండేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా సమస్యను పరిష్కరించడంలో బ్యాంకర్లు, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. -
బ్యాంకు లావాదేవీలు ఆన్‘లైన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు ముందు వరకు దేశంలో బ్యాంకు లావాదేవీల్లో ఆన్లైన్ వాటా కేవలం 2 శాతమే. డీమానిటైజేషన్ తర్వాత ఇది 6 శాతానికి వచ్చి చేరింది. ఇక కోవిడ్–19 మహమ్మారి కారణంగా నగదు ముట్టుకోవడానికి ప్రజలు చాలా మంది విముఖత చూపిస్తున్నారు. దీంతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. మొత్తంగా రోజువారీ ఆన్లైన్ లావాదేవీలు గతేడాది 14% ఉంటే.. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఇది ఏకంగా 23%కి వచ్చింది. వైరస్ తీవ్రరూపం దాల్చడంతో బ్యాంకుకు వెళ్లడానికి కస్టమర్లు జంకుతుండడం.. బ్యాంకులు వ్యాపార పనివేళలు కుదించడమూ ప్రస్తుతం ఈ స్థాయి డిజిటల్ లావాదేవీలకు కారణమైంది. భారత్‌లో సగటున బ్యాంకు పనిదినాల్లో రోజుకు రూ.50,000–60,000 కోట్ల విలువైన లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం. బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్.. కోవిడ్–19 మహమ్మారి బ్యాంకులకూ చుట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో 9.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12,000 పైచిలుకు ఉద్యోగులు వైరస్ బారిన పడ్డారు. దాదాపు 600 మంది కోవిడ్–19కు బలయ్యారు. ఈ నేపథ్యంలో పనిగంటలు కుదించాల్సిందిగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అన్ని బ్యాంకులను కోరింది. ఐబీఏ సూచనతో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలు ఇటీవల సమావేశమయ్యాయి. వ్యాపార పనివేళలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు, ఉద్యోగుల పని గంటలు సాయంత్రం 4 వరకు ఉండాలని నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశాయి. ప్రభుత్వాల అంగీకారంతో చాలా రాష్ట్రాలు ఈ పనివేళలను అమలు చేస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఆ నాలుగు సేవలే..: కరోనా కట్టడిలో భాగంగా బ్యాంకులు తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలను సాగిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 50% మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ప్రోత్సహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే 10 శాతంలోపు బ్యాంకు ఉద్యోగులే ఇంటి నుంచి పని విధానంలో విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వ్యాపార పనివేళలు కుదించిన నేపథ్యంలో డిపాజిట్స్, క్యాష్ విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్, ప్రభుత్యానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే బ్యాంకులు అందిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లకు పెద్దగా అడ్డంకులు లేవని ఒక అధికారి వ్యాఖ్యానించారు. వినియోగదార్లు ఏటీఎంలు, పేమెంట్స్ యాప్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వేదికలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని తెలిపారు. 50 శాతం చేయాల్సిందే.. బ్యాంకులన్నీ సగం మంది ఉద్యోగులను షిఫ్ట్ విధానంలో ఇంటి నుంచి పనిచేసేలా వెసులుబాటు కల్పించాలి. మధ్యాహ్నం 2 గంటలకల్లా శాఖలను మూసివేయాలి. వైరస్ ఉధృతి తగ్గేవరకు వికలాంగులు, గర్భిణులు, 55 ఏళ్లకుపైబడ్డ వారిని సెలవులో ఉంచాలి. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. కంటైన్మెంట్ జోన్లలోని శాఖలను పూర్తిగా మూసివేయాలి. శిక్షణ కేంద్రాలను కోవిడ్ సెంటర్లుగా మార్చాలి. బ్యాంకులు సీఎస్ఆర్ కింద 3 శాతం మొత్తాన్ని ప్రజలకు ఖర్చు చేయాలన్నది మా డిమాండ్. – బి.ఎస్.రాంబాబు, తెలంగాణ కన్వీనర్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ -
సుశాంత్, రియా కోసం ఎంత ఖర్చు చేశాడంటే..
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండు నెలలకు పైనే అవుతోంది. రోజులు గడుస్తున్న కొద్ది సుశాంత్ మృతికి సంబంధించి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ రాజ్‌పుత్‌కు చెందిన ఒక బ్యాంక్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన స్వతంత్ర ఆర్థిక విశ్లేషణ జరిగింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థిక ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా సుశాంత్ బ్యాంక్ స్టేట్ట్‌మెంట్‌లలో ఒకదాన్ని పరిశీలించారు. ఈ డబ్బు ఎక్కువగా ప్రయాణ, వ్యక్తిగత విలాసాలు, చారిటీలకు సహాయం, దాతృత్వం, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఖర్చు చేయబడిందని తెలిపారు. ఇందులో కొంత మొత్తం రియా, ఆమె సోదరుడి కోసం కూడా ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. (చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) ఈ సందర్భంగా కనోడియా మాట్లాడుతూ.. ‘సుశాంత్ బ్యాంక్ అకౌంట్‌ను మేం పరిశీలించినప్పుడు వివిధ హెడర్ల కింద ఈ ఖర్చులు జరిగినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిలో రియా, ఆమె సోదరుడు కూడా ఉన్నారు. త ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్ల రుపాయాలు ఖర్చు చేశాడు. దానిలో ప్రయాణానికి సుమారు 42 లక్షలు, పవానా (మహారాష్ట్ర) లోని ఒక ఫామ్‌హౌస్‌కు 33 లక్షలు, వ్యక్తిగత విలాసాలకు 1.1 కోటి రుపాయాలు ఖర్చు చేసినట్లు మేము గుర్తించాము’ అని తెలిపాడు. ‘ఇక రియా కోసం, ఆమె సోదరుడి కసం 9.5 లక్షల రుపాయాలు ఖర్చు చేశాడు. దీనిలో వారి విమాన టిక్కెట్ల కోసం 1.7 లక్షల రుపాయాలు.. 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్ ఖర్చుల కోసం.. 3.4 లక్షలు ఆమె షాపింగ్, మేకప్, ఇతర ఖర్చుల కోసం వాడినట్లు గుర్తించాము’ అన్నారు కనోడియా. (చదవండి: రియాపై 10 గంటలు ప్రశ్నల వర్షం) గతంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా తాను సుశాంత్ డబ్బుతో జీవిస్తున్నాననే వార్తలను ఖండించారు. ‘అతను ఓ స్టార్‌లాగా జీవించడానికి ఇష్టపడేవాడు. తన డబ్బుతో నేను జీవించడం లేదు. మేం ఓ జంటలాగా కలిసి ఉన్నామని’ తెలిపారు. అలానే సుశాంత్ చార్టెడ్ అకౌంటెంట్ సందీప్ శ్రీకాంత్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. సుశాంత్, రియాకు గానీ.. ఆమె కుటుంబ సభ్యులకు కానీ భారీ మొత్తంలో అనగా లక్షల రుపాయాలు లావాదేవీలు చేయలేదని తెలిపారు. వేలల్లోనే డబ్బు పంపారన్నాడు. ఒక సారి రియా తల్లి సుశాంత్‌కి 33 వేల రూపాయలు బదిలీ చేసిందన్నాడు. సుశాంత్ సినిమా హీరో. దానికి తగ్గట్లే అతడు తన జీవితాన్ని జీవించాడు అని తెలిపాడు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం రియాను దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించింది. -
షాక్.. ఫ్రీగా బ్యాంకు ఖాతాలో రూ.85 లక్షలు..!
హారిస్బర్గ్ : పెన్సిల్వేనియాలో నివాసముండే అమెరికన్ రాబర్ట్ తన ఖాతాలోకి అప్పనంగా భారీ మొత్తం వచ్చిపడటంతో షాక్‌కు గురయ్యాడు. రూ.86 లక్షలు అతని ఖాతాలో జమైన విషయాన్ని భార్య టిఫ్ఫాని విలియమ్స్‌కు చెప్పాడు. ఇంకేముంది ఇద్దరికీ ఎప్పుడూలేని కోరికలు, సౌఖ్యాలు గుర్తొచ్చాయి. 15 రోజుల్లోనే దాదాపు రూ. 70 లక్షలు ఖర్చు చేసి.. అదీఇదీ అని కాకుండా అన్ని కొనేశారు. రెండు ఖరీదైన కార్లు కూడా కొనిపడేశారు. ఈ నేపథ్యంలో ‘టెల్లర్ ఎర్రర్’ కారణంగా పొరపాటుగా డబ్బులు రాబర్ట్ ఖాతాలో జమైనట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే రికవరీ కోసం సిబ్బందిని అతని ఇంటికి పంపింది. కానీ, అప్పటికే ఉన్న సొమ్ములన్నీ విచ్చలవడిగా ఖర్చు చేయడంతో ఆ దంపతులు చేతుల్తేశారు. అయితే, అరెస్టు తప్పదని భావించిన టిఫ్ఫాని ఎలాగైనా ఆ మొత్తం కడతామని నమ్మబలికింది. రికవరీ సిబ్బంది కళ్లుగప్పి దంపతులిద్దరూ తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిపై దొంగతనం, మోసం కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 18 లక్షల పూచీకత్తుపై కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇదిలాఉండగా.. దూరపు చుట్టానికి కూడా ఆ దంపతులు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడం గమనార్హం. -
బ్యాంకు ఖాతాలపై నిఘా.!
సాక్షి, కడప అగ్రికల్చర్ : భారత ఎన్నికల కమిషన్ ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో గెలుపుకోసం హైటెక్ తరహాలో నగదు బదిలీ జరగొచ్చనే అనుమానంతో ఎన్నికల కమిషన్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు చేసే రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కూడా ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీనిపై నిఘా పెట్టి క్షేత్రస్థాయిలో బ్యాంకు ఖాతాల వివరాలను ఆరా తీస్తోంది. అ«ధికార తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఓటర్లపై డబ్బుల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జిల్లాలు, నియోజక వర్గాలకు డబ్బు సంచులు చేర్చినట్లు విమర్శలున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టినట్లు బ్యాంకర్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆర్బీఐ ద్వారా అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించినట్లు సమాచారం. కొద్ది రోజుల కిందటే ఆయా బ్యాంకు ఖాతాల వివరాలు రాష్ట్ర స్థాయి కంట్రోలింగ్ ఆఫీసర్లకు అందినట్లు భోగట్టా. జిల్లాలో ఎన్ని బ్యాంకులున్నాయి, శాఖలు ఎన్ని, ఖాతాదారుల సంఖ్య, జన్‌ధన్ ఖాతాల వివరాలు ఆర్బీఐ ద్వారా ఎన్నికల కమిషన్‌కు చేరినట్లు సమాచారం. జిల్లాలో 32 బ్యాంకులుండగా, వీటి పరిధిలో 380 బ్యాంకు బ్రాంచీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, బ్రాంచీలలో కలిపి 30 లక్షల మందికి ఖాతాలున్నాయి. ఇందులో జన్‌ధన్ అకౌంట్లు 3.70 లక్షల వరకు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్లాక్ మనీ కలిగిన వారు నగదుగా మార్చుకోవడానికి జన్‌ధన్ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పెద్దనోట్ల రద్దు సమయంలో చేసిన విధంగా ఓటర్లకు నగదు బదిలీ చేసి ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నట్లు చాలా మందిలో అనుమానాలున్నాయి. అధికార పార్టీ డబ్బు సంచులు.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత నగదు తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే అధికార పార్టీ డబ్బు సంచులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా నాయకులు తమ సన్నిహితులు, అనుచరుల ద్వారా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మండల, గ్రామ యూనిట్‌గా తీసుకుని ఓటర్ల సంఖ్య, మద్యం,, ఇతర ఖర్చులకు లెక్కగట్టి నగదు నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపార సంస్థలు, వాణిజ్యవేత్తలకు పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. కొందరు ఇప్పుడిప్పుడే కొత్త అకౌంట్లు తెరుస్తున్నారు. దీనిని గుర్తించిన ఎన్నికల కమిషన్ కొత్త అకౌంట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా, పట్టణ ప్రాంతాల్లోని మెప్మా గ్రూపులకు చెందిన బ్యాంకు ఖాతాలపై నిఘాకు రంగం సిద్ధం చేశారు. వివిధ కారణాలతో 50 శాతం జన్‌ధన్ ఖాతాలు, 20 నుంచి 30 శాతం జనరల్ ఖాతాలు వినియోగంలో లేవు. ఇలాంటి వాటిని అక్రమార్కులు వినియోగించుకునే అవకాశం ఉందని వాటిని క్లోజ్ చేసుకునే వి ధంగా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు సూచినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. నగదు జమలను ఎన్నికల కమిషన్ నేరుగా గమనిస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. -
డ్రా చేసిన డబ్బు చేతికి రాకపోతే..?
సెల్ఫ్‌చెక్ ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు చాలా సులభమయ్యాయి. ఖాతా తెరవడంతోబాటే బ్యాంక్ ఎటిఎం కార్డ్ వస్తోంది. అయితే దీని వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మన పని గోవిందా! ఏటిఎం కార్డ్ వాడకంలో అప్రమత్తంగా ఉంటున్నారా? 1. బ్యాంక్ ప్రతి 3 లేదా 6 నెలలకోసారి పంపే స్టేట్మెంట్ను పరిశీలించి, తేడా ఉంటే వివరణ కోరతారు. ఎ. కాదు బి. అవును 2. మీ తదనంతరం మీ ఖాతాలో ఉన్న మొత్తం ఎవరికి చెందాలో వారి వివరాలను (నామినీ) తప్పనిసరిగా ఇస్తారు. ఎ. కాదు బి. అవును 3. పిన్ నెంబర్‌ను వరసగా మూడుసార్లు తప్పుగా కొడితే కార్డ్ బ్లాక్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎ. కాదు బి. అవును 4. ఏటిఎం పిన్నెంబర్ను 2–3 నెలలకోసారి మార్చడం మంచిదని తెలుసు. ఎ. కాదు బి. అవును 5. నగదు విత్‌డ్రా చేయడానికి ఏటిఎం కార్డ్‌ను ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని తెలుసు. ఎ. కాదు బి. అవును 6. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వస్తే మినీ స్టేట్మెంట్ను చెక్ చేసుకోవడం, వెంటనే ఏటిఎం పిన్ నంబర్‌ను మార్చడం మంచిదని తెలుసు. ఎ. కాదు బి. అవును 7. ఏటిఎం కార్డ్ పోయినట్లయితే ఆ విషయాన్ని వెంటనే బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లి కార్డును బ్లాక్ చేయిస్తారు. ఎ. కాదు బి. అవును 8. పిన్ నెంబర్‌ను కొన్ని కొండగుర్తుల సాయంతో గుర్తుంచుకోవడం మినహా కార్డ్ మీద రాయడం సురక్షితం కాదు. ఎ. కాదు బి. అవును 9. ఒక్కొక్కసారి విత్‌డ్రా చేయబోయిన మొత్తం చేతికి అందకుండానే ఖాతా నుంచి నగదు నిల్వ తగ్గిపోయినట్లుగా చూపిస్తుంటుంది. ఇటువంటప్పుడు మన నగదును బ్యాంకు నుంచి రాబట్టుకోవాలంటే ఆ స్లిప్‌ను జాగ్రత్త చేయడం తప్పనిసరి అని మీకు తెలుసు. ఎ. కాదు బి. అవును 10.మీకు లాటరీ వచ్చింది అంటూ ఫోన్ చేసి ఏటిఎం కార్డ్ మీద ఉండే సివివి నంబరు అడిగి మోసాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ఎవరికీ సివివి నంబరు చెప్పకూడదని మీకు తెలుసు. ఎ. కాదు బి. అవును పై వాటిలో కనీసం ఏడింటికైనా ‘బి’లు వచ్చినట్లయితే మీకు ఎటిఎం కార్డ్ వాడకంపై తగినంత అవగాహన ఉందని చెప్పవచ్చు. 5 లోపుగా వస్తే మీరు ఎటిఎం కార్డ్ వాడకంలో మరిన్ని జాగ్రత్తలు తెలుసుకోవడం మంచిది. -
స్తంభించిన బ్యాంక్ లావాదేవీలు
► ఉద్యోగుల ఒకరోజు సమ్మె ► ఎస్బీఐ ప్రధాన శాఖల ఎదుట నిరసన కార్యక్రమాలు తిరుపతి (అలిపిరి): బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతవైుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు. జిల్లాలో 20వేల మంది ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపటా్టరు. 593 జాతీయ బ్యాంకు శాఖల లావాదేవీలు స్తంభిం చాయి. చితూ్తరు, మదనపల్లె, పుతూ్తరులోని ఎస్బీఐ ప్రధాన శాఖల ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపటా్టరు. తిరుపతి తిలక్ రోడ్డు బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డప్పులతో హోరెత్తించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ తిరుపతి కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కార్మిక చట్టా లను యజమాన్యానికి అనుకూలంగా మార్చి చట్ట సవరణలు చేయాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ కాన్ఫెడరేషన్ నాయకులు సూర్యకుమార్, మునస్వామి, ఆది నారాయణ, నరేంద్ర సింహ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, ప్రసాద్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు కె.వి.ఎస్.ఎన్.మూర్తి, గిరిధర్, ప్రసాద్ పాల్గొన్నారు. -
అర్థ క్రాంతి
-
ప్రధాని మోదీ మరో సంచలన ప్రకటన
-
ప్రధాని మోదీ మరో సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ తమ బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సమర్పించాలని సూచించారు. అలాగే బీజేపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లంచాలని ఆదేశించారు. ఈ నెల 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 500, 1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోదీ ఆదేశించారు. -
ఇలా చేస్తే మోసపోరు..!
పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు పాటించాలని పెద్దలంటూ ఉంటారు. ఒక సినిమా కూడా వచ్చింది. అలాగే బ్యాంక్ లావాదేవీలు సురక్షితంగా ఉండాలంటే 12 సూత్రాలను పాటించాలన్నది నిపుణుల సూచన. బ్యాంక్ లావాదేవీల విషయంలో గతానికి, ఇప్పటికీ పోలికే లేదు. గత పదేళ్లలో బ్యాంక్ లావాదేవీల స్వరూపం సమూలంగా మారిపోయింది. కానీ ఆ స్థాయిలో జాగ్రత్తలు మాత్రం పెరగలేదు. చిన్ని చిన్ని జాగ్రత్తలతో పెద్దపెద్ద మోసాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. డబ్బులు పోయాక లబోదిబోమంటే లాభమేముంది? అందుకే బ్యాంక్ లావాదేవీల్లో, ఆన్లైన్ ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలివీ... 1 సీవీవీ నంబర్ చెరిపేయండి చాలా మంది కార్డుదారులు చేసే సాధారణమైన తప్పు సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వేల్యూ) నంబర్‌ను పట్టించుకోకపోవడం. ప్రతీ డెబిట్/క్రెడిట్ కార్డు వెనక మూడంకెల సీవీవీ నంబర్ ఒకటి ఉంటుంది. ఇది చాలా కీలకమైన సమాచారం. ఇది మీకు మాత్రమే తెలిసుండాలి. డెబిట్/క్రెడిట్ కార్డ్ తీసుకోగానే ముందు చేయాల్సిన పని... దీనిని చెరిపేయడం. ఈ మూడంకెల నంబర్‌ను గుర్తుపెట్టుకోవడం కానీ, లేదా గుర్తుగా వేరే చోట రాసుకోవటంగానీ చేయాలి. దీంతో ఇతరులకు మీ సీవీవీ నంబర్ తెలిసే అవకాశం లేదు. మీరు ఈ నంబర్‌ను మర్చిపోతే దీనిని తిరిగి పొందే అవకాశం లేదనే విషయాన్ని మాత్రం మరవకండి. 2 ఎవరైనా సీవీవీ నంబర్ అడిగితే... మీ సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ ఏమిటని బ్యాంక్ వాళ్లు అసలు అడగరు. ఒకవేళ వాళ్లు వెరిఫికేషన్ కోసం.. కార్డ్ నంబర్, స్టార్ట్ డేట్, మీ పుట్టిన తేదీ వివరాలను మాత్రమే అడుగుతారు. అలా కాకుండా సీవీవీ నంబర్‌ను గానీ, ఎక్స్పైరీ డేట్‌ను గానీ అడిగినట్లయితే అది ఫ్రాడ్ కేసుగా గుర్తించాలి. సీవీవీ నంబర్‌ను, కార్డ్ ఎక్స్పైరీ డేట్‌ను ఫోన్లో ఎవరికీ చెప్పడం కానీ, ఇ-మెయిల్ చేయడం కానీ ఎప్పుడూ చేయకండి. 3 మీ వాలెట్‌కు బీమా ధీమా వన్అసిస్ట్, సీపీపీ ఇండియా వంటి సంస్థలు వాలెట్ బీమా సౌకర్యాన్నందిస్తున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి మీ వాలెట్‌ను ఈ బీమా కవర్ చేస్తుంది. 4 ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ సీవీవీ తర్వాత మీరు జాగ్రత్త పడవలసిన మరో ముఖ్య విషయం ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. ఎవరైనా తేలిగ్గా ఊహించేలా మీ పాస్వర్డ్ ఉండకూడదు. అలాగని మీరు కూడా మర్చిపోయేంత కష్టంగా కూడా ఉండకూడదు. మీ పుట్టిన రోజు, మీ నిక్‌నేమ్, మీకు ఇష్టమైన వాళ్ల పేర్లు అసలే పెట్టుకోకూడదు. ఈ పాస్‌వర్డ్‌లో క్యాపిటల్ లెటర్స్, నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇది వీలైనంత పొడవుగా ఉంటే మంచిది. పాస్‌వర్డ్‌లో ఎక్కువ అక్షరాలుంటే ఇతరులు సులభంగా ఊహించలేరు, అంతేకాకుండా మీరు టైప్ చేసేటప్పుడు వేరే వాళ్లెవరైనా గమనించినా, పట్టుకోలేరు. ఇక ఈ పాస్‌వర్డ్‌ను ఫోన్లో గానీ, ఈ మెయిల్లో గానీ సేవ్ చేసుకోకూడదు. ఒక వేళ సేవ్ చేసుకోవలసిన పరిస్థితి వస్తే పాస్‌వర్డ్‌ను ఉన్నదున్నట్లుగా కాకుండా మీకు అర్థమయ్యేలా ఏదైనా కోడ్‌భాషలో సేవ్ చేసుకోవడం ఉత్తమం. వేరే ఎవరైనా ఈ కోడ్‌ను చూసినా దానిని డీకోడ్ చేయడం కష్టమవుతుంది. 5 ఎస్ఎంఎస్ అలర్ట్ సౌకర్యం మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి ప్రతీ లావాదేవీకి ఎస్ఎంఎస్ అలర్ట్ సౌకర్యం ఉండేలా చూసుకోండి. చిన్న మొత్తానికి సంబంధించిన లావాదేవీ జరిగినా మిమ్మల్ని అలర్ట్ చేసే ఈ ఎస్ఎంఎస్ సౌకర్యం వల్ల పెద్ద పెద్ద మోసాల బారిన పడకుండా ఉండొచ్చు. 6 పిన్ నంబర్... జాగ్రత్త మనలో చాలా మంది రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు, లేదా, పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకున్నప్పుడు పిన్ నంబర్‌ను నోటితే చెప్పేస్తాం. ఇలా ఎన్నడూ చేయకండి. ఇలా చెప్పడం వల్ల 99 శాతం కేసుల్లో ఎలాంటి నష్టం ఉండదు. కానీ, మీ పిన్ నంబర్ తెలుసుకున్నవాళ్లకు మీ సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ కూడా తెలిసిందనుకోండి. అంతర్జాతీయ వెబ్సైట్లలో మీ కార్డు పేరుతో కొనుగోళ్లు చేసుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ వెబ్సైట్లకు వన్‌టైమ్ పాస్వర్డ్ (భారత్‌లో వెబ్సైట్లకు ఇది తప్పనిసరి) అవసరం లేదు. అందుకని మీ పిన్ నంబర్‌ను మీరే పంచ్ చేస్తే బెటర్. 7 అందుబాటులో కస్టమర్ కేర్ నంబర్లు మీ క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్‌కు సంబంధించి కస్టమర్ కేర్ నంబర్లను మీ ఫోన్లో తప్పనిసరిగా సేవ్ చేసుకోండి. ఏదైనా ఫ్రాడ్ జరిగిందని మీరు గుర్తిస్తే, వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి, వారిని అలర్ట్ చేయవచ్చు. 8 ఇతరులు చూడకుండా ఏటీఎం పిన్ను వాడండి ఏటీఎంల్లో డెబిట్/క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు పిన్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు దానిని కవర్ చేస్తూ చేయి ఉంచడం మంచిదే. చాలా మంది పిన్ తెలిస్తే ఏముంది? కార్డ్ మన దగ్గరే ఉంటుందిలే అన్న ధీమాతో ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. పిన్ నంబర్, సీవీవీ నంబర్, ఎక్స్పైరీ డేట్ కూడా తెలిశాయనుకోండి. ఇంటర్నేషనల్ వెబ్సైట్ల ద్వారా కొనుగోళ్లు చేయవచ్చు. 9 సోషల్ సైట్లలో ఎక్కువ వివరాలు వద్దు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా మంది తమ డేటాను ఇస్తుంటారు. తమ పాన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, పుట్టిన తేదీ.. తదితర విషయాలు పొందుపరుస్తారు. వినియోగదారుల ఫిర్యాదుల వెబ్సైట్లలో ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. ఇలాంటి వ్యక్తిగత వివరాలను వెల్లడి చేయకండి. 10 సైబర్ కేఫ్‌లలో ఆన్లైన్ లావాదేవీలు వద్దు సైబర్ కేఫ్‌లు, ఇతరుల పీసీలలో, బ్యాంకింగ్, లేదా ఆన్లైన్ లావాదేవీలు జరపకండి. సైబర్ కేఫ్‌లలో గానీ, ఇతరుల పీసీల్లో గానీ ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో మనకు తెలియదు కదా. కీ లాగర్స్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా మీరు టైప్ చేసిన కీల ద్వారా కావలసిన సమాచారాన్ని సేకరించే అవకాశాలుంటాయి. కొన్ని వైరస్లు, ట్రోజన్లు మీ ముఖ్యమైన సమాచారాన్ని లాగేసే అవకాశాలూ ఉంటాయి. 11 ఈ మెయిల్ లింక్స్‌ను క్లిక్ చేయకండి మీ ఈ మెయిల్‌కు వచ్చే బ్యాంక్, క్రెడిట్ కార్డ్ వెబ్సైట్ల లింక్స్‌ను క్లిక్ చేయకండి. బహుశా అవి ఫ్రాడ్ వెబ్‌సైట్స్ కావచ్చు. బ్యాంక్ వెబ్సైట్లను స్వయంగా అడ్రస్ బార్లో టైప్ చేసి కానీ, ముందే స్టోర్ చేసుకున్న వెబ్-అడ్రస్ ద్వారా.. బుక్‌మార్క్ ద్వారా ఓపెన్ చేయడం ఉత్తమం. 12 ఫైర్‌వాల్ కొనసాగించండి ఇంటర్నెట్ స్పీడ్ పెంచడానికి చాలా మంది ఫైర్‌వాల్‌ను ఆపేస్తారు. బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు ఇలా ఎప్పుడూ చేయకండి. ఫైర్‌వాల్ మంచి సెక్యూరిటీగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ నుంచి మీరేదైనా డౌన్లోడ్ చేసుకుంటే, దాంతో పాటు వైరస్లు కూడా వస్తాయి. ఇక మీ కంప్యూటర్లో మంచి యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. 13 మొబైల్ యాంటీ వైరస్ మొబైల్ ఫోన్ ద్వారా మీరు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లయితే, మొబైల్ యాంటీ వైరస్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే మంచిది. బ్రౌజర్లో పాస్వర్డ్లు సేవ్ చేసుకోవద్దు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లతో ఏదైనా వెబ్సైట్లో లాగిన్ అయితే బ్రౌజర్లు పాస్‌వర్డ్‌ను సేవ్ చేయాలా అని అడుగుతాయ్. మీరు ఓకే అంటే పాస్వర్డ్ అవసరం లేకుండానే ఆ తర్వాత ఆ వెబ్సైట్లు ఓపెన్ అవుతుంటాయి. ఇలా బ్రౌజర్ ద్వారా పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ సేవ్ చేసుకోకండి. 14 వర్చువల్ కీ బోర్డ్‌ను వాడండి మీకు వీలైతే వర్చువల్ కీ బోర్డ్‌ను వాడండి. స్పై వేర్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా మీరు వాడే కీల ద్వారా కీలకమైన సమాచారాన్ని కాజేస్తాయి. వర్చువల్ కీ బోర్డ్ వాడితే ఇలాంటి ముప్పు తగ్గుతుంది. 15 రెగ్యులర్‌గా కార్డ్ స్వైప్ చేయకపోతే, దానిని ఇంట్లోనే ఉంచేయండి. క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు డెబిట్ కార్డ్‌ను తక్కువగా ఉపయోగిస్తారు. ఆన్‌లైన్‌లోగానీ, మాల్స్‌లో గానీ క్రెడిట్ కార్డ్‌ను ఎక్కువగా ఉపయోగించేటట్లయితే, డెబిట్ కార్డ్‌ను ఇంట్లోనే ఉంచేయడం ఉత్తమం. -
కష్టాల్లో ‘డ్వాక్రా’
నారు పోసిన వాడు నీళ్లు పొయ్యకుండా పోతాడా! అనేది సామెత. అంటే పుట్టుక ఇచ్చిన దేవుడు జీవించడానికి ఏదో మార్గం చూపిస్తాడనేది అర్థం. డ్వాక్రా సంఘాల విషయంలో అది తిరగబడింది. సంఘాల ఏర్పాటుకు బీజం వేసిన సీఎం చంద్రబాబు పదేళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉసురు తీశారు. ఎన్నికల వేళ రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే మాట మార్చారు. హామీ మేరకు రూ.పది వేలు కూడా ఇవ్వకుండా నామం పెట్టారు. అప్పులకు తోడు వడ్డీ భారం పెరిగింది. మళ్లీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సంఘాలపై చీకట్లు అలుముకున్నాయి. సొంత జిల్లాలోనే డ్వాక్రా సంఘాల నుంచి సీఎం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సాక్షి, చిత్తూరు: ఈ ఏడాది జిల్లాలోని 43,837 గ్రూపులకు రూ.1,177 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా బ్యాంకు లు ఇప్పటివరకు కేవలం 12,652 సంఘాలకు రూ.475 కోట్ల రుణాలు మాత్రమే మంజూరు చే శాయి. ఇంకా 31 వేల గ్రూపులకు రుణాలు చెల్లించాల్సి ఉన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో మొత్తం 62 వేల డ్వాక్రా గ్రూపులు ఉండగా, 58,602 గ్రూపులు బ్యాంకుల లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా జిల్లాలో 89 శాతం గ్రూపులు రూ.100 కోట్లు కడుతున్నాయి. 11 శాతం మాత్రమే బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు రుణమాఫీ హామీతో చాలా గ్రూపులు ఎన్నికల అనంతరం బ్యాంకులకు రుణాలు సక్రమంగా చెల్లించలేదు. దీంతో వడ్డీలు పెరి గా యి. నిబంధనల మేరకు మూడు నెలలపాటు బకాయిలు చెల్లించకపోతే అధిక వడ్డీలు పడడమే కాక వడ్డీలేని రుణానికి అర్హత కోల్పోతారు. దీంతో చాలా గ్రూపులు ఇదే పరిస్థితినెదుర్కొంటున్నాయి. చంద్రబాబు రుణమాఫీ హామీని తుంగలో తొక్కడంతో డ్వాక్రా గ్రూపుల అప్పులు పెరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 10,484 గ్రూపులకు సంబంధించి రూ.58 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా రూ.7,436 గ్రూపులు 3 నెలలుగా రూ.147 కోట్లను కట్టలేని పరిస్థితిలో బ్యాంకులకు చెల్లించడం నిలిపివేశాయి. బ్యాంకులు సకాలం లో రుణాలు మంజూరు చేయలేదు. బలవంతపు రుణవసూళ్లు రుణమాఫీ సంగతి దేవుడెరుగు. ముందు డ్వాక్రా రుణాలను తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు డ్వాక్రా రుణాలను బలవంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పైగా పాతబకాయిలకు సంబంధించి రీపేమెంట్ చేయకపోతే అధిక వడ్డీలు వసూలు చేయాల్సి వస్తుందని, బకాయిలు చెల్లించకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదని తేల్చి చెబుత్నున్నారు. సకాలంలో తిరిగి చెల్లించకపోతే రూ.5 లక్షలకు నెలకు రూ.5 వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సందేనంటూ బెదిరిం పులకు సైతం దిగారు . జిల్లాలో 62 వేల డ్వాక్రా సంఘాల్లో దాదాపు 7.80 లక్షల మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 2013-14లో రూ.1387 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో రూ.147 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. గడువులోపు చెల్లించక నిలిచిపోయిన బకాయిలు మరో రూ. 58 కోట్లు ఉన్నారుు. మొత్తంగా ఈ ఏడాది ప్రారంభం నాటికే ఇచ్చిన రూ. 1200 కోట్లు బకాయిలు ఉండగా, బలవంతపు వసూళ్ల పుణ్యమాని ఇప్పటికే 89 శాతం వసూలు చేశారు. రూ. పది వేలు ఏదీ? మరో వైపు అక్కాచెల్లెళ్లకు ఖర్చుల కోసం ఒక్కో సభ్యురాలికి రూ. 10 వేలు ఉచితంగా ఇస్తానని సీఎం ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదే పదే చెప్పారు. కానీ పైసా విదల్చలేదు. జిల్లాలోని 7.80 లక్షలసభ్యులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల వంతున మొత్తం రూ.780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా చంద్రబాబు మాటలు నమ్మి పోసపోయామంటూ మహిళలు వాపోతున్నారు. -
ఏటీఎం చార్జీల మోత.. ఎదుర్కొనేదిలా..
ఏటీఎంలు వచ్చిన తర్వాత అడపా, దడపా వంద.. రెండొందలకు కూడా మెషీన్ దగ్గరకి వెళ్లడం మనలో చాలా మందికి అలవాటుగా మారింది. దీంతో ఖర్చులు పెరిగిపోయిన బ్యాంకులు...ఇలాంటి ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించేయడం మొదలుపెట్టేశాయి. నవంబర్ నుంచి ఇతర బ్యాంకుల ఏటీఎంలే కాకుండా సొంత బ్యాంకుల ఏటీఎంలలో కూడా ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గిపోనుంది. నగదు విత్‌డ్రాయల్ కావొచ్చు.. మినీ స్టేట్మెంట్ కావొచ్చు.. ఏదైనా సరే అయిదు లావాదేవీలు దాటితే ఆపై ప్రతీ దానికి దాదాపు రూ. 20 దాకా కట్టుకోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ముందుగా దీన్ని హైదరాబాద్ తదితర ఆరు మెట్రో నగరాలకే పరిమితం చేస్తున్నారు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ చార్జీల మోత నుంచి తప్పించుకోవడానికి వీలవుతుంది. సాధారణంగా ఏటీఎంలో నగదు విత్‌డ్రాయల్ మాత్రమే కాకుండా బ్యాలెన్స్ చూసుకోవడం, మినీ స్టేట్మెంట్లు తీసుకోవడం వగైరా లావాదేవీలు కూడా ఎక్కువగానే చేస్తుంటాం. ఇలాంటివన్నీ కూడా పరిమితిలోకే వస్తాయి. కనుక, సాధ్యమైనంత వరకూ ఇలాంటివి పెట్టుకోకుండా.. అవసరమైతే ఎస్ఎంఎస్ ద్వారా అకౌంటు బ్యాలెన్స్ వగైరా తెలుసుకోవచ్చు. ప్రతీ కొనుగోలుకు నగదు విత్‌డ్రా చేసుకుని వెళ్లాల్సిన అవసరం లేకుండా వీలైన చోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించవచ్చు. అయితే, వీటిపై 1-2 శాతం దాకా లావాదేవీ ఫీజులు పడే అవకాశంతో పాటు ఫర్వాలేదులే అని ఎక్కువగా ఖర్చు చేసేసే ప్రమాదమూ ఉంది. ఆ విషయంలో జాగ్రత్తపడితే ఫర్వాలేదు. ఏటీఎంలో నుంచి తీస్తే తప్ప కుదరనంతగా పర్సును ఖాళీ చేసుకోకుండా ఉండటం మంచిది. విత్‌డ్రా చేసుకునేటప్పుడే తక్షణావసరం కన్నా కాస్త ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అలాగే, ఊహించని అవసరాల కోసం ఇంటి వద్ద కొంత నగదును అట్టే పెట్టొచ్చు. అలాగని, భారీ మొత్తాలు ఇంటి దగ్గర ఉంచడం అంత శ్రేయస్కరం కాదు. పైగా రూ. 20 ఆదా చేసే ప్రయత్నంలో భారీ మొత్తంపై వచ్చే వడ్డీని కోల్పోయే అవకాశం ఉంది. వీలైనంతగా సొంత బ్యాంకు ఏటీఎంకే ప్రాధాన్యం ఇవ్వండి. ఏటీఎంలు దగ్గర్లో ఎక్కడున్నాయో తెలిపేలా కొన్ని బ్యాంకుల యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని వాడండి.